ఇది సామాజిక కేబినెట్‌ | Sajjala Ramakrishna Reddy Comments On AP New Cabinet | Sakshi
Sakshi News home page

ఇది సామాజిక కేబినెట్‌

Published Mon, Apr 11 2022 2:36 AM | Last Updated on Mon, Apr 11 2022 10:45 AM

Sajjala Ramakrishna Reddy Comments On AP New Cabinet - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక మహా విప్లవం తీసుకొచ్చారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించిన ధీరోదాత్తుడు సీఎం జగన్‌ అని కొనియాడారు. బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని మరోసారి నిరూపించారని చెప్పారు. అన్ని రంగాల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగ లేదన్నారు. ఈసారి 25 మంది మంత్రుల్లో 70% బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారన్నారు. మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ ఈ వర్గాలకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. చంద్రబాబు ఏ సందర్భంలోనూ బీసీలకు న్యాయం చేయలేదని, ఏనాడూ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండలేదన్నారు. ఇప్పటి వరకు కేబినెట్‌లో ముగ్గురు మహిళలుండగా ఈసారి నలుగురికి అవకాశం ఇచ్చారన్నారు. ఇది ఎన్నికల కోసం చేసిన కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ కాదని తెలిపారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే..

సామాజిక న్యాయం నినాదం కాదు.. నిజం 
► సామాజిక న్యాయం అన్నది నినాదం కాదని, నిజం చేసిన ఏకైక సీఎం జగన్‌. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్ద పీట వేస్తూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు బీసీలకు పదవులిస్తున్నారు. అన్నీ పరిశీలించాకే కేబినెట్‌ తుది జాబితా ఇచ్చారు.
► తరతరాలుగా పేదరికంలో ఉన్న వర్గాలను పైకి తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఏర్పాటైనప్పటి నుంచి మనసా వాచా కర్మణా అడుగులు వేస్తోంది. వైఎస్‌ జగన్‌ పార్టీ పెట్టింది మొదలు ఇదే విధానంతో ముందుకు వెళ్తున్నారు. 
► పాదయాత్ర సమయంలో అన్ని బీసీ కులాలతో సమావేశమై.. వారి ఇబ్బందులపై అధ్యయనం చేయించి, ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్‌ సభ ఏర్పాటు చేసి బీసీలకు తాను చేయబోయే మంచి గురించి జగన్‌ వివరించారు. 2019లో అధికారంలోకి రాగానే వాటిని ఆచరణలో పెట్టారు.  
► గత కేబినెట్‌లో 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, 11 మంది ఓసీలకు అవకాశం కల్పించడం విప్లవాత్మక చర్య. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు కేబినెట్‌తో పోలిస్తే ఇది చాలా గొప్పది. బాబు బీసీలకు ఏమీ చేయలేదు.  

చంద్రబాబు అడ్డగోలుగా కేబినెట్‌ను నడిపారు 
► సోమవారం ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రుల జాబితాను పరిశీలిస్తే సీఎం జగన్‌.. బీసీలకు 10, ఎస్టీ 1, మైనారిటీ 1, ఎస్సీలకు 5 స్థానాలు కేటాయించారు. బీసీలకు ఆత్మబంధువు అని చెప్పుకునే చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేదు. ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం తప్ప. 
► 2014లో 19 మందితో చంద్రబాబు ఆ వర్గాల వారికి 12 పదవులు మాత్రమే ఇస్తే.. ఇవాళ మేము 17 పదవులు ఇచ్చాం. నాడు ఎస్టీ, మైనార్టీలకు చోటే లేదు. అప్పుడు ఓసీ వారు 11 మంది కాగా, మిగిలిన అన్ని వర్గాల వారు కేవలం 8 మంది మాత్రమే. 
► చంద్రబాబు తన కుమారుడిని కేబినెట్‌లోకి తీసుకోవడం కోసమే మంత్రి వర్గంలో మార్పులు చేశారు. 19 మందిలో ఐదుగురిని తీసేసి, 11 మందిని కొత్తగా తీసుకుని మొత్తం 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా ఓసీలు 15 మంది ఉన్నారు. చంద్రబాబు ఇలా అడ్డగోలుగా కేబినెట్‌ను నడిపారు.

అందరూ అర్థం చేసుకుని సహకరిస్తున్నారు..
► మొదటి నుంచీ సీఎం జగన్‌ రాజకీయ సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో 56 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం కల్పిస్తే.. ఇప్పుడు 70 శాతానికి పెంచారు. గతంలో ముగ్గురు మహిళలు ఉండేవారు. ఈ రోజు నలుగురుకి అవకాశం కల్పించారు. 
► నామినేటెడ్‌ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం ఇస్తూ ఏకంగా చట్టమే చేశారు. ఇది ఎన్నికల కోసం చేసింది కాదు. ఈ విషయాన్ని మేధావులు అందరూ గమనించాలి. 
► కేబినెట్‌ పదవి అన్నది అధికారమే తప్ప హక్కు కానేకాదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే 25 కేబినెట్‌ బెర్తులు మాత్రమే ఉన్నాయి. అందరికీ మంత్రులుగా అవకాశం రాదు. కొంత మందికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తాం. పదవి వస్తే ప్రాధాన్యత ఇచ్చినట్లు కాదు. రాకపోతే ప్రాధాన్యత ఇవ్వనట్లు అసలే కాదు. ఈ విషయాన్ని అందరు ఎమ్మెల్యేలూ అర్థం చేసుకుని, సహకరిస్తున్నారు.
► దివాళా తీసిన టీడీపీ ఎక్కడ అలజడి రేగుతుందా.. అని ఎదురు చూస్తోంది. అసంతృప్తి ఉన్నట్లు ఎల్లో మీడియా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. మా పార్టీలో అసంతృప్తికి చోటు లేదు.

అవకాశం రాలేదనుకుంటే పొరపాటే
► రాబోయే ఎన్నికల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించే నాయకులను జిల్లా స్థాయిలో కొంత మందిని, రాష్ట్ర స్థాయిలో మరికొంత మందిని వాడుకుంటాం. రకరకాల బాధ్యతలు ఇచ్చి ప్రా«ధాన్యత కల్పిస్తాం. అవకాశం రాలేదని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. 
► ఇక్కడ ప్రతి ఎమ్మెల్యేకు బీ ఫారం ఇచ్చి గెలిపించుకున్నది సీఎం జగన్‌ మాత్రమే. అందరిపై సీఎం జగన్‌కు ఒకే రకమైన అభిప్రాయం ఉంది. రాగద్వేషాలకు అతీతంగా కేబినెట్‌ కూర్పు చేశారు. జిల్లాలు, సామాజిక వర్గాలను బట్టి కూర్పులో ప్రాధాన్యత ఇచ్చారు. 
► మహాయజ్ఞంలా రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోంది. వెనుకబడిన వర్గాలకు మొదటిసారిగా భారీ స్థాయిలో మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించారు. డిప్యూటీ స్పీకర్‌గా వీరభద్రస్వామికి అవకాశం ఇచ్చారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ముదునూరు ప్రసాదరాజు, ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌గా మల్లాది విష్ణు, స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ బోర్డు చైర్మన్‌గా కొడాలి నానిని నియమించి ప్రాధాన్యత కల్పించారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అందరిని బ్యాలెన్స్‌ చేయడంలో సీఎం జగన్‌ సఫలీకృతం అయ్యారు.  
► సీఎం దృష్టిలో పార్టీ పదవి, మంత్రి పదవి రెండూ ఒక్కటే. ఎక్కడైనా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తే నాయకులు సర్ది చెబుతున్నారు. కాబట్టి అది పెద్ద సమస్య కాదు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement