చేనేతకు సిసలైన చేవ్రాలు | Weaving the original signature | Sakshi
Sakshi News home page

చేనేతకు సిసలైన చేవ్రాలు

Published Thu, Jul 31 2014 11:17 PM | Last Updated on Sat, Sep 2 2017 11:10 AM

చేనేతకు సిసలైన చేవ్రాలు

చేనేతకు సిసలైన చేవ్రాలు

అతివల మనస్సు దోచే తళుకుబెళుకుల ‘జాందాని’ చేనేత చీరలు...
 వీటి రూపకల్పన వెనుక శక్తిలాంటి ఒక వ్యక్తి కఠోర శ్రమ... అకుంఠిత దీక్ష... అంతకు మించిన నైపుణ్యం ఉన్నాయి!
 ఏదో సాధించాలనే తపన... పదిమందికి ఉపయోగపడాలనే తాపత్రయం... పది మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యం ఉన్నాయి.
 తొమ్మిది పదులు మీద పడినా... చేనేత రంగ అభివృద్ధిపై ఉన్న పట్టుదల,
 హస్త కళలపై ఉన్న మక్కువ...
 చేనేత పారిశ్రామికవేత్త లొల్ల వెంకట్రావుకు
 ఇంకా ఈ రంగంలో కొనసాగేలా స్ఫూర్తి నింపుతున్నాయి...
 ఈ వయసులోనూ ఆయన అవిశ్రాంత కృషి చూస్తే
 ఎవరైనా సరే సలామ్ చేయక మానరు!

 
తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలోని ఆ ఇంట్లోకి ప్రవేశించగానే ఒక టేబుల్ మీద పెద్ద డ్రాయింగ్ షీటు పరుచుకుని డి జైన్లు వేస్తున్న తొమ్మిది పదుల వయస్సు నిండిన ఒక పండు యువకుడు దర్శనమిస్తారు. ఆయన అలా డిజైన్లు ఎందుకు వేస్తున్నారా అని చూసేలోపే, కుర్చీలోంచి లేచి, మగ్గం మీద కూర్చుని తాను ముందుగా గీసిన డిజైన్‌ను చీర మీద తయారుచేస్తూ కనపడతారు. పూవుకు తావి అద్దినట్టుగా చీరెలకు బంగారు లతలు, పూవులు పూయిస్తారు లొల్ల వెంకట్రావు. చేనేత చీరల తయారీలో విప్లవం తెచ్చిన ఘనత ఆయనది. తెల్లటి పంచె లాల్చీ, మందపాటి కళ్లద్దాలతో చాలా సాధారణంగా కనిపించే వెంకట్రావు చేనేత కళకు చేసిన కృషి అసాధారణమైనది.  గుమస్తాగా ప్రారంభించి, ఎందరికో ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. పాఠశాలకు వెళ్లి చదివింది ఎనిమిదో తరగతి వరకే అయినా, జీవితాన్ని మాత్రం నిండుగా చదివారు. ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి వెనుక పెద్ద కథే ఉంది.
 
గుమాస్తాగా...

ఉప్పాడకు చెందిన చేనేత వ్యాపారి పుచ్చల రామలింగం వద్ద గుమస్తాగా చేనేత పని జీవితాన్ని ప్రారంభించిన వెంకట్రావు, ఈ పనిలో చేరడానికి ముందు, ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకున్నారు. స్థానికం పాఠశాలలో ఆరు నెలలపాటు ఉపాధ్యాయ శిక్షణ పొంది, ట్రెయినీగా విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పారు. ‘‘మా నాన్నగారు కులవృత్తిని విడిచిపెట్టవద్దని చెప్పడంతో ఆయన ఆవేదనను అర్థం చేసుకుని కులవృత్తి వైపు అడుగులు వేశాను’’ అని చెబుతారు వెంకట్రావు. గుమస్తాగా పని చేస్తున్న రోజుల్లోనే అంటే 1983 నుంచి జాందాని చీరల తయారీలో విప్లవం తీసుకువచ్చారు. దాంతో అక్కడక్కడ మాత్రమే కనిపించే జాందాని మగ్గాల సంఖ్య వందలకు చేరుకుంది. వేల మంది కార్మికులు ఈ వృత్తిని ఎంచుకున్నారు. ‘‘నేను చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ వేసేవాడిని. జాందాని చీరలలో కొత్త విప్లవం తీసుకురావడానికి ఆ కళ చాలా ఉపయోగపడింది. చీరలపై తీగలు, ఆకులు, జంతువులు, కాయల వంటి కళాకృతులను నేత ద్వారా సృష్టించాను. ఆకృతిని ముందుగానే గ్రాఫ్‌పై తయారుచేసి, దాని మీద నుంచి చీరలపై ఆ డిజైన్ వచ్చేవిధంగా తయారుచేయడం ప్రారంభించాను’’ అని వివరించారు వెంకట్రావు.
 
భవిష్యత్తరాలకు అందించాలని...

చేనేతపై ఇంతటి అభిమానం కలగడానికి బీజం స్వాతంత్య్రానికి ముందే వెంకట్రావులో నాటుకుంది. మహాత్మాగాంధీ ఇచ్చిన విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపుతో స్వదేశీ వస్తువుల మీద ఆయన పెంచుకున్న ప్రేమ ఆ తర్వాత జాందాని కళాభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయిలో ఆ కళ గుర్తింపు పొందడానికి కారణమైంది. తాను మక్కువ పెంచుకున్న కళాభివృద్ధికోసం ఆయన చేసిన అచంచల కృషే ఆ కళపై ఆయన పేటెంట్ హక్కును పొందేలా చేసింది. ‘‘జాందాని కళను భవిష్యత్తరాలకు అందించాలని నా సంకల్పం. అందుకే ఈ కళకు సంబంధించి, ‘జాతీయ హస్తకళలలో జాందాని చేనేత హస్తకళ, దాని ప్రత్యేకత - నా అనుభవాలు’ పేరుతో ఒక పుస్తకం రాశాను’’ అంటారు వెంకట్రావు.
 
చేనేత అభివృద్ధి ధ్యేయంగా...

నేత కార్మికుడి కష్టాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా అనుభవించారు వెంకట్రావు. ‘‘చేనేత రంగం అభివృద్ధి దిశలో పయనిస్తోంది కానీ, కార్మికులు మాత్రం ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నారు. అందుకే ఈ రంగంలో నిష్ణాతులైన సుమారు వంద మంది నిరుపేద చే నేత కార్మికులకు నెలకు 200రూపాయల చొప్పున పింఛను అందిస్తున్నాను. ఊపిరి ఉన్నంతవరకు ఈ రంగం అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటాను’’ అంటారు వెంకట్రావు.
 
ఈ వయసులో కూడా చీరలకు అవసరమైన డిజైన్‌లను తానే తయారుచేసుకోవడాన్ని బట్టే ఆయన దీక్ష, పట్టుదల ఎలాంటివో అర్థమవుతుంది. కళల అభివృద్ధికి ఇలాంటి కార్యశూరులే కదా కావాల్సింది!
 
- ఎల్ శ్రీనివాసరావు, సాక్షి, కాకినాడ
ఫొటోలు: ఎస్‌వివివిఎస్ ప్రసాద్, పిఠాపురం

 
జాందాని అంటే...

 
సాధారణంగా ఏదైనా చీరలకు డిజైన్ ఒక వైపు మాత్రమే కనిపిస్తుంది. జాందాని చీరలపై మాత్రం రెండు వైపులా డిజైన్ ఒకేలా కనిపిస్తుంది. జాందాని అనేది పర్షియన్ పదం. సంస్థానాధీశుల కాలంలో దీనిని వాడుకలోకి తీసుకువచ్చారు. రాణుల కోసం ప్రత్యేకంగా ఈ చీరలు తయారు చేయించేవారు. కాలక్రమంలో వీటిని మన రాష్ట్రంలో కొత్తపల్లిలో నేయడం ప్రారంభించాక వీటికి విస్తృత ప్రాచుర్యం లభించింది. వెండి బంగారు జరీలతో నేత నేయడం వలన ఈ చీరల ధర రూ. 10 వేల నుంచి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. ఒకవేళ చీర చిరిగినా, పాడైనా సగం ధర తిరిగి రావడం వీటి విశిష్టత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement