సంప్రదాయ హస్తకళలను ఆదరించాలి
అనంతపురం కల్చరల్ : ప్రాచీన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే హస్తకళలు, కళాకారులను ప్రోత్సహించాలని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. అనంత వేదికగా 12 రోజుల పాటు సాగే లేపాక్షి హస్తకళా ప్రదర్శన శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. స్థానిక ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోన శశిధర్‌తో పాటు ఏపీ హసక్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాళీ ప్రసాద్, ఆర్డీఓ మలోల తదితరులు మాట్లాడారు. దేశవ్యాప్తంగా కళాకారులు అనంతకు విచ్చేయడం ఆనందంగా ఉందని, వినూత్నంగా ఉన్న వారి ఉత్పత్తులు మన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. కళలను ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా ఆదరించాల్సిన అవసరముందన్నారు.
లేపాక్షి ఎంపోరియం మేనేజర్ సుధీంద్ర కుమార్ మాట్లాడుతూ ఈనెల 24 నుంచి వచ్చేనెల 5 వరకు ప్రదర్శన సాగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సాగే ప్రదర్శనలో నిర్మల్ పెయింటింగ్స్, బ్లాక్ మెటల్, బ్రాస్ ఐటమ్స్, బంజారా ఉత్పత్తులు, వివిధ చేనేత వస్త్రాలు వంటి సంప్రదాయక హస్తకళలు చోటు చేసుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపోరియం మేనేజర్ వెంకటరమణప్ప, అనంతపురం లేపాక్షి ఎంపోరియం సిబ్బంది సురేష్, అమర్‌నాథ్, వెంకట్రాముడు, కాటమయ్య తదితరులు పాల్గొన్నారు.