జగ్గంపేట(తూర్పు గోదావరి జిల్లా): ఒక ప్రేమజంట ఈ నెల 27న తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్లిపోవడంతో గండేపల్లి మండలం ఉప్పలపాడులో ఉద్రిక్తత నెలకొంది. అబ్బాయి తండ్రిపై అమ్మాయి కుటుంబ సభ్యులు ఆదివారం దాడి చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. జగ్గంపేట సీఐ సూరి అప్పారావు అందించిన వివరాలు ఇలా వున్నాయి. ఉప్పలపాడుకు చెందిన పిల్లి కృష్ణకుమార్ సీతానగరం మండలం ఇనుగంటివారి పేటకు చెందిన అమ్మాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి అమ్మమ్మగారి గ్రామమైన ఉప్పలపాడు వచ్చి వెళుతున్న నేపథ్యంలో కృష్ణకుమార్‌కు ఆమెకు పరిచయం ఏర్పడిగా ప్రేమగా మారింది.
సంక్రాంతికి అమ్మాయి ఉప్పలపాడు వచ్చి అమ్మమ్మగారి ఇంటి వద్ద ఉన్న నేపథ్యంలో ఈ నెల 27న ప్రేమజంట కనిపించకుండా పోయింది. ఆదివారం అబ్బాయి తండ్రి పిల్లి గోవింద్ ఇంటి వద్ద ఉన్న సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు అక్కడ చేరుకుని అమ్మాయి ఆచూకీ కోసం ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో అమ్మాయి తరఫు వారు అబ్బాయి తండ్రి గోవింద్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడ్డ గోవింద్‌ను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి గండేపల్లి ఎస్సై శోభన్‌కుమార్ తరలించారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. గోవింద్ పై దాడిచేసిన వారిపై కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment