బాణసంచా కేంద్రంలో పేలుడు.. భారీ ప్రాణ నష్టం
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. యూ కొత్తపల్లి మండలం వాకతిప్పలో ఎండీవో కార్యాలయం సమీపంలోని ఓ బాణసంచా గోదాములో సోమవారం పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించగా, మరి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. కాలిన శరీరాలతో అక్కడ భయానకవాతావరణం నెలకొంది. బాణసంచా గోదాములో మంటలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి. స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
పేలుడు శబ్దం పది కిలో మీటర్ల దూరం వరకు వినిపించినట్టు స్థానికులు చెప్పారు. క్షతగాత్రులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ప్రమాదంపై స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మంటలను వెంటనే ఆర్పివేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.