Matchstick
-
అగ్గిపెట్టెలో ఇమిడే... ఖురాన్
కావలి: ముస్లింల పవిత్రగ్రంథం ఖురాన్. అయితే అన్ని ఖురాన్లు పెద్దపాటి గ్రంథాలుగా ఉండటం సహజం. కానీ అగ్గిపెట్టెలో పట్టేంత సైజులో ఉంటే ఆశ్చర్యమే కదా.. అలాంటి ఖురాన్ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని షేక్ మహబూబ్‌బాషా వద్ద ఉంది. బాషా చికెన్ దుకాణంలో పనిచేస్తూ రోజూ ఐదు పూటలా నమాజ్ చేస్తారు. 40 ఏళ్ల కిందట తన పాత పెంకుటిల్లు పడగొట్టి కొత్త ఇంటి నిర్మాణం కోసం పునాదులు తీస్తుండగా అగ్గిపెట్టె కంటే చిన్నపాటి పెట్టె కనిపించింది. అందులో అంగుళం కంటే చిన్నపాటి ఖురాన్ కనిపించింది. అందులో 6,666 వాక్యాలు ఉన్నాయి. ఈ పవిత్ర గ్రంథాన్ని ఆ అల్లా తమకు ఇచ్చాడని భావించి అప్పటి నుంచి భద్రపరిచారు. ఖురాన్లో చెప్పినట్లు మానవ జీవితం ఒక ఆట, ఒక వినోదం, మనం కేవలం నిమ్మిత్త మాత్రులం... అల్లా ఎలా చెబితే అలా నడుచుకోవాల్సిందేనని అంటున్నారు మహబూబ్ బాషా. -
ఒబామాకు అగ్గిపెట్టెలో పట్టే చీర
ఈ నెల 26న ప్రధాని చేతుల మీదుగా బహూకరణ సిరిసిల్ల చేనేత కళకు అంతర్జాతీయ గుర్తింపు సిరిసిల్ల: సిరిసిల్ల చేనేత కళావైభవానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అగ్గిపెట్టెలో అమరే చీరను భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన చేనేత శిల్పి నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్‌కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడే చీరను మగ్గంపై నేశాడు. ఈ చీరను అమెరికా అధ్యక్షుడికి అందించేందుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు హైదరాబాద్‌లో నల్ల విజయ్‌కుమార్ శనివారం అందించారు. హైదరాబాద్‌కు చెందిన దైవజ్ఞశర్మ నల్ల విజయ్‌కుమార్‌ను హైదరాబాద్‌కు పిలిపించి అమెరికా అధ్యక్షుడికి అగ్గిపెట్టెలో చీర, పట్టు శాలువాను అందించే విధంగా ఏర్పాటు చేశారు. జనవరి 26న భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆయన సతీమణి భారత్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా నాలుగున్నరమీటర్ల అగ్గిపెట్టెలో ఇమిడే చీరతో పాటు రెండుమీటర్ల శాలువాను ఒబామాకు అందించనున్నట్లు కేంద్రమంత్రి దత్తాత్రేయ ప్రకటించారు. నల్ల విజయ్‌కుమార్ చేనేత మగ్గంపై నెలరోజుల పాటు శ్రమించి వీటిని నేశాడు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చూసి కేంద్రమంత్రి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని విజయ్‌కుమార్ తెలిపారు. అతితేలికైన చీర, శాలువాను భారత ప్రధాని చేతులమీదుగా అమెరికా అధ్యక్షునికి బహూకరించే అవకాశం రావడంపై విజయ్‌కుమార్ సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో విజయ్‌కుమార్ వస్త్రాలను బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, దైవజ్ఞశర్మ పరిశీలించారు. -
ఆవిష్కరణం: అగ్గిపెట్టె...ఎపుడు పుట్టె?
ఆదిమానవుడు రాయి రాయి రాపాడించి అగ్గిని రాజేయడం నేర్చుకున్నాడని పుస్తకాల్లో చదువుకున్నాం. మరి రాళ్లతో జనింపజేసిన అగ్గిని పెద్ద శ్రమలేకుండా అగ్గిపుల్లతో జనింపజేయడం ఎప్పటి నుంచి మొదలైంది, ‘అగ్గిపెట్టె’ వాడకం ఎవరిచేత ప్రారంభమైంది అంటే మాత్రం అంత సులువుగా సమాధానం చెప్పలేం. క్రీస్తుశకం ఆరో శతాబ్దంలో చైనీయులు తొలిసారి అగ్గిపుల్లను వాడటం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. రాపిడి చేత మండే స్వభావం ఉన్న రసాయనాలను మిశ్రమంగా చేసి ఒక పుల్లకు అతికించడం ద్వారా చైనా వాళ్లు అగ్గిపుల్లను సృష్టించారు. అయితే అలాంటి పుల్లలన్నింటినీ ఒక బాక్స్‌లో పెట్టుకుని వాడుకునే ఐడియా మాత్రం చైనావాళ్లకు వచ్చినట్టు లేదు. క్రీ.శ. 18వ శతాబ్దంలో తొలిసారి యూరప్‌లో ‘అగ్గిపెట్టె’ వాడకంలోకి వచ్చినట్టు తెలుస్తోంది. స్టిబ్నేట్, పొటాషియం కొలరేట్, గమ్, స్టార్చ్‌ల మిశ్రమంతో తయారు చేసిన అగ్గిపుల్లను, ఒక కరుకు కాగితంపై గీయడం ద్వారా ఆగ్గిపుడుతుందని జాన్ వాకర్ అనే ఇంగ్లిష్ రసాయన శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఆయన ఆవిష్కరణే అగ్గిపెట్టెకు ఒక రూపం కల్పించింది. బాక్స్‌లో పుల్లలను పెట్టి, బాక్స్‌కు రెండు వైపులా ‘రఫ్ స్పేస్’ను ఉంచి అగ్గిపెట్టెను అగ్గిని జనింపజేసే ఆయుధంగా అందించారు. పేటెంట్ వీరులైన పాశ్చాత్యులు దీనికీ పేటెంట్ పొందారు. స్వీడన్‌కు చెందిన లండ్‌స్ట్రమ్ బ్రదర్స్ అగ్గిపెట్టె పేటెంట్ రైట్స్ సొంతం చేసుకున్నారు. 1862 లో బ్రేనల్ అనే బ్రిటిష్ పారిశ్రామిక వేత్త తొలిసారి అగ్గిపెట్టెలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు. చెక్కపుల్లలతో మొదలైన అగ్గిపెట్టెల ప్రస్థానం మైనపు పుల్లలతోనూ కొనసాగుతోంది.