హెచ్‌టీ కేటగిరీలో పెరగనున్న విద్యుత్ చార్జీలు, ఫిక్స్‌డ్ చార్జీలు
11 కేవీ కనెక్షన్ల చార్జీలకు సమానంగా 33/ 132/ఆపై కనెక్షన్ల చార్జీల పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హైటెన్షన్ (హెచ్‌టీ) కేటగిరీ వినియోగదారులకు విద్యుత్ బిల్లులు షాక్ కొట్టనున్నాయి. విద్యుత్ చార్జీలతోపాటు ఫిక్స్‌డ్ చార్జీలు కూడా పెరగబోతున్నాయి. లోటెన్షన్ (ఎల్టీ) కేటగిరీలో కూడా నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగించేవారికీ ఫిక్స్‌డ్ చార్జీ (డిమాండ్ చార్జీ)లు వాతపెట్టబోతున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రాష్ట్రంలో రూ.1,200 కోట్ల మేర విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతి కోరుతూ.. దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (టీజీఎస్పీడీసీఎల్/టీజీఎన్పిడీసీఎల్) బుధవారంరాత్రి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి కోరాయి. ఈ మేరకు వార్షిక ఆదాయ అవసరాల నివేదిక, కొత్త టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించాయి.
హెచ్‌టీ కేటగిరీకి చార్జీల పెంపుతో రూ.700 కోట్లు, ఫిక్స్‌డ్ చార్జీల పెంపుతో రూ.100 కోట్లు కలిపి రూ.800 కోట్లు భారం పడనుంది. మరో రూ.400 కోట్లను ఎల్టీ వినియోగదారులకు ఫిక్స్‌డ్ చార్జీల పెంపు ద్వారా రాబట్టుకుంటామని డిస్కంలు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. దీనిపై ఈఆర్సీ త్వరలో బహిరంగ విచారణ, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి కొత్త టారిఫ్ ఉత్తర్వులను జారీ చేస్తుంది. నవంబర్ 1 నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
హెచ్‌టీలో ఏకరూప చార్జీలతో..
ప్రస్తుతం హైటెన్షన్ (హెచ్‌టీ) కేటగిరీలో 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ/ఆపై సామర్థ్యం పేరిట మూడు ఉప కేటగిరీల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మూడింటికి వేర్వేరు చార్జీలను విధిస్తున్నారు. ఇందులో 132 కేవీ చార్జీలు తక్కువగా, 33 కేవీ చార్జీలు కొంత తక్కువగా ఉండగా.. వీటికంటే 11 కేవీ చార్జీలు ఎక్కువగా ఇకపై అన్నింటికీ 11 కేవీతో సమానంగా.. ఎక్కువ చార్జీలను వసూలు చేయనున్నారు.
అంటే 33కేవీ చార్జీలు ఒక్కో యూనిట్‌పై 50పైసల చొప్పున, 132కేవీ/ఆపై కనెక్షన్ల చార్జీలు రూపాయి చొప్పున పెరగనున్నాయి. హెచ్‌టీ కేటగిరీలోకి సాధారణ పరిశ్రమలు, లైట్స్ అండ్ ఫ్యాన్స్, కోళ్ల ఫారాలు, సీజనల్ పరిశ్రమలు, ఫెర్రో అల్లాయ్ యూనిట్లు, ఇతరులు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, తాత్కాలిక సరఫరా వంటి వినియోగదారులు వస్తారు.
ఎల్టీ కేటగిరీలో 300 యూనిట్లు దాటితే వాతే
ఎల్‌టీ కేటగిరీలోని గృహ కనెక్షన్లకు లోడ్ సామర్థ్యం (కాంట్రాక్టెడ్ లోడ్) ఆధారంగా ప్రతి కిలోవాట్ (కేడబ్ల్యూ)కు రూ.10 చొప్పున ప్రస్తుతం ఫిక్స్‌డ్ చార్జీలను విధిస్తున్నారు. ఇకపై నెలలో విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించితే వారి ఫిక్స్‌డ్ చార్జీలను కిలోవాట్‌కు రూ.10కి బదులు రూ.50 చొప్పున వసూలు చేస్తారు. ఉదాహరణకు ప్రస్తుతం నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగించే గృహ వినియోగదారులకు ఫిక్స్‌డ్ చార్జీల కింద రూ.30 విధిస్తుంటే.. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే రూ.150 విధిస్తారు.
» ఇక ఎల్టీ కేటగిరీలోని ఇతర వినియోగదారులకు సంబంధించిన ఫిక్స్‌డ్ చార్జీల పెంపునకు కూడా డిస్కంలు ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది. లోటెన్షన్ కేటగిరీలోకి గృహాలు, గృహేతర/ చిన్న వాణిజ్య, పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా పథకాలు, సాధారణ వినియోగదారులు వస్తారు. వీటికి విద్యుత్ చార్జీలను యథాతథంగా కొనసాగించాలని డిస్కంలు ప్రతిపాదించాయి.
ఆదాయ లోటు రూ.13,022 కోట్లు..
రాష్ట్ర డిస్కంలు 2024–25లో రూ.13,022 కోట్ల ఆదాయ లోటును ఎదుర్కోవాల్సి ఉంటుందని అంచనా వేశాయి. ఇందులో ఎస్పీడీసీఎల్ వాటా రూ.8,093 కోట్లు కాగా ఎన్పిడీసీఎల్ వాటా రూ.4,929 కోట్లు. విద్యుత్ చార్జీల పెంపుతో రూ.1,200 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటామని.. మిగతా రూ.11,822 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందజేస్తుందని డిస్కంలు ఈఆర్సీకి ఇచి్చన ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment