సాక్షి, అమరావతి: సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీల పక్షపాతి అని వారికి చేసిన మేలుతో రుజువైందని తెలిపారు. విజయవాడ శ్రీరామ ఫంక్షన్ హాలులో బీసీ వెల్ఫేర్ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ఐక్యత–సమగ్రాభివృద్ధి అనే అంశంపై బుధవారం ఏర్పాటు చేసిన సదస్సులో సజ్జల ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేలు జరిగితేనే ఓటువేయండని అడిగే దమ్ము కేవలం ఒక్క జగన్‌కే ఉందన్నారు.
సంక్షేమ పథకాల్లో అవినీతి కనుమరుగైందని, దాదాపు రూ. 2.40 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబ్దిదారులకు చేరిందని చెప్పారు. సామాజిక సాధికార యాత్రకు విశేష ఆదరణ వస్తోందని సజ్జల తెలిపారు. సామాజిక న్యాయానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవుల్లో పెద్దపీట వేశామన్నారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్ అని అన్నారు. మహిళలకు 50 శాతంపైగా రిజర్వేషన్లను అమలు చేస్తూ రాజకీయ పదవుల్లో కూర్చోబెట్టామన్నారు. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి అన్నారు.
జనాభా ఆధారంగా చట్టసభల్లో రిజర్వేషన్లు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నా కూడా బీసీలకు ఇప్పుడు జరుగుతున్నంత మేలు చేయరేమోనని జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు అంగిరేకుల ఆదిశేషు అన్నారు. చట్టసభల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బీసీలకు పటిష్టంగా రిజర్వేషన్లు అమలు చేయాలని, రాష్ట్ర రాజధానిలో బీసీ భవన ప్రధాన కార్యాలయ నిర్మాణానికి 2 వేల గజాలు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
సదస్సుకు ముందు మహాత్మా జ్యోతిరావు సావిత్రి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీసీ వెల్ఫేర్ జేఏసీ గౌరవ అధ్యక్షుడు పి.వెంకట్రావు, పద్మశ్రీ కూటికుప్పల సూర్యారావు, డాక్టర్ లక్ష్మణ్, ప్రొఫెసర్ ఆర్.నాగేశ్వరి, బీసీ నేతలు ధనలక్ష్మి, బొడ్డు కృష్ణ భగవాన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment