నాగోలు: అది కొత్తపేట– నాగోలు రహదారి.. శుక్రవారం సాయంత్రం.. వాహనాల రొద ఒకవైపు.. జన సంచారం మరో వైపు.. ఇదే సమయంలో అక్కడ వేట కొడవళ్లు విరుచుకుపడ్డాయి. సినీ ఫక్కీలో ఓ గుంపు దారుణంగా దాడికి పాల్పడింది. బాధితుల రోదనలు, రక్తపు మరకలతో ఆ ప్రాంతమంతా భయాందోళనతో గజగజ వణికిపోయింది. పాత కక్షలతో.. ఒకరిపై గురి పెట్టి వచ్చిన.. తమకు సంబంధం లేని ఇద్దరు యువకులపై వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. చైతన్యపురి పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన పురుషోత్తం అనే వ్యక్తి రెండేళ్ల క్రితం హయత్‌నగర్‌లో జరిగిన పెళ్లి ఊరేగింపు ఏర్పడిన వివాదం నేపథ్యంలో తన స్నేహితుడైన తట్టిఅన్నారంనకు చెందిన బోడ్డు మహేష్ పై బీరు బాటిల్‌తో దాడి చేశాడు.
ఈ ఘటనలో తలకు గాయాలైన మహేష్ హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు కోర్టులో నడుస్తోంది. అయితే.. ఆ తర్వాత వీరిద్దరూ రాజీ కోసం మాట్లాడుకున్నారు. పురుషోత్తం వద్ద మహేష్ కొన్ని డబ్బులు కూడా తీసుకున్నాడు. శుక్రవారం కేసు విషయమై మహేష్ కోర్టుకు రావాల్సి ఉంది. కానీ తాను సూర్యాపేటలో ఉన్నానంటూ కోర్టు కానిస్టేబుల్‌కు చెప్పి పురుషోత్తం హత్యకు పథక రచన చేశాడు. నాగోలు వెళ్లే రోడ్డులోని అమరావతి వైన్స్ వద్ద పురుషోత్తం ఉన్నాడనే పక్కా సమాచారంతో మహేష్ తన స్నేహితులైన బెల్లి భరత్, దాసరి సురేందర్ అలియాస్ సూరి తదితరులు కారు, బైక్‌లపై వచ్చారు. పురుషోత్తంపై వేట కొడవలితో దాడి చేయబోగా అతను తప్పించుకున్నాడు.
దీంతో పురుషోత్తం స్నేహితులైన సికింద్రాబాద్ తుకారాం గేట్‌కు చెందిన గడ్డమోయిన రాము, నాగోలు తట్టిఅన్నారంనకు చెందిన పాశం నాగరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు సమీపంలోని ఓ బ్యాంకులో తలదాచుకున్న రాముపై వేట కొడవళ్లతో దాడి చేయడంతో ఆ ప్రాంతమంతా రక్తం మడుగును తలపించింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎల్‌బీనగర్ డీసీపీ ప్రవీణ్, అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు చైతన్య పురి ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరావుతో వివరాలు సేకరించారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చైతన్యపురి పోలీసులు తెలిపారు.
హిట్ అండ్ రన్.. బీటెక్ విద్యార్థి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment