ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: మునుపెన్నడూ లేనివిధంగా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నామని, ఇంత గొప్పగా ఎప్పుడూ జరగలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మనం చేసిన సామాజిక న్యాయాన్ని ప్రతి నియోజకవర్గంలో వినిపించాలని, ప్రతి గడపకూ చేరవేయాలని ఎమ్మెల్సీ అభ్యర్థులకు సూచించారు.
వైఎస్సార్‌సీపీ తరపున స్థానిక సంస్ధల కోటా, ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించిన వారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారంటే..
సుదీర్ఘ కసరత్తు అనంతరం..
గతంలో ఎప్పుడూ చూడనంత, జరగనంత సామాజిక న్యాయాన్ని దేవుడి దయతో మన పార్టీలో చేయగలుగుతున్నామని గర్వంగా చెప్పుకునే గొప్ప పరిస్థితుల్లోకి వచ్చాం. ఇవాళ చాలా సుదీర్ఘ కసరత్తు అనంతరం 18 మందిని ఖరారు చేస్తే వారిలో 14 మంది బీసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారే. ఇంత గొప్పగా సామాజిక న్యాయం ఎప్పుడూ జరగలేదు. మిగిలిన సామాజిక వర్గాలకు నాలుగు సీట్లిస్తే అందులో కూడా ఒక్కో సామాజిక వర్గానికి ఒకటి చొప్పున కేటాయించాం. మనం చేస్తున్న సామాజిక న్యాయం ప్రతి గడపకూ తెలియాలి, ప్రతి నియోజకవర్గంలోనూ చెప్పాలి.
రాజకీయాల్లో గొప్ప మార్పు
రాజకీయాల్లో ఇంత గొప్ప మార్పు ఎప్పుడూ జరగలేదు. పారదర్శకంగా బటన్ నొక్కి లంచాలకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నాం. విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో మంచి మార్పులు తెచ్చాం. అవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మనం చేసిన సామాజిక న్యాయం మరో ఎత్తు.
దీటుగా, మరింత దూకుడుగా..
పదవులు పొందిన వారు పార్టీని బలోపేతం చేయాలి. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లాంటివి ఒక్కటై లేనిపోని విషప్రచారం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా అంతే ధీటుగా, యాక్టివ్‌గా, మరింత దూకుడుగా పనిచేయడం ద్వారా మన వాణిని సమర్థంగా వినిపించాలి.
మీ నుంచి కోరుకునేది అదే..
మరో 13 – 14 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎమ్మెల్సీలుగా బాధ్యతలు స్వీకరించనున్నవారు పార్టీ కోసం ఏం చేయగలుగుతాం? అన్న ఆలోచనతో అడుగులు వేయాలి. నేను చేయాల్సింది చేశాను... మీకు ఇవ్వాల్సిన పదవులు ఇచ్చా. ఇక పార్టీకి ఏ రకంగా మంచి చేయాలనే కీలక బాధ్యతలు మీపై ఉన్నాయని గుర్తుంచుకోవాలి. మీ తరపు నుంచి నేను అదే కోరుకుంటున్నా. మరింత ఉత్సాహంగా ఉండాలని అందరినీ కోరుతున్నా. పదవులు పొందుతున్న వారందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
వారిని కన్విన్స్ చేసుకుంటూ వెళ్లాలి
ఈ పదవులను ఆశించిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఉన్న పదవులు తక్కువ, ఆశావహులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అందర్నీ సంతృప్తి పరచలేం. కొద్దో గొప్పో కొరత ఉంటుంది. వీరందరికీ కూడా చెప్పే రీతిలో నచ్చచెబుతూ, కన్విన్స్ చేసుకుంటూ వెళ్లాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్ధాపించి ప్రజల పక్షాన నిలబడి రాజకీయాలు చేశాం. అధికారంలోకి వచ్చాం. దేవుడి దయతో మంచి పరిపాలన కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు వై నాట్? అనే రీతిలో అడుగులు ముందుకు వేస్తూ పాలన కొనసాగుతోంది.
మిగతా వారికి ఈసారి
దేవుడు ఆశీర్వదిస్తే గత ఎన్నికల కంటే ఈసారి అత్యధిక స్థానాలు సాధిస్తాం. ఇంకా చాలా మందికి రాబోయే రోజుల్లో ఎక్కువ అవకాశాలు వస్తాయి. చంద్రబాబు అరకొర పదవులిచ్చి బీసీలకు అన్నీ చేసినట్లు ప్రచారం చేసుకోవటాన్ని మనం చూశాం. ఈసారి మనం వడ్డీలు, వడ్డెర కులాల వారికి అవకాశం ఇచ్చాం. రజకులు, నాయీ బ్రాహ్మణులు, ఇంకా మిగిలిన కులాలకు తదుపరి దఫాలో తప్పకుండా అవకాశం ఇస్తామని భరోసా ఇస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment