మంగళవాయిద్యాలు మోగాల్సిన చోట మృత్యుపంజా | 3 Deceased As Car Falls Into Canal At K Gangavaram Mandal | Sakshi
Sakshi News home page

మంగళవాయిద్యాలు మోగాల్సిన చోట మృత్యుపంజా

Published Sat, Dec 5 2020 6:52 AM | Last Updated on Sat, Dec 5 2020 7:38 AM

3 Deceased As Car Falls Into Canal At K Gangavaram Mandal - Sakshi

మృతి చెందిన దంపతులు ప్రసాద్, విజయలక్ష్మి, కుమారుడు ప్రణీత్‌ చంద్ర

‘ఆకాశమంత పందిరి...భూదేవంత పీట వేద్దామా...పెళ్లి బాజాలు మారుమోగిపోవాలి...విద్యుత్తు కాంతులు ధగధగలాడాలి... పెద్ద ఎత్తున బంధువులను పిలవాలి ... వారికి పెట్టే భోజనాలు కొన్నేళ్లపాటు గుర్తుండిపోవాలి...కల్యాణ మండపం కొత్తకాంతులీనాల’ంటూ ఆ క్షణం వరకూ సంబర పడిన చోట తీవ్ర విషాదం అలముకుంది. ఈ సందడికి కారణమైన వరుడితోపాటు తల్లిదండ్రులను మృత్యువు జలసమాధి చేసింది. నిశ్చితార్థానికి గుర్తుగా కొనుగోలు చేసిన కొత్తకారే మృత్యుకుహరంగా మారింది. కట్టిన మామిడి తోరణాలు వాడకముందే ఆ ఇంట చావుబాజా మోగాల్సి వచ్చింది. 

పెళ్లికుమార్తె ఇంట ఆ యువకుడి నిశ్చితార్థం ఎంతో ఆనందంగా జరిగింది.  అనంతరం కోలాహలంగా జరిగిన ఆ వేడుకకు గుర్తుగా వరుడి తల్లిదండ్రులు కారు కొనుగోలు చేశారు. పెళ్లికుమారుడితో కలిసి తల్లిదండ్రులిద్దరూ ఆ కారులోనే ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యారు. ఊహించని విధంగా ఆ కారే వారి పాలిట మృత్యుశకటమైంది. మార్గం మధ్యలో అదుపు తప్పి ఓ మంచినీటి చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ ఇంటివాడు కావాల్సిన ఆ యువకుడితో పాటు అతడి తల్లిదండ్రులూ జలసమాధి అయ్యారు. మరికొన్ని రోజుల్లో పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇంట ఈ సంఘటన పెనువిషాదాన్ని నింపింది.    

సాక్షి, కె.గంగవరం/యానాం: జీవిత పయనంలో కీలక మలుపు అయిన వివాహ క్రతువులోని ప్రతి ఘట్టం కడదాకా ఓ మధురానుభూతిగా మిగిలిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ యువకుడూ అలానే కోరుకున్నాడు. కానీ, అతడిపై విధి చిన్నచూపు చూసింది. మృత్యువు పంజా విసిరింది. నిశ్చితార్థం జరిగిన కొద్ది గంటల్లోనే కని, పెంచిన తల్లిదండ్రులు సహా అతడు, మృత్యుకౌగిట్లోకి ఒరిగిపోయాడు. నిశ్చితార్థానికి గుర్తుగా కొనుకున్న కొత్త కారే వారి జీవితాలకు జలసమాధి కట్టేసింది. ఆనందంగా ఇంటికి చేరుకొని, పెళ్లి పనుల్లో మునిగిపోవాల్సిన వారు.. అయినవారికి మృత్యువేదనను పంచి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. నిశ్చితార్థ వేడుక సందర్భంగా ఇంటి వద్ద అలంకరించిన పూలు ఇంకా వాడిపోకముందే ఈ ఘోరం చోటుచేసుకుంది. ఆ కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు, చూసిన వారి గుండెలను పిండేసిన ఈ విషాద సంఘటన కె.గంగవరం మండలం కోట గ్రామంలో చోటు చేసుకుంది.  చదవండి:  (అమెరికాలో చిత్తూరు జిల్లా మహిళ మృతి)

యానాం పట్టణానికి చెందిన కామవరపు సత్యప్రసాద్‌ (63) విశ్రాంత ఉపాధ్యాయుడు. ఆయన భార్య కామవరపు విజయలక్ష్మి (61) స్థానిక ఎస్‌టీపీపీ ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పని చేసి గత సంవత్సరం రిటైరయ్యారు. యానాం సీబీఎస్‌ పాఠశాల రోడ్డులో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రశాంత్‌ హైదరాబాద్‌లో బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆయనకు వివాహమైంది. చిన్నకుమారుడు ప్రణీత్‌చంద్ర (32) బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రాజోలు బ్రాంచిలో క్రెడిట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు ఇటీవల రాజమహేంద్రవరానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. గురువారం జరిగిన నిశ్చితార్థానికి సత్యప్రసాద్‌ దంపతులు, ప్రణీత్‌చంద్ర రాజమహేంద్రవరం వెళ్లారు.

హైదరాబాద్‌ నుంచి ప్రశాంత్‌ కూడా వచ్చారు. నిశ్చితార్థం అనంతరం ప్రశాంత్‌ విమానంలో తిరుగుపయనమయ్యారు. ఈ సంఘటన జీవితంలో గుర్తుగా ఉండాలన్న కోరికతో సత్యప్రసాద్‌ దంపతులు కొత్త కారు కొనుగోలు చేశారు. అనంతరం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ వద్ద పని చూసుకున్నారు. గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆ దంపతులు, వరుడు ప్రణీత్‌చంద్ర కలిసి రావులపాలెం సమీపంలోని జొన్నాడ మీదుగా ఏటిగట్టు రోడ్డులో కొత్తగా కొన్న కారులో బయలుదేరారు. ముందు సీట్లలో తండ్రీ కొడుకులు, వెనుక సీటులో విజయలక్ష్మి కూర్చున్నారు. రాత్రి 9 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఫోన్‌ చేయగా మరో గంటలో ఇంటికి చేరుకుంటామని చెప్పారు.  చదవండి:  (ప్రేమ పెళ్లి.. అనంతరం ప్రియుడి మోజులో..)

కోటిపల్లి – కోట ఏటిగట్టు రహదారిలో కోట గ్రామం మంచినీటి చెరువు వద్ద ఉన్న పెద్ద మలుపులో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. ఒక్కసారిగా పల్టీలు కొడుతూ చెరువులో దూసుకుపోయింది. కారు పల్టీ కొట్టే సమయంలో వెనుక డోర్‌ తెరచుకోవడంతో అందులో ఉన్న విజయలక్ష్మి ఎగిరి చెరువులో పడిపోయారు. సత్యప్రసాద్, ప్రణీత్‌చంద్ర కారులో నుంచి బయటకు రాలేక ఉక్కిరిబిక్కిరి అయిపోయి, ఒకరిని ఒకరు పట్టుకుని, కూర్చున్నచోటే జలసమాధి అయ్యారు. మరో గంట తరువాత కుటుంబ సభ్యులు ఫోన్‌ చేయగా అందుబాటులో లేదని సమాచారం వచ్చింది. దీంతో వారికి అనుమానం వచ్చి, వీరి ఆచూకీ కోసం ప్రయత్నించారు. రాత్రి మూడు గంటల సమయంలో కోటిపల్లి నుంచి కోట వరకూ గాలించగా మంచినీటి చెరువులో కారు కనిపించింది. వెంటనే వారు 100కు ఫోన్‌ చేశారు. ద్రాక్షారామ ఎస్సై ఎన్‌.రామకృష్ణ చేరుకుని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌ సహాయంతో కారును, మృతదేహాలను వెలికి తీశారు. సంఘటన స్థలంలోనే శవపంచనామా చేసి, మృతదేహాలను బంధువుల సమక్షంలో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. డీఎస్సీ బాలాచంద్రారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

దారి తప్పి..
కోటిపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న రైల్వే వంతెన వద్దకు వచ్చేసరికి వీరు దారి తెలియక ఏటిగట్టుపై కాకుండా పాత ఇసుక ర్యాంపునకు వెళ్లే మార్గంలోకి వెళ్లారు. రైల్వేకు చెందిన ప్రైవేటు వాచ్‌మన్‌తో పాటు అక్కడున్న వారు గమనించి, కారును ఆపి ఆ దారిలో వాహనాలు వెళ్లవని పైనుంచి వెళ్లాలని చెప్పారు. దీంతో వారు కారును వెనక్కి తిప్పి, వారు గట్టుపై నుంచి వెళ్లారు. అక్కడి నుంచి మరో 10 నిమిషాలు ప్రయాణించగానే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. సీట్‌ బెల్ట్‌ వేసుకోవడం వల్లనే ప్రణీత్‌ బయటకు రాలేకపోయాడని, లేకపోతే వారిని రక్షించేవాడని సంఘటన స్థలానికి వచ్చిన పలువురు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement