‘చేతి’కి చేదోడు | CM YS Jaganmohan Reddy Support To handicrafts with Jagananna Chedodu | Sakshi
Sakshi News home page

‘చేతి’కి చేదోడు

Published Wed, Feb 9 2022 3:10 AM | Last Updated on Wed, Feb 9 2022 3:10 AM

CM YS Jaganmohan Reddy Support To handicrafts with Jagananna Chedodu - Sakshi

జగనన్న చేదోడు చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న సీఎం జగన్‌. చిత్రంలో మంత్రులు, అధికారులు

సాక్షి, అమరావతి: స్వయం ఉపాధినే నమ్ముకున్న చేతివృత్తిదారులు సమాజానికి అమూల్యమైన సేవలు అందిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వేల సంవత్సరాలుగా వివక్షకు గురవుతూ కష్ట జీవులైన వీరంతా పండుగ సమయాల్లో కూడా ఇతరులకు సహాయపడే పనుల్లోనే నిమగ్నమవుతున్నారని గుర్తు చేశారు. అయితే వారి శ్రమకు తగిన ఆదాయం లభించని పరిస్థితులు నెలకొన్నాయని, చేతివృత్తిదారులకు చేయూత అందించకుంటే మొత్తం వ్యవస్థలే కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుందన్నారు.

బీసీలకు గొప్ప సామాజిక న్యాయం అని చెప్పి చెడు చేసిన గత సర్కారుకు, ఈ ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించాలని కోరారు. మంచి మనసుతో పనిచేస్తున్న ప్రభుత్వం మనదని స్పష్టం చేశారు. జగనన్న చేదోడు పథకం కింద వరుసగా రెండో ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,85,350 మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ.285.35 కోట్ల ఆర్థ్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి మాట్లాడారు. ఈ పథకం ద్వారా షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. 

భారీ స్వయం ఉపాధి రంగం
స్వయం ఉపాధి రంగంలో అతి ఎక్కువగా దాదాపు 2.85 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. చేతివృత్తిదారులకు మనమంతా తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది. వీరికి మంచిచేసే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. షాపులున్న 1,46,103 మంది టైలర్లకు రూ.146.10 కోట్లు వారి అకౌంట్లలోకి బదిలీ చేస్తున్నాం. 98,439 మంది రజక సోదరులు, అక్కచెల్లెమ్మలకు రూ.98.44 కోట్లు ఇస్తున్నాం. 40,808 నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు రూ.40.81 కోట్లు సాయాన్ని నేరుగా అందజేస్తున్నాం.

ఆ కష్టాలు స్వయంగా చూశా..
చేతివృత్తిదారుల శ్రమకు తగిన ఆదాయం దక్కని పరిస్థితులున్నాయి. నా పాదయాత్ర సమయంలో వారి కష్టాలను స్వయంగా తెలుసుకుని అధికారంలోకి రాగానే జగనన్న చేదోడు పథకాన్ని తీసుకొచ్చాం. లంచాలు, వివక్ష, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించి సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ అత్యంత పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రెండున్నరేళ్లలో మొత్తం రూ.583.78 కోట్లు చేతివృత్తిదారులకు అందజేశాం.

ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లిచ్చి కమీషన్లు కొట్టేశారు..
గత సర్కారు హయాంలో ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు లాంటివి ఏ కొద్దిమందికో ఇచ్చి అందులోనూ కమీషన్లు కొట్టేశారు. అవి కూడా నాసిరకం, ఉపయోగపడని సామాన్లే. ఎంతో మేలు చేసే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నీరుగార్చిన పరిస్థితులను కూడా గత ప్రభుత్వంలో మనం చూశాం. బీసీలకు గొప్ప సామాజిక న్యాయం అంటూ చెడు చేసిన గత ప్రభుత్వానికి, మంచి మనసుతో నిజమైన చేదోడు అందిస్తున్న మన ప్రభుత్వానికి మధ్య తేడా ఎంత ఉందో గమనించమని కోరుతున్నా.

బీసీలు అంటే బ్యాక్‌ బోన్‌ క్లాస్‌
బీసీలంటే పనిముట్లు కాదు.. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌లు కాదు. వారు సమాజానికి  బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని నిండు మనసుతో నమ్మి ఆచరిస్తున్నాం. వారి జీవితాల్లో మార్పులు రావాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మిగతా వారితో పోటీపడి ఎదగాలి. అందుకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాలని ఈ రెండున్నరేళ్లుగా మనసా, వాచా తపించాం. మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం లాంటి పథకాలతో పాటు నవరత్నాలతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు పెద్దపీట వేస్తూ ప్రతి అడుగులో తోడుగా నిలబడ్డాం. వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ సున్నావడ్డీ, వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ వాహనమిత్ర.. ఇలా పలు పథకాలను తెచ్చాం. ఇంగ్లిష్‌ మీడియం చదువులు, 30 లక్షలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వడం ఇలా ఏది తీసుకున్నా ఎన్నికల ముందు ఏలూరులో ఇచ్చిన మాట ప్రకారం వారిని వెన్నెముక కులాలుగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం.

ఇలాంటి వ్యక్తి.. వారికి ముద్దుబిడ్డ
► ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఈరోజు రామోజీరావుకు.. అంటే ఈనాడుకు ముద్దుబిడ్డ.
► బీసీల తోకలు కత్తిరిస్తానన్న అహంకారి ఇవాళ ఏబీఎన్, టీవీ 5కి ముద్దుబిడ్డ. 
► బీసీలు జడ్జీలుగా పనికిరారని ఏకంగా కేంద్రానికి లేఖలు రాసిన వ్యక్తి ఈ రోజు మన ఎర్రజెండాల వారికి ఆత్మీయ కామ్రేడ్‌. 
► ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా బాబు బినామీల భూముల రియల్‌ ఎస్టేట్‌ కోసం కామ్రేడ్‌ సోదరులు జెండాలు పట్టుకునే పరిస్థితి. 
► అమరావతిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ప్రభుత్వం ఇంటి స్థ్ధలాలను కేటాయిస్తే డెమోగ్రాఫిక్‌ ఇంబ్యాలన్స్‌ (సామాజిక సమతుల్యం) దెబ్బ తింటుందని ఏకంగా కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేసిన చంద్రబాబుకు మద్దతు పలుకుతున్న మహానుభావుల్లో మన కామ్రేడ్‌లు ఉన్నారంటే వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో గమనించాలని కోరుతున్నా.     
– సీఎం జగన్‌

రెండున్నరేళ్లలో ఏం చేశామో మచ్చుకు కొన్ని..
► బీసీ కమిషన్‌ను శాశ్వత ప్రాతిపదికన నియమించిన మొట్టమొదటి రాష్ట్రం మనదే. కేబినెట్‌ కూర్పులోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం మంత్రి పదవులిచ్చిన ప్రభుత్వం మనదే. ఐదుగురు డిప్యూటీ సీఎంలకు గానూ నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారే. 
► శాసనసభ స్పీకర్‌ పదవి సైతం బీసీలకే ఇచ్చి గౌరవించాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 32 మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తే అందులో 18 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. నలుగురిని రాజ్యసభకు పంపిస్తే అందులో సగం అంటే రెండు బీసీలకే ఇచ్చాం.  
► స్థానిక సంస్థ్ధల ఎన్నికల్లో మొత్తం 650 మండలాలలో వైఎస్సార్‌ సీపీ 636 చోట్ల క్లీన్‌ స్వీప్‌ చేయగా 427 మండల అధ్యక్ష పదవులు అంటే 67 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే  ఇచ్చాం. 13 జిల్లా పరిషత్‌ అధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 9 పదవులు అంటే 69 శాతం ఇచ్చాం. 
► 13 నగర కార్పొరేషన్‌ ౖచైర్మన్ల ఎన్నికలకు వెళ్లి దేవుడి దయతో 13 మనమే గెలిచాం.  బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు 12 పదవులు అంటే 92 శాతం ఇచ్చాం.
► 87 మున్సిపాల్టీలలో 84 చోట్ల వైఎస్సార్‌ సీపీ విజయం సాధించగా 61 ౖచైర్మన్‌ పదవులు అంటే 73% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం.
► 196 వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో 118 అంటే 60 శాతం చైర్మన్‌ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి.
► నామినేటెడ్‌ కింద 137 కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులకుగానూ 79 పదవులు అంటే 58 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. 
► 484 నామినేటెడ్‌ డైరెక్టర్ల పోస్టుల్లో 281 పోస్టులు అంటే 58 శాతం ఈ వర్గాలకే  ఇచ్చాం. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టాన్నే చేసిన ప్రభుత్వం మనదే. 
► గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.25 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల్లో 83%ం ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇవ్వగలిగాం.  

కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ,  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ జిల్లాల నుంచి లబ్ధిదారులు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పంచుకున్నారు. వారు ఏమన్నారంటే..     

బీసీలు ఇది తమ ప్రభుత్వమని భావిస్తున్నారు 
ఈ రోజు చేదోడు పథక రచనలోనే మీ మనసును ఆవిష్కరించారు. పేదరికంలో ఉన్నవారిని అందులోంచి బయటపడేసేందుకు మీరు పాదయాత్ర అనే తపస్సు చేశారు. కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని మీకెన్ని కష్టాలు వచ్చినా వారిని ఆదుకున్నారు. కష్టాన్ని నమ్ముకుని జీవించే రజకులు కానీ.. ఇతరులు కానీ ఏ పథకం వచ్చినా వారికి అదనంగా ప్రోత్సాహం ఇవ్వాలని రూ.10 వేలు రెండో ఏడాదీ ఇస్తున్నారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈ పథకం అమలు చేస్తున్నారు. తన అవసరాన్ని ఎవరికీ చెప్పుకోకుండా కేవలం భగవంతుడికే చెప్పుకున్నా అది జగనన్నకు వినపడింది. ఆ కుటుంబాల్లో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడి ఇది తమ ప్రభుత్వం అని భావిస్తున్నారు. బలహీన వర్గాల వారి కష్టాలను మీరు తీరుస్తున్నారు. మీకు సూర్యభగవానుడు మరింత శక్తిని ఇవ్వాలని, మీ ద్వారా రాష్ట్రంలో పేదలందరికీ మంచి జరగాలని, మీరు తలపెట్టిన యజ్ఞఫలం ప్రజలకు అందే సమయంలో మీకు ఆ భగవంతుడు మరింతగా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను.     
    – చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి 

ఏ ప్రభుత్వం చేయని సాయం మీరు చేశారు 
ఆరేళ్లుగా టైలరింగ్‌ సెంటర్‌ నడుపుకుంటున్నాను. నా దగ్గర ముగ్గురు పని చేస్తున్నారు. మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం మాకు అందలేదు. మీరు చేస్తున్న సాయం మా వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడుతుంది. కరోనా కష్టకాలంలో ఈ సాయం మాకు చాలా ఉపయోగకరం. ఈ డబ్బుతో నేను టైలరింగ్‌ మెటీరియల్‌ తెచ్చుకుంటాను. నాకు రూ.5 లక్షల విలువైన ఇంటి స్థలం వచ్చింది. మేం మా తల్లిదండ్రులకు సాయం చేసే పరిస్థితుల్లో లేకపోయినా మీరు మా ఇంటి పెద్దకొడుకులా వారికి కూడా ఇంటి స్థలం ఇచ్చారు. వారి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 
    – తిరుమలశెట్టి వెంకట రమణమ్మ, టైలర్, కాకినాడ 

కరోనా టైంలో చాలా సాయం చేశారు 
నేను 15 ఏళ్లుగా టైలరింగ్‌ చేస్తున్నాను. మీరు పాదయాత్రలో మా కష్టాలు చూసి మాకు ఆర్థిక సాయం చేస్తున్నారు. గత ఏడాది వచ్చిన డబ్బుతో నా షాప్‌ అభివృద్ధి చేసుకున్నాను. ఇప్పుడు రెండో విడత వస్తున్న డబ్బును కూడా సద్వినియోగం చేసుకుంటాను. నా పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన వస్తున్నాయి. రాష్ట్రంలో అనేకమంది పేద పిల్లలకు మీరు మంచి చదువులు చెప్పిస్తున్నారు. కరోనా టైంలో మీరు చాలా సాయం చేశారు. మీరు ప్రతి పథకాన్ని ఆపకుండా నెరవేరుస్తున్నందుకు చాలా ధన్యవాదాలు.     
 – ఎన్‌.సరళ, టైలర్, చిన్నాపురం, మచిలీపట్నం 

నాయీ బ్రాహ్మణులకిచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు 
గతంలో సాయం చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీరు గతంలో మా నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయాల్లో కూడా మాకు స్థానం కల్పించారు. మాకు ఉచిత కరెంట్‌ ఇచ్చారు. సెలూన్‌ షాప్‌లున్న నాయీ బ్రాహ్మణులకు 150 యూనిట్ల ఉచిత కరెంట్‌ ఇస్తున్నారు. మేం ఎవరూ కూడా బిల్‌ కట్టడం లేదు. గతంలో కరెంట్‌ బిల్లు గురించి చాలా ఆందోళన చెందేవాళ్లం. ఇప్పుడా ఇబ్బంది లేదు. గతంలో మేం చాలాసార్లు అందరినీ కలిశాం. ఎవరూ సాయం చేయలేదు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. 
    – స్వామి చంద్రుడు, నాయీబ్రాహ్మణ సంఘ నాయకుడు, కర్నూలు 

దరఖాస్తు చేసుకోగానే సాయం 
నేను ఇంట్లో టైలరింగ్‌ చేసుకుంటున్నాను. ఈ పథకం గురించి వలంటీర్‌ చెప్పారు. నేను దరఖాస్తు చేసుకోగానే సాయం అందింది. మీరు రెండో విడతగా చేస్తున్న సాయం నాకు ఎంతో ఉపయోగపడుతుంది. మా అమ్మకు ఇంటి స్థలం వచ్చింది. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందింది. నాకు డ్వాక్రా రుణమాఫీ కూడా జరిగింది. థాంక్యూ అన్నా.  
    – సంతోషికుమారి, టైలర్, విజయనగరం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement