విజయవాడ గాంధీ నగర్‌లోని లేపాక్షి షోరూమ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హస్తకళలకు పెద్దఎత్తున ప్రచారం కల్పించడంతోపాటు వాటికి బ్రాండ్ ఇమేజ్ కల్పించడంలో లేపాక్షి ప్రముఖ పాత్ర పోషిస్తోంది. వీటి తయారీలో రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా కళాకారులు 23 రకాల హస్తకళలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరందరికీ మరింత ఉపాధి చూపడంతోపాటు ఆ కళలను బతికించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తరణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. దేశంలోని ప్రధాన కేంద్రాల్లో ప్రస్తుతమున్న 17 లేపాక్షి ఎంపోరియంలకు అదనంగా ఇప్పుడు మరో ఆరు కొత్త షోరూమ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం విశాఖపట్నం, విశాఖ విమానాశ్రయం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుమల, తిరుపతి, తిరుపతి శ్రీనివాసమ్, విష్ణు నిలయం, తిరుపతి విమానాశ్రయంతోపాటు హైదరాబాద్, కోల్‌కతా, న్యూఢిల్లీలో లేపాక్షి షోరూమ్‌లు ఉన్నాయి, కొత్తగా విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గండికోట, కడప, తిరుపతిలో కూడా మరిన్ని షోరూమ్‌లు ఏర్పాటుచేయనున్నారు. ఒక్కో షోరూమ్ ఏర్పాటుకు వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది.
హస్తకళల ప్రోత్సాహానికి బహుముఖ చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ’ ద్వారా హస్తకళలను ప్రోత్సహించేలా బహుముఖ చర్యలు చేపట్టింది. ప్రధానంగా క్రాఫ్ట్‌మేళా, ఎగ్జిబిషన్, ప్రచారం, మార్కెటింగ్ వంటి వాటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అలాగే.. మరికొంత మందికి ఉపా«ధి కల్పించేందుకు పెద్దఎత్తున శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా ‘కామన్ ఫెసిలిటి సర్వీస్ సెంటర్ (సీఎఫ్‌ఎస్‌సీ)లను ఏర్పాటుచేస్తోంది. వాటికి అవసరమైన మౌలిక వసతులు, యంత్రాలు, పరికరాలను ఏర్పాటుచేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుతోంది. ఒకే గొడుగు కిందకు నైపుణ్యాన్ని, తయారీని, విక్రయాలను తీసుకొస్తోంది.
ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు
ఇక రాష్ట్రంలో పేరెన్నికగన్న హస్తకళా ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా కూడా విక్రయిస్తున్నారు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలతోపాటు తోలు బొమ్మలకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ–కామర్స్ పాŠల్ట్‌ఫామ్‌లు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో కూడా ఆన్‌లైన్ విక్రయాలు చేస్తున్నారు. ఈ ఏడాది రూ.35 లక్షలు విలువైన హస్తకళా ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అమ్మాలని ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment