హస్తకళల కళాకారులకూ  ఏటా రూ.10 వేలు | CM YS Jagan Comments at the launch of Opco Lepakshi online portal | Sakshi
Sakshi News home page

హస్తకళల కళాకారులకూ  ఏటా రూ.10 వేలు

Published Wed, Oct 21 2020 5:30 AM | Last Updated on Wed, Oct 21 2020 5:30 AM

CM YS Jagan Comments at the launch of Opco Lepakshi online portal - Sakshi

ఆప్కో–లేపాక్షి ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, చిత్రంలో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఉన్నతాధికారులు

హస్తకళలపై ఆధారపడిన వారికి ప్రయోజనం కల్పించే విధంగా రెండు ఆన్‌లైన్‌ స్టోర్లు ప్రారంభిస్తున్నాం. తద్వారా మన కళలు, చేతి వృత్తులను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ కళలు సగర్వంగా తలెత్తుకుని నిలబడాలన్నది ప్రభుత్వ లక్ష్యం.   

సాక్షి, అమరావతి:  హస్తకళల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారికి కూడా ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మన జీవితంలో ఎన్నో రకాలుగా సేవలందిస్తున్న వివిధ వృత్తుల వారికి గౌరవం ఇస్తూ.. దేశ చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, పదవులు ఇచ్చామన్నారు. చేనేత, హస్త కళల ఉత్పత్తులకు మరింతగా మార్కెటింగ్‌ కల్పించేందుకు ‘ఆప్కో– లేపాక్షి ఆన్‌లైన్‌ పోర్టల్‌’ను మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..
 
 ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌   
► రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన కళలు, వృత్తులకు ఆప్కో ఆన్‌లైన్‌ స్టోర్, లేపాక్షి వెబ్‌ స్టోర్‌ ద్వారా జాతీయ, అంతర్జాతీయంగా మరింతగా మార్కెటింగ్‌ సదుపాయం లభిస్తుంది. ఇది ఆయా వృత్తుల కళాకారులకే కాకుండా, వారి ఉత్పత్తులకు కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించేలా చేస్తుంది.  
► అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్ర, అజియో, పేటీఎం, గో కోప్, మిర్రా వంటి ఈ–ప్లాట్‌ఫామ్‌లలో కూడా చేనేత, హస్త కళల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ఆ మేరకు ఆయా సంస్థలతో లేపాక్షి, ఆప్కో ఒప్పందాలు చేసుకున్నాయి. 
► ఆప్కో ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా ఆర్డర్‌ చేసి మంగళగిరి, వెంకటగిరి, మాధవరం, బందరు, రాజమండ్రి, ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, చీరాల తదితర చేనేత, పట్టు, కాటన్‌ చీరలు, వ్రస్తాలు, డ్రెస్‌ మెటీరియల్స్, బెడ్‌షీట్లు పొందవచ్చు.  
► లేపాక్షి వెబ్‌ స్టోర్‌ ద్వారా కొండపల్లి, ఏటికొప్పాక, పెడన, చిత్తూరు కలంకారీ ఉత్పత్తులు, దుర్గి రాతి శిల్పాలు, బుడితిలో తయారయ్యే ఇత్తడి వస్తువులు, శ్రీకాకుళం ఆదివాసీ పెయింటింగ్‌లు, ఉదయగిరిలో చెక్కతో తయారయ్యే కళాఖండాలు, బొబ్బిలి వీణ, ధర్మవరం తోలు బొమ్మలు పొందవచ్చు.  

హస్త కళాకారులకు మంచి జరగాలి 
► ఒక వైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌కు అవకాశం, మరోవైపు ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం వల్ల హస్త కళాకారులకు మంచి జరగాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. ఇప్పుడు ప్రకటించిన రూ.10 వేల సాయాన్ని ఫిబ్రవరి తర్వాత ఇస్తాం.  
► జిల్లాల్లో ప్రసిద్ధి పొందిన హస్త కళల ఉత్పత్తులు ఉంటే, వాటిని కూడా ఈ వెబ్‌ స్టోర్స్‌లోకి తీసుకురావాలి.  ఇప్పుడు చేనేత కారుల కోసం నేతన్న నేస్తం పథకం ఉంది కాబట్టే, ఆ రంగం బతుకుతోంది. అలాంటి వృత్తులు బతకాలంటే ప్రభుత్వ సహాయం, అండగా నిలవడం ఎంతో అవసరం.  
►  ముఖ్యమంత్రి జగన్‌ ఆప్కో– లేపాక్షి ఆన్‌లైన్‌ పోర్టల్‌ ప్రారంభించిన తర్వాత ఒక చీర కొనుగోలు చేశారు.  మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement