చేనేత ప్రదర్శనను తిలకిస్తున్న మంత్రి కేటీఆర్
చైతన్యపురి (హైదరాబాద్): తెలంగాణలో చేనేత మ్యూజియం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీనగర్ కాలనీలో పద్మశ్రీ గజం గోవర్ధన నివాసంలో ఏర్పాటు చేసిన చేనేత ఆర్ట్ గ్యాలరీని ఎమ్మెల్సీ ఎల్‌రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణితో కలిసి శుక్రవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రదర్శనలో ఉంచిన చేనేత వస్త్రాలు, మగ్గాల గురించి కేటీఆర్‌కు గోవర్ధన వివరించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..చేనేత కళను, చేనేత కళాకారులను ప్రోత్సహించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుదేనని తెలిపారు. పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబాలకు నేతన్న ధీమా పథకాన్ని ప్రవేశపెట్టామని, చేయూత, చేనేత మిత్ర పేరుతో నూలు, రసాయనాలపై 40% రాయితీ ఇస్తున్నామని వెల్లడించారు.
చేనేత ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించటం తనకు దక్కిన అవకాశంగా భావిస్తున్నానని, ప్రతి ఒక్కరూ చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. చేనేత కళాకారుల సంక్షేమానికి పాటుపడుతున్న గజం గోవర్ధనను ఆయన అభినందించారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్‌కుమార్, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, చేనేత కళాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment