ఆదిమూలపు సురేష్ (కొండెపి), మేరుగు నాగార్జున (సంతనూతలపాడు), విడదల రజిని (గుంటూరు పశ్చిమ)
సాక్షి, అమరావతి: సామాజిక న్యాయం అనేది నినాదం కాదు.. అనుసరించాల్సిన విధానమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి చాటిచెప్పారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సింహభాగం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి రాజ్యాధికారంలో వాటా కల్పించి సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి చాటిచెప్పిన సీఎం జగన్ తాజాగా 11 నియోజకవర్గాలకు నూతన సమన్వయకర్తల నియామకంలోనూ అదే విధానాన్ని పాటించారు. ప్రస్తుతం అగ్రవర్ణాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించారు. మంత్రులు విడదల రజని, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను మార్పు చేశారు.
మరింత మెరుగైన ఫలితాలే లక్ష్యంగా..
ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సీఎం వైఎస్ జగన్ సమాయత్తం చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులను శాస్త్రీయంగా, క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ మరింత మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ మార్పుచేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో 11 నియజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని సీఎం జగన్ నియమించారు.
గాజువాక ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి కుమారుడు, నియోజకవర్గ సమన్వయర్త దేవన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వరికూటి రామచంద్రరావును నియమించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినిని నియమించారు. ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా కాపు సామాజిక వర్గానికి చెందిన మల్లెల రాజేష్‌నాయుడిని నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment