సీఎం రేవంత్‌రెడ్డికి వంగపల్లి శ్రీనివాస్ సలహా
ఏపీలో సామాజిక న్యాయం అద్భుతంగా అమలవుతోందని ప్రశంసలు
ముషీరాబాద్ (హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న సామాజిక న్యాయం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సామాజిక న్యాయం విషయంలో అక్కడి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లలో 50 శాతానికి పైగా బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు కేటాయించి ఔరా అనిపించుకున్నారని ప్రశంసించారు.
2019తో పోలిస్తే అత్యధికంగా బీసీలకు 48, ఎస్సీలకు 29, ఎస్టీలకు ఏడు, మహిళలకు 19 టికెట్లు కేటాయించారని కొనియాడారు. రెండు రోజుల క్రితం రేవంత్‌రెడ్డి 37 కార్పొరేషన్ల చైర్మన్‌లను ప్రకటిస్తే 17 అగ్రకులాలకు ఇచ్చారని, 50 శాతం ఉన్న బీసీలకు కేవలం 13, 12 శాతం ఉన్న ఎస్టీలకు మూడు, 20 శాతం ఉన్న ఎస్సీలకు కేవలం ఒకే ఒక్క చైర్మన్ పదవిని ఇచ్చారని తెలిపారు.
దీన్ని బట్టే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కేవలం మాటలకు మాత్రమే పరిమితం అని అర్ధమవుతోందన్నారు. ఉద్యమకారులను వాడుకుని వదిలేశారని మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించిన రేవంత్‌రెడ్డి, 37 చైర్మన్ పోస్టులలో ఒక్కటి కూడా ఓయూ ఉద్యమకారులకు ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నట్లు అర్ధమవుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment