
హత్యకు గురైన వెంకటేశ్వరరావు, నిందితుడు నారాయణస్వామి
యానాం(తూర్పు గోదావరి): పట్టపగలే ఓ వ్యక్తి హత్యకు గురవడం యానాంలో సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని గోపాల్ నగర్ మోకా వారి వీధికి చెందిన మోకా వెంకటేశ్వరరావు (57)ను ఆయన ఇంట్లోనే ఓ దుండగుడు శనివారం కత్తితో దాడిచేశాడు. తీవ్ర గాయాలతో రక్తస్రావం అవుతున్న వెంకటేశ్వరరావును కుటుంబ సభ్యులు కారులో హుటాహుటిన యానాం జీజీహెచ్‌కు తరలించారు.
అప్పటికే అతడు మృతి చెందాడు. మధ్యాహ్నం తాను బయటకు వెళ్తున్నప్పుడు కాజులూరు మండలానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి నారాయణస్వామి తమ ఇంటికి వచ్చాడని హతుని కుమారుడు ఆనందమూర్తి పోలీసులకు చెప్పాడు. అతడే తన తండ్రిని హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. నారాయణస్వామి వద్ద వెంకటేశ్వరరావు గతంలో అప్పు తీసుకున్నట్టు సమాచారం.
ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన గొడవలే ఈ హత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నారాయణస్వామి పోలీసులకు లొంగిపోయినట్టు తెలిసింది. వెంకటేశ్వరరావు మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. ఈ సంఘటనపై ఎస్సై నందకుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు మృతదేహాన్ని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ జీజీహెచ్‌లో సందర్శించారు. హతుని కుమారుడు ఆనందమూర్తిని ఓదార్చారు. ఎస్పీ బాలచంద్ర, సీఐ అర్విసెల్వంలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.