సామాజిక మహా విప్లవం | Newest social revolution has emerged with Andhra Pradesh Cabinet | Sakshi
Sakshi News home page

సామాజిక మహా విప్లవం

Published Mon, Apr 11 2022 2:20 AM | Last Updated on Mon, Apr 11 2022 7:26 AM

Newest social revolution has emerged with Andhra Pradesh Cabinet - Sakshi

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న వివిధ వర్గాల ప్రజలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సరికొత్త సామాజిక మహా విప్లవం ఆవిష్కృతమయ్యింది. తొలిసారిగా 2019 నాటి కేబినెట్‌ కూర్పులో మొత్తం 25కు గాను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే 14 మంత్రి పదవులిచ్చి వారిని మెజారిటీ వర్గంగా కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. సామాజిక న్యాయాన్ని స్వయంగా ఆచరించి చూపిస్తూ... తాజా పునర్వ్యవస్థీకరణలో ఏకంగా ఆ సంఖ్యను 17కు పెంచారు. దీంతో సోమవారంనాడు కొలువు దీరనున్న కొత్త కేబినెట్‌లో బలహీనవర్గాలకు చెందిన మంత్రుల సంఖ్య 70 శాతానికి చేరుతోంది. ఇక ఆది నుంచి బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు... సొసైటీకి బ్యాక్‌ బోన్‌ (వెన్నెముక) క్లాస్‌ అని చెబుతున్న సీఎం... వారికి దీనిలో 10 బెర్తులు కేటాయించి కొత్త చరిత్రను ఆరంభించారు. అనుభవం, సామాజిక కూర్పు, జిల్లాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇదివరకటి కేబినెట్‌లో ఉన్న 11 మందిని కొనసాగించాలని జగన్‌ నిర్ణయించారు.

కాకపోతే అందులోనూ ఇద్దరు ఓసీలు కాగా, మిగిలిన వారంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు చెందిన వారు కావటం గమనార్హం. మహిళలకు సైతం సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ... ఇప్పటిదాకా ముగ్గురే ఉండగా ఇపుడా సంఖ్యను నాలుగుకు పెంచారు. అగ్రకులాల నుంచి నలుగురు కాపు, నలుగురు రెడ్డి కులస్తులకు మాత్రం కేబినెట్లో స్థానం కల్పించి... కొడాలి నానికి (కమ్మ) రాష్ట్ర అభివృద్ధి మండలి ఛైర్మన్‌గా, విజయనగరానికి చెందిన కోలగట్ల వీరభద్రస్వామికి (వైశ్య) డెప్యూటీ స్పీకర్‌గా, ముదునూరి ప్రసాదరాజుకు (క్షత్రియ) చీఫ్‌ విప్‌గా, మల్లాది విష్ణుకు (బ్రాహ్మణ) రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా అవకాశం కల్పించాలని నిర్ణయించారు.  

తెలుగుదేశానికి పూర్తి భిన్నంగా... 
టీడీపీకి బీసీలే వెన్నుముక.. బీసీలు లేనిదే టీడీపీ లేదంటూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎప్పుడూ చెబుతారు తప్ప నిజంగా బీసీలకు చేసిందేమీ లేదని తాజా పునర్వ్యవస్థీకరణ సందర్భంగా పలువురు సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. గతంలో బాబు హయాంలో ఎప్పుడూ మెజారిటీ మంత్రివర్గ స్థానాలు అగ్రకులాలకే కేటాయించేవారని, సగానికన్నా ఎక్కువ స్థానాలను బలహీనవర్గాలకు కేటాయించిన పరిస్థితి టీడీపీ చరిత్రలో ఎప్పుడూ లేదని వారు గుర్తుచేస్తున్నారు.

గతంలో 2017లో తన కుమారుడు లోకేష్‌ కోసం మంత్రివర్గాన్ని విస్తరించిన చంద్రబాబునాయుడు... 25 మంది మంత్రుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంఖ్యను 10కే పరిమితం చేశారని,, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి ఒక్కరంటే ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదని... ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు ఆయా వర్గాల నుంచి ఓట్ల కోసం ఒక్కొక్కరికి హడావుడిగా స్థానమిచ్చి నాటకమాడారని వారు గుర్తు చేస్తున్నారు. సామాజిక న్యాయానికి అటు చంద్రబాబు ... ఇటు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యం చూస్తుంటే నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోందని చెబుతున్నారు.  
 
ఇదీ... వైఎస్సార్‌ సీపీ సామాజిక న్యాయం 
► రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆదరణ, ఆశీస్సులు, మద్దతుతో 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలతో వైఎస్సార్‌సీపీ ఆఖండ విజయం సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 
► 2019 జూన్‌ 8న 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. 14 మంది (56 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా సామాజిక, రాజకీయ విప్లవానికి సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ఓసీ వర్గాల నుంచి 11 మందికి (44 శాతం) మంత్రి పదవులు ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇంత భారీ ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. 
► ఐదుగురికి ఉప ముఖ్యమంత్రులు ఇస్తే.. అందులో నాలుగు పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కట్టబెట్టారు. తద్వారా సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి సీఎం వైఎస్‌ జగన్‌ చాటి చెప్పారని రాజకీయ పరిశీలకులు అప్పట్లో ప్రశంసించారు. 
► శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను నియమించారు. రాష్ట్ర శాసన మండలి చరిత్రలో తొలి సారిగా చైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్‌ రాజు,  డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంను నియమించారు.  
► శాసన మండలిలో వైఎస్సార్‌సీపీకి 32 మంది సభ్యులు ఉంటే.. అందులో 18 మంది (56.25) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే అవకాశం కల్పించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభలో వైఎస్సార్‌సీపీకి నాలుగు స్థానాలు దక్కితే.. అందులో రెండింటిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించారు.  
 
కార్పొరేషన్, పరిషత్‌ ఎన్నికల్లోనూ.. 
► జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వెఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంది. అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. మండల పరిషత్‌ ఎన్నికల్లో.. 648 మండలాలకు గాను వైఎస్సార్‌సీపీ 635 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులను దక్కించుకుంటే.. అందులో ఈ వర్గాలకు 67 శాతం పదవులు కేటాయించారు. 
► 13 కార్పొరేషన్‌లలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఏడు చోట్ల మేయర్‌ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్‌ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సిపాల్టీల్లో 84 మున్సిపాల్టీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే.. వాటి చైర్‌పర్సన్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 శాతం ఇచ్చారు. 
► నామినేటెడ్‌ పదవుల్లో.. నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేసి, అమలు చేసిన తొలి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ సర్కారే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్‌ కల్పించిన మొదటి ప్రభుత్వం వైఎస్‌ జగన్‌ సర్కారే. 
► రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ(ఏఎంసీ) చైర్మన్‌ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం పదవులు ఇచ్చారు. 
► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్‌లలో 137 చైర్మన్‌ పదవుల్లో 53 (39 శాతం) బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్‌లు, ఎస్సీలకు మూడు కార్పొరేషన్‌లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ► 137 కార్పొరేషన్‌లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్‌ పదవుల్లో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం డైరెక్టర్‌ పదవులు ఇచ్చారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్‌లు, మూడు ఎస్సీ కార్పొరేషన్‌లు, ఒక ఎస్టీ కార్పొరేషన్‌లలో 684 డైరెక్టర్‌ పదవులన్నీ ఆ వర్గాల వారికే ఇచ్చారు. 
  
విప్లవాత్మక నిర్ణయాల అమల్లో మరింత ముందుకు..  
► సామాజిక న్యాయ సాధనలో దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో సీఎం వైఎస్‌ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించారు.  
► 25 మందితో కూడిన మంత్రివర్గంలో ఓసీ వర్గాలకు చెందిన ఎనిమిది మందికి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మందికి చోటు కల్పించారు. ఇందులో పది మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు.. ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అంటే మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారు. సామాజిక న్యాయంలో ఇది మహా విప్లవంగా రాజకీయ పరిశీలకులు, సామాజికవేత్తలు అభివర్ణిస్తున్నారు.  
► 2019 జూన్‌ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో మహిళలకు మూడు మంత్రి పదవులు ఇస్తే.. పునర్‌ వ్యవస్థీకరణలో నలుగురికి మంత్రి పదవులను ఇవ్వడం ద్వారా మహిళా సాధికారతకు తాను ఇస్తున్న ప్రాధాన్యతను చాటి చెప్పారు.  
 
చంద్రబాబు సామాజిక మోసం  
► విభజన నేపథ్యంలో బీజేపీ, జనసేనతో జట్టుకట్టిన టీడీపీ.. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని దక్కించుకుంది. 2014 జూన్‌ 8న 19 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఓసీలకు 11 మంది (58 శాతం)కి.. ఆరుగురు బీసీలకు, ఇద్దరు ఎస్సీలకు.. వెరసి బీసీ, ఎస్సీలకు 42 శాతం మందికి చోటు కల్పించిన చంద్రబాబు సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కారు. 
► కొడుకు నారా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి సభ్యున్ని చేసిన చంద్రబాబు.. 2017 ఏప్రిల్‌ 2న తొలిసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. 25 మందితో ఏర్పాటు చేసిన ఆ మంత్రివర్గంలో ఏకంగా 15 మంది ఓసీల(60 శాతం)కు పదవులు ఇచ్చారు. కేవలం ఎనిమిది పదవులు బీసీలకు, రెండు పదవులు ఎస్సీలకు ఇచ్చారు. అంటే బీసీ, ఎస్సీలకు మంత్రివర్గంలో కేవలం 40 శాతం పదవులే ఇచ్చారు. 
► బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు రాజీనామా చేయడంతో ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు 2018 నవంబర్‌ 11న రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. కనీసం ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాని వ్యక్తికి.. ఆ పదవికి ఎన్నికయ్యేందుకు తగిన సమయం లేకున్నా ఓట్ల కోసం గిరిజన వర్గానికి చెందిన కిడారి శ్రావణ్‌కుమార్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించడం చంద్రబాబు సామాజిక మోసానికి నిలువెత్తు నిదర్శనం.  
► మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్‌ ఫరూక్‌కు అదే సమయంలో మంత్రివర్గంలో చోటు కల్పించారు. చివరి సారిగా మంత్రివర్గ విస్తరణను కలుపుకున్నా.. 13 మంది ఓసీలకు.. 12 మంది ఇతర వర్గాలకు పదవులు కేటాయించి సామాజిక న్యాయాన్ని అపహాస్యం చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement