గుజరాత్‌లోని కచ్‌లో ఒక మారుమూల గ్రామవాసి పాబిబెన్ రబారి. మేకలు, గొర్రెల పెంపకమే ప్రధాన వృత్తిగా ఉన్న పాబిబెన్ ఇప్పుడు 300 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. జరీ ఎంబ్రాయిడరీ, బ్యాగుల తయారీతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించింది. హస్తకళాకారిణిగా ఆమె కృషి, సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.
పాబిబెన్ బాల్యం తీవ్ర కష్టాలతో గడిచింది. ఐదేళ్ల వయసులో తండ్రిని కోల్పోవడం, తల్లి కొన్ని ఇళ్లలో పాచిపని చేస్తూ తనను, తన చెల్లెలిని పెంచిన విధానాన్ని, మేకలను, గొర్రెలను మేపుకుంటూ బతికిన రోజులను గుర్తు చేసుకుంటుంది ఆమె. ఉన్న కొద్దిపాటి సమయంలో తల్లి సంప్రదాయ ఎంబ్రాయిడరీ పని చేస్తుండేది. అక్కడి వారి కమ్యూనిటీ వివాహ వేడుకల సమయాల్లో తప్పనిసరిగా ధరించే సంప్రదాయ ఎంబ్రాయిడరీ బ్లౌజులు, దుప్పట్లను తయారు చేసేది.
ఒక్కో సంప్రదాయ ఎంబ్రాయిడరీ తయారీకి ఏడాదికి పైగా సమయం పట్టేది. ఈ సంప్రదాయం కారణంగా వారి కమ్యూనిటీలో వివాహాలు ఆలస్యం అయ్యేవి. దీంతో కొన్నాళ్లకు ఈ ఎంబ్రాయిడరీని ఆ కమ్యూనిటీ పక్కనపెట్టేసింది. ఈ సమయంలోనే పాబిబెన్ ఈ సంప్రదాయ ఎంబ్రాయిడరీలో ప్రావీణ్యం సాధించింది. ఒక కళారూపం కనుమరుగు కాకుండా కాపాడాలని నిశ్చయించుకుంది. తమ కమ్యూనిటీలో సంప్రదాయ ఎంబ్రాయిడరీని ప్రతిబింబించే కొత్త రూపాన్ని కనిపెట్టింది. ఇది వేగంగా, తక్కువ శ్రమతో కూడుకున్న కళ కావడంతో అందరినీ తన వైపుకు తిప్పుకుంది.
పాబిబెన్ మొదట నలుగురైదుగురు మహిళలతో కలిసి వివాహ సమయంలో ధరించే ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌లను తయారు చేసేది. చదువు లేకపోయినా తమకు వచ్చిన కళను కాపాడాలని, సాటి మహిళలకు ఉపాధి కల్పించాలనుకొని కొన్ని స్వచ్ఛంద సంస్థలను కలిసింది. కళలకు సంబంధించిన ఆ సంస్థల నుండి కొన్ని ప్రాజెక్ట్ వర్క్‌లను తీసుకుంది. ‘కానీ, నన్ను ఒక ఆలోచన ఎప్పుడూ వేధిస్తూనే ఉండేది. ఈ కళ మా సొంతం.
కానీ, మాకు సరైన గుర్తింపు వచ్చేది కాదు. మేం తయారు చేసిన వాటిని వేర్వేరు బ్రాండ్‌ల కింద అమ్మేవారు. దీనినుంచి బయటపడేందుకు, మా హస్తకళకు మేమే ప్రాచుర్యం తెచ్చుకోవాలని ఉండేది. దీంతో పెద్దస్థాయి అధికారులను కలిశాను. వారి సూచనల మేరకు మా కళకు ఒక ఇంటిని ఏర్పాటు చేశాం. చేతివృత్తుల వారికి మార్కెట్ ప్లేస్‌గా ఆ స్థలాన్ని ప్రారంభించాం. మొదట ఇది చిన్న వ్యాపారంగానే ప్రారంభమైంది కానీ, పనితో పాటు గుర్తింపు కూడా రావాలనుకున్నాను. అది ఈ ఏడేళ్ల సమయంలో సాధించగలిగాం’ అని చెబుతుంది పాబిబెన్.
పాబిబెన్ మొదటి ఉత్పత్తి స్లింగ్ బ్యాగ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘పాబీ బ్యాగ్’ అని ఆమె పేరుతోనే ఆ బ్యాగ్‌ను పిలిచేటంత ఘనత సాధించింది ఈ హస్తకళాకారిణి. పాబిబెన్ బ్రాండ్‌తో ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన ‘పాబిబెన్.కామ్’ అక్కడి గ్రామీణ మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలను తెచ్చిపెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment