మాస్ మ్యారేజ్ స్కీమ్‌ను అమలులోకి తెచ్చిన దివంగత వైఎస్సార్
2015లో ‘దుల్హన్’గా పేరు మార్చిన చంద్రబాబు
రూ.177.96 కోట్ల బకాయిలు చెల్లించిన సీఎం వైఎస్ జగన్
56,194 జంటలకు రూ.427.27 కోట్ల లబ్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద బిడ్డల పెళ్లికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంపైనా రామోజీ కుళ్లు రాతలు మానలేదు. క్రిస్టియన్ మైనారిటీలకు అందించే ‘వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా’ పథకంపై ‘మేనిఫెస్టోలో ఆమెన్.. ఆనక మరిచెన్’ అనే తప్పుడు కథనంతో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారు.
వాస్తవానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే పేద బిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక ప్రోత్సాహం పెంచడంతో పాటు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను సైతం లబ్ధిదారులకు అందించిందనే విషయాన్ని ఈనాడు విస్మరించింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులకు చెందిన 56,194 జంటలకు రూ.427.27 కోట్ల ఆర్థిక సాయం అందించి వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.
ఆరోపణ: వాగ్దానాల అమలుకు ఒక్క రోజు కూడా చర్యలు తీసుకోలేదు
వాస్తవం: గత ప్రభుత్వం హామీలను గుప్పించి అమలు చేయకపోగా అధికారిక వెబ్‌సైట్‌లోనూ మేనిఫెస్టో మాయం చేశారు. ఇది రామోజీ పచ్చ కళ్లకు కన్పించ లేదు. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతలా భావించి అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది.
మేనిఫెస్టోను కళ్ల ముందే కన్పించేలా డిస్‌ప్లే చేస్తూ అందులో ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేసేలా షెడ్యూల్ ప్రకటించి ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరిస్తున్నారు. అయినా సీఎం వైఎస్ జగన్‌పై విషం కక్కే రాతలు రాసింది. క్రైస్తవులకు టీడీపీ హయాంలో అమలు చేసిన పెళ్లి కానుక పథకాన్ని పక్కన పెట్టినట్టు అబద్ధాలు రాసింది. క్రిస్టియన్ మైనారిటీలకు ఆర్థిక సాయం అందిస్తున్నప్పటికీ అదేం లేదంటూ అడ్డగోలు రాతలు అచ్చేసింది.
ఆరోపణ: పెళ్లి కానుక అటకెక్కించారు
వాస్తవం: క్రైస్తవ యువతుల పెళ్లికి గత టీడీపీ ప్రభుత్వం అండగా నిలిచినట్టు రామోజీ అడ్డగోలుగా అబద్ధాలు రాసేశారు. పేద బిడ్డల పెళ్లికి సాయం అందించేలా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ‘మాస్ మ్యారేజ్’ పేరుతో ఆర్థిక సాయాన్ని అందించారు. క్రైస్తవ ఆడ బిడ్డల పెళ్లికి రూ.25వేల ఆర్థిక సాయం, కొత్త బట్టలతోపాటు పెళ్లి వస్తువులు అందించేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ‘దుల్హాన్’ పథకంగా పేరు మార్చి అమలు చేశారు.
ఎన్నికలకు ఆరు నెలల ముందు హడావుడిగా 2018లో రూ.25వేల సాయాన్ని రూ.50వేలకు పెంచుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. పెంచిన మొత్తాన్ని అందించకపోగా బకాయిలు పెట్టారు. 2018 నుంచి జరిగిన 43,490 జంటల(పెళ్లిళ్లు)కు రూ.177.96 కోట్ల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను సైతం విడుదల చేసింది. ఈ వాస్తవాన్ని ఈనాడు మరుగున పరిచింది.
ఆరోపణ: పరిశీలన లేదు.. ఎంపిక లేదు
వాస్తవం: గత ప్రభుత్వం గొప్పలను డబ్బా కొట్టిన ఈనాడుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా షాదీ తోపా పథకాన్ని అమలు చేయడం మింగుడు పడలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడు నెలలకు(త్రైమాసికం) ఒకసారి లబ్ధిదారులందరికీ సాయం విడుదల చేస్తోంది. గత ప్రభుత్వం వధువుకు సాయం అందిస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వధువు తల్లికి అందజేస్తోంది. గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ఐకేపీల పరిధిలోని మండల సమాఖ్య ద్వారా ఎంపిక చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎంపిక చేస్తోంది.
గత ప్రభుత్వంలో పట్టణ, గ్రామీణ లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవాలంటే అవస్థలు పడేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా స్థానికంగా దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కలిగింది. గత ప్రభుత్వంలో బకాయిలు కాలానుగుణంగా విడుదల చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో వివాహం జరిగిన తేదీ నుండి 30 రోజులలోపు దరఖాస్తు చేసుకుంటే మూడు నెలలకు ఒకసారి అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులకు ఆర్థిక సాయం అందిస్తోంది.
ఆడ పిల్లల చదువులను ప్రోత్సహించాలనే మహోన్నత లక్ష్యంతో వివాహాలు చేసుకునే వారు కనీసం పదవ తరగతి విద్యార్హత ఉండాలని నిబంధన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెట్టింది. దీని వల్ల పేద వర్గాలకు చెందిన ఆడపిల్లలందరూ పదవ తరగతికి తగ్గకుండా చదువుకున్నారు. ఉన్నత చదువులు చదివించాలనే సీఎం వైఎస్ జగన్ ఉన్నతాశయం ఆచరణలో మంచి ఫలితాలు ఇస్తోంది. అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన వంటి పథకాల ద్వారా ఉన్నత విద్యకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు.
ఆరోపణ: ఇచ్చిన జీవోకే మళ్లీ జీవో
వాస్తవం: పేద బిడ్డల పెళ్లికి గత ప్రభుత్వం ఏం చేసింది.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతమేరకు సాయం అందిస్తోంది అనేది గమనిస్తే చాలు ఈనాడు రోత రాతల వెనుక ఉన్న మర్మం ఏమిటో తెలుస్తుంది. గత ప్రభుత్వం అరకొర సాయాన్ని కూడా సకాలంలో చెల్లించలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాత బకాయిలు సైతం చెల్లించి ఆర్థిక సాయం పెంచి అందించింది.
మైనారిటీలను ఆదుకున్నది జగన్ ప్రభుత్వం
రాష్ట్రంలో మైనారిటీలను అదుకున్నది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వమే అనేది గర్వంగా చెప్పగలం. ఏపీ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 1,82,270 మందికి రూ.416.56 కోట్ల లబ్ధి చేకూర్చింది. నవరత్నాల్లోని సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ ద్వారా రూ.13,239.49 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో 11,064.88కోట్ల లబ్ధిని అందించింది. ఐదేళ్లలో మొత్తం రూ.24,304.37కోట్లు చెల్లించింది. మైనారిటీ వర్గాలను రాజకీయ, సామాజిక, ఆర్థికంగా ముందుకు నడిపిస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిలుస్తున్నారు. – బొల్లవరపు జాన్ వెస్లీ, చైర్మన్, ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్
Comments
Please login to add a commentAdd a comment