సామాన్యుల జోలికి పోని బాలాజీ నాయుడు
కేంద్ర, రాష్ట్ర పథకాల లబ్ధి పేరుతో టోకరా
రెండు దశాబ్దాలుగా నేరాలు చేస్తున్న వైనం
ఇప్పటికి 40 మంది ఎంపీ, ఎమ్మెల్యేలకు టోపీ
21 సార్లు జైలుకు వెళ్లివచ్చిన మారని బుద్ధి
పీడీ యాక్ట్ ప్రయోగించినా అవే మోసాలు
సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లాలో పుట్టాడు... కరీంనగర్, ఖమ్మం, విశాఖ జిల్లాలో పని చేశాడు... గుంటూరు జిల్లాలో స్థిరపడ్డాడు... ఇతడు టార్గెట్ చేసింది కూడా రాజకీయ నేతల్నే... రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ యువకిరణాలు, ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన పథకంతో పాటు పలు కేంద్ర, రాష్ట్ర పథకాల పేరు చెప్పి ఇప్పటి వరకు 40 మంది ఎంపీ, ఎమ్మెల్యేలకు టోకరా వేశాడు...ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 37 పోలీసుస్టేషన్లలో ఇతడిపై కేసులు ఉన్నాయి. హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించినా పంథా మారలేదు... ఘరానా మోసగాడు తోట బాలాజీ నాయుడు నేర చరిత్ర ఇది. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న ఇతగాడు ఇప్పటి వరకు కనీసం ఒక్క సామాన్యుడి జోలికీ వెళ్లలేదు. నాటి ఎమ్మెల్సీ ఆకుల లలిత నుంచి రూ.10 లక్షలు కాజేసిన కేసులో 2017, మరో ప్రముఖుడిని బురిడీ కొట్టించి 2019ల్లో జైలుకెళ్లిన ఇతగాడు తాజాగా మరో ఎమ్మెల్యేకు టోకరా వేసి శనివారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన విషయం విదితమే. 50 ఏళ్ల వయస్సున్న ఈ నిందితుడు ఇప్పటి వరకు 21 సార్లు జైలుకు వెళ్లివచ్చాడు.
ఒక్కోసారి ఒక్కో విధంగా...
తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన తోట బాలాజీ నాయుడు కాకినాడలోని జేఎన్‌టీయూ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. 2003లో ఎన్‌టీపీసీలో జూనియర్ ఇంజనీర్‌గా చేరి రామగుండం, పాల్వంచ, విశాఖపట్నంల్లో పని చేశాడు. వైజాగ్‌లో విధులు నిర్వర్తిస్తుండగా 2008లో అప్పటి తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ఆనంద్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఈ కేసు నిరూపితం కావడంతో ఆ తర్వాతి ఏడాది ఉద్యోగం కోల్పోయాడు. విశాఖ జైలులో ఉండగా పాత నేరగాళ్లతో ఏర్పడిన పరిచయం ప్రభావంతో బయటకు వచ్చినప్పటికీ నుంచి మోసాలు చేయడమే వృత్తిగా మార్చుకుని విజృంభించాడు.
విజయనగరంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యదర్శులకు ఫోన్లు చేసి ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు ఉన్నాయని, మీ నియోజకవర్గం నుంచి యువతను సిఫార్సు చేయాల్సిందిగా మీమీ ఎమ్మెల్యేలకు సూచించాలంటూ ఎర వేశాడు. డిపాజిట్ పేరుతో కొంత మొత్తం బ్యాంకు ఖాతాలో వేయించుకుని మోసం చేశాడు. ఈ నేరంపై విజయనగరం రెండో టౌన్ పోలీసులు 2009లో అరెస్టు చేసి జైలుకు పంపారు. నల్గొండ జిల్లాలోనూ అనేక మందిని ఇలానే మోసం చేయడంతో 2010లో యాదగిరిగుట్ట పోలీసులు కటకటాల్లోకి పంపారు. తూర్పుగోదావరి జిల్లా నర్సాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నేతల నుంచే రూ.1.5 లక్షలు వసూలు చేసి జైలుకు వెళ్లాడు. ఇలానే మరికొందరిని ముంచి జైలుకు వెళ్లివచ్చాడు. ఈ నేపథ్యంలోనే సత్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ముఠా కట్టి కొన్ని నేరాలు చేశాడు.
బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి ఫోన్ నెంబర్లు...
బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థకు చెందిన ఎంక్వైరీ నెంబర్ 197ను సంప్రదించి అవనిగడ్డ, విజయనగరం, చిలకలూరిపేట, బొబ్బిలి, నర్సాపురం, బెంగళూరు, అంబర్‌పేట, యాదగిరిగుట్ట, సాలూరు, చిపురుపల్లి, పొన్నూరు, కారంచేడు తదితర నియోజకవర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధుల ఫోన్ నెంబర్లు తెలుసుకుని 2013లో వారిని టార్గెట్ చేశాడు. రాజీవ్ యువకిరణాలు పేరుతో దాని ప్రాజెక్ట్ డైరెక్టర్‌నంటూ ఎర వేశాడు. వారి పీఏలకు విషయాన్ని ‘వివరించి’ ఒక్కో అభ్యర్థికి రూ.1,060 చొప్పున ముందస్తు డిపాజిట్ చేయాలంటూ బ్యాంకు ఖాతా నెంబర్లు ఇచ్చి రూ.3.50 లక్షల వరకు వసూలు చేశాడు. కొందరు నిరుద్యోగుల్నీ ఉద్యోగాల పేరుతో ముంచాడు.
ఈ నేరాలకు సంబంధించి బీజేపీ నాయకుడు రాంజగదీష్ ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు 2013 ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచి్చన బాలాజీ అప్పటి ఎంపీలు వి.హనుమంతరావు, దేవేందర్‌గౌడ్, పాల్వాయి గోవర్థన్‌లను టార్గెట్ చేశాడు. వారితో పాటు వారి పీఏలకూ ఫోన్లు చేసి రాజీవ్ యువకిరణాల ద్వారా ఉద్యోగాల పేరే చెప్పాడు. మీమీ నియోజకవర్గాల్లో ఉన్న నిరుద్యోగులుకు ఉద్యోగాలు ఇప్పించుకోండని సూచించాడు.
ఒక్కో అభ్యర్థికీ సంబంధించి ముందుగా దరఖాస్తు రుసుము రూ.500, మెస్ చార్జీల కింద రూ.560 కలిపి మొత్తం రూ.1,060 చొప్పున వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయమని కోరాడు. వీరు అలానే చేయగా మొత్తం డ్రా చేసుకుని స్వాహా చేశాడు. హన్మంతరావు రూ.1,09,500, దేవేందర్‌గౌడ్ రూ.66,000, గోవర్థన్ రూ.1,32,00 డిపాజిట్ చేశారు. తానే ఫోన్ చేస్తానని చెప్పిన వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో అరెస్టు అయ్యాడు. 2015లో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేకు రూ.90 వేలు టోకరా వేసి చిక్కాడు.
కేంద్ర పథకం పేరుతో ఎమ్మెల్సీ నుంచి...
ఇతగాడి ఘరానా నేర చరిత్రను పరిగణలోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు 2016లో పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఏడాది పాటు జైల్లో ఉండి 2017 జనవరిలో విడుదలైన బాలాజీ నాయుడు సిటీతో పాటు ఏపీ, తెలంగాణల్లో మళ్లీ మోసాలు చేశాడు. ఆ ఏడాది సెపె్టంబర్ 12న తెలంగాణ ఎమ్మెల్సీ ఆకుల లలితకు కాల్ చేసిన బాలాజీ నాయుడు తాను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతోద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు చెందిన రూ.2 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ముందుగా ఐదు శాతం చెల్లిస్తే ఆ మెత్తం విడుదల చేయిస్తానంటూ చెప్పాడు.
దీంతో ఆమె తన కుమారుడు దీపక్ ద్వారా బాలాజీ చెప్పిన బ్యాంకు ఖాతాలోకి రూ.10 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించారు. చివరకు మోసపోయానని గుర్తించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైలుకు వెళ్లారు. 2019లోనూ ఓ ప్రజాప్రతినిధిని మోసం చేసిన కేసులో అరెస్టు అయ్యాడు. ఏకంగా ప్రముఖులనే టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్న ఇతగాడిని కట్టడి చేయడానికి అనువైన మార్గాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు వారి సంబంధీకులు, సిబ్బంది ఈ మోసగాడి పం«థాను దృష్టిలో ఉంచుకోవాలని, ఫోన్ ద్వారా సంప్రదించే వారిని పూర్తి స్థాయిలో నమ్మవద్దని హితవు పలుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment