ఒబామాకు అగ్గిపెట్టెలో పట్టే చీర
- ఈ నెల 26న ప్రధాని చేతుల మీదుగా బహూకరణ
- సిరిసిల్ల చేనేత కళకు అంతర్జాతీయ గుర్తింపు
సిరిసిల్ల: సిరిసిల్ల చేనేత కళావైభవానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అగ్గిపెట్టెలో అమరే చీరను భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన చేనేత శిల్పి నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్‌కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడే చీరను మగ్గంపై నేశాడు. ఈ చీరను అమెరికా అధ్యక్షుడికి అందించేందుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు హైదరాబాద్‌లో నల్ల విజయ్‌కుమార్ శనివారం అందించారు.
హైదరాబాద్‌కు చెందిన దైవజ్ఞశర్మ నల్ల విజయ్‌కుమార్‌ను హైదరాబాద్‌కు పిలిపించి అమెరికా అధ్యక్షుడికి అగ్గిపెట్టెలో చీర, పట్టు శాలువాను అందించే విధంగా ఏర్పాటు చేశారు. జనవరి 26న భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆయన సతీమణి భారత్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా నాలుగున్నరమీటర్ల అగ్గిపెట్టెలో ఇమిడే చీరతో పాటు రెండుమీటర్ల శాలువాను ఒబామాకు అందించనున్నట్లు కేంద్రమంత్రి దత్తాత్రేయ ప్రకటించారు.
నల్ల విజయ్‌కుమార్ చేనేత మగ్గంపై నెలరోజుల పాటు శ్రమించి వీటిని నేశాడు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చూసి కేంద్రమంత్రి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని విజయ్‌కుమార్ తెలిపారు. అతితేలికైన చీర, శాలువాను భారత ప్రధాని చేతులమీదుగా అమెరికా అధ్యక్షునికి బహూకరించే అవకాశం రావడంపై విజయ్‌కుమార్ సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో విజయ్‌కుమార్ వస్త్రాలను బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, దైవజ్ఞశర్మ పరిశీలించారు.