సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్రీధర్ , ఇతర పోలీసు అధికారులు ( అంతరచిత్రం) హత్యకు గురైన జయదీపిక
రామచంద్రపురం: సొంత ఇంట్లోనే యువతి దారుణంగా హత్యకు గురైన సంఘటన రామచంద్రపురం పట్టణంలో సంచలనం రేకెత్తించగా.. తన కొడుకే తన కూతురిని హతమార్చినట్టుగా అనుమానిస్తూ ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ యువతి మర్డర్ కేసు మిస్టరీగా మారింది. స్థానికులు, పోలీసులు, యువతి తండ్రి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు నందుల రాజు కథనం ప్రకారం.. టీడీపీ పట్టణ అధ్యక్షుడు నందుల సూర్యనారాయణ(రాజు)కు అమృతా బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. ఈయనకు జయదీపిక(20), జయప్రకాశ్‌నాయుడు అను ఇద్దరు కవల పిల్లలున్నారు.
జయదీపిక ఎ.అగ్రహారం కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బార్‌లో పనిచేసే దుర్గసాయి కల్యాణ్ అనే వ్యక్తి నందుల రాజు ఇంటికి వెళ్లగా.. ఇంటిలో తీవ్రగాయాలతో జయదీపిక అపస్మారక స్థితిలో ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దీపికను అంబులెన్స్‌లో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రామచంద్రపురం సీఐ కె.శ్రీధర్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాకినాడ నుంచి క్లూస్ టీం పోలీస్ డాగ్స్‌తో వచ్చి వివరాలను సేకరించింది. అడిషనల్ ఎస్పీ ఎస్. దామోదర్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రేమ వ్యవహారం వల్లే..
తన కుమార్తె ఇటీవల ప్రేమ వ్యవహారం నడుపు తోందని తన కొడుకు జయప్రకాశ్‌నాయుడు తన దృష్టికి తీసుకువచ్చాడని, ఈ నేపథ్యంలో దీపికను అతడే హత్య చేసి ఉంటాడని దీపిక తండ్రి రాజు పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఐ శ్రీధర్‌కుమార్ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
మిస్టరీగా మారిన మర్డర్
పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న నందులరాజు ఇంటిలో అతి దారుణంగా ఆయన కూతురు హత్యకు గురికావడం మిస్టరీగా మారింది. తన కన్నకొడుకుపైనే అనుమానం ఉందంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం మరింత ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా కుటుంబంలో నెలకొన్న ఆస్తి తగాదాలే, హత్యకు దారి తీశాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు దీపిక హత్యపై పట్టణంలో ఎన్నో వదంతులు వ్యాపించాయి. చివరకు తండ్రి నందులరాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏదేమైనా పోలీసులు అధికార పార్టీ ప్రలోభాలకు లోనుకాకుండా దర్యాప్తు చేస్తేనే అసలు విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment