ఢిల్లీలోని ఎగ్జిబిషన్‌లో ఉదయగిరి స్టాల్‌ను సందర్శించిన ప్రధాని మోదీ (ఫైల్)
ఆ ప్రాంగణంలో కర్రకు ప్రాణం వస్తుంది. అక్కడివారు చెప్పినట్లు హొయలు పోతుంది. వారి చేతుల్లో మెలి తిరుగుతుంది. వారి నైపుణ్యంతో తనువుకు మెరుగులద్దుకుంటుంది. వివిధ ఆకృతుల్లో ఒదుగుతుంది. చూడవచ్చినవారిని ఆకట్టుకుంటుంది. వారి మనసుల్లోకి.. తరువాత చేతుల్లోకి చేరుతుంది. వారి ఇళ్లకు వెళ్లిఅలరిస్తుంది. అందరికీ కనువిందు చేస్తుంది. మాకు కూడా ఇలా ప్రాణమున్న కర్ర కావాలి అనిపిస్తుంది.
సాక్షి, నెల్లూరు: ఉదయగిరి.. రాయలేలిన సీమ. కళలకు కాణాచి. నాటి వైభవ చిహ్నాలతో అలరారు తున్న ప్రదేశం. కాలక్రమంలో అనేక కళలు అంతరించినా.. ఒక వ్యక్తి అకుంఠిత దీక్ష కర్రకు ప్రాణంపోసే కళను బతికించింది. జీవం పోసుకున్న కర్ర.. అనేకమందికి జీవనాధారమైంది. ఈ ప్రాంత ఖ్యాతిని ఇనుమడింపజేస్తోంది. రాష్ట్రాధినేతలు, దేశాధినేతల మనసులు కొల్లగొడుతోంది. ఖండాంతర ఖ్యాతి సాధిస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో చెక్క నగిషీ నైపుణ్యం హస్తకళల ప్రాభవానికి ఊపిరి ఊదింది. ఉదయగిరిలోని దిలాపర్ భాయ్ వీధికి చెందిన అబ్దుల్ బషీర్ ఈ కళను బతికించారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా అందిన ఆ నైపుణ్యాన్ని పదిమందికి ఉపాధి మార్చారు. కర్రతో కళాకృతులు చేసే ఈ హస్తకళను స్థానికంగా కొందరు మహిళలకు నేర్పారు.
అడవికర్రలతో పలు రకాల వస్తువులను తయారు చేయడంపై వారికి శిక్షణ ఇచ్చారు. తొలుత ఆయన ప్రయత్నానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటన్నింటిని అధిగమిస్తూ అడుగులు వేసిన ఆయన మొదట తన కుమార్తెలు గౌసియాబేగం , షాహీదాలకు ఈ కళను నేర్పించారు. ఆ వస్తువుల నైపుణ్యానికి అబ్బురపడిన తిరుపతి లేపాక్షి వారు బషీర్‌ను రాష్ట్రస్థాయి అవార్డుతో సత్కరించారు. దీంతో ఈ కళకు కొంత ప్రాచుర్యం లభించింది. తన తండ్రి నుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్న గౌసియాబేగం.. కొందరు మహిళలతో బృందం ఏర్పాటు చేసుకుని.. చైతన్యజ్యోతి వెల్ఫేర్ సొసైటీ సహకారంతో ఉడెన్, కట్లరీ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. హస్తకళలు, జౌళిశాఖ ఆర్థికసాయంతో సొంతంగా ఓ రేకుల షెడ్డు, కొన్ని యంత్రాలు సమకూర్చుకుని నైపుణ్యానికి మరింత పదును పెట్టి ఉత్పత్తి పెంచారు.
కొయ్యలతో తయారుచేసిన వివిధ ఆకృతుల వస్తువులు
ప్రదర్శనల్లో స్టాల్స్
ఈకళాకారులు ఉదయగిరికి సమీపంలో దుర్గం అటవీ ప్రాంతం నుంచి అవసరమైన ముడి కర్రను తెచ్చుకుంటారు. నర్డి, బిల్ల, బిక్కి, కలివి, దేవదారు, కర్రతో గరిటెలు, ఫోర్క్‌లు, పాత్రలు, ట్రేలు, స్లిక్స్, హెయిర్ క్లిప్స్, బొమ్మలు, చిన్న డైనింగ్ టేబుళ్లు, మ్యాట్లు, చిన్న గ్లాసులు, హాట్ బాక్స్‌లు, ప్లేట్లు, బుట్టలు.. ఇలా 150కి పైగా వస్తువులు తయారు చేస్తున్నారు. గౌసియాబేగం వీటిని వివిధ ప్రాంతాల్లో జరిగే ప్రదర్శనల్లో స్టాల్ ఏర్పాటుచేసి అక్కడ విక్రయించేవారు. వచ్చిన సొమ్మును వస్తువులు తయారు చేసిన మహిళలంతా సమానంగా పంచుకునేవారు. ఈ కృషి ఫలితంగా గౌసియాబేగం రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. ఆమెకు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. ఈ కళను నేర్చుకునే మహిళల సంఖ్య క్రమంగా పెరిగింది. కాలానుగుణంగా అభిరుచులకు పెద్దపీట వేస్తూ కళను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం నిర్వహణ బాధ్యతను గౌసియాబేగం తన కుమారుడు జాకీర్‌హుస్సేన్‌కు అప్పగించారు. న్యూఢిల్లీలో గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఓ ప్రదర్శనలో జాకీర్‌హుస్సేన్ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్‌ను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉదయగిరి హస్తకళను ఆసక్తిగా తిలకించారు. ఆ వస్తువుల తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంతటి నైపుణ్యవంతమైన ఈ కళకు 2016లో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ) ట్యాగ్ లభించింది. ఈ వస్తువులను ఆన్‌లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంచుతున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం మరింత అవసరం
60 ఏళ్ల కిందట ఈ వృత్తిలో ప్రవేశించి ఈ కళను బతికించుకునేందుకు అనేక ఇబ్బందులు పడ్డాను. ఆదాయం లేకపోవడంతో బయటివారు ఎవరూ ముందుకు రాని రోజుల్లో నాకుమార్తెలిద్దరికీ ఈ కళ నేర్పించాను. మా కుటుంబంలో అందరూ ఇదే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వంద కుటుంబాలకుపైగా దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయి. రోజుకు రూ.500 వరకు సంపాదిస్తున్నారు. దీన్ని మరింత విస్తృతపరిచేందుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో అవసరం ఉంది. కొండాపురం మండలం జంగాలపల్లి వద్ద ఏర్పాటుచేసిన స్టాల్‌ను ప్రజాసంకల్ప యాత్రలో ప్రతిపక్షనేత హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించి ప్రశంసించారు. ఇటీవల ఢిల్లీలో ఏర్పాటుచేసిన స్టాల్‌ను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మా మనుమడు జాకీర్‌ను ప్రోత్సహించారు. దీంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నుంచి ఆయన్ని కలవాలని జాకీర్‌కు పిలుపొచ్చింది. ఈ కళకు ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం వస్తుందనే నమ్మకం కలిగింది.
– షేక్ అబ్దుల్ బషీర్
ఆధునిక యంత్రాలు అందించాలి
సంప్రదాయ పద్ధతిలో వస్తువులు తయారుచేయడంతో తగినంత ఆదాయం రావడం లేదు. ఆధునిక యంత్రాలు సమకూరిస్తే వస్తువులు తయారుచేసే సమయం తగ్గుతుంది. ఉత్పత్తి పెరిగి ఆదాయం పెంచుకునే అవకాశముంది. ఈ వృత్తిలో ముస్లిం మహిళలే అత్యధికంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న కేంద్రం ప్రాంగణంలోనే కొత్త భవనం ఏర్పాటుచేసి ఆధునిక యంత్రపరికరాలు సమకూర్చాలి. తద్వారా ఎక్కువమంది ఈ వృత్తిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.
– షేక్ గౌసియాబేగం
Comments
Please login to add a commentAdd a comment