మంచిర్యాల: మండల కేంద్రంలో బుధవారం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ రసాభాసగా మారింది. ఎమ్మెల్యే దివాకర్‌రావు సాక్షిగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలో బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరలు నాణ్యతగా ఉంటే బాగుంటుంది, ఈ విషయాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాన్నారు. అక్కడే ఉన్న పలువురు బీఆర్‌ఎస్ నాయకులు జోక్యం చేసుకుంటూ గత ఏడాది ఎంపీపీగా ఉన్నప్పుడు ఏం మాట్లాడావు. ఇప్పుడు పార్టీ మారి ఇలా మాట్లాడుతున్నావ్, చీరలకు ఏమైందని ప్రశ్నించారు. దీంతో ఎంపీపీ, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
అక్కడే ఉన్న పోలీసులు ఇరుపార్టీల వారిని తోసివేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, జెడ్పీటీసీ నాగరాణి, వైస్‌ఎంపీపీ అనిల్, రైతుసమితి జిల్లా కన్వీనర్ గురువయ్య, పీఏసీఎస్ చైర్మన్ లింగన్న, ఎంపీటీసీలు శ్రీనివాస్, మోహన్, ఉపసర్పంచ్ భూమన్న, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సత్యం, వివిధ గ్రామాల బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సైడ్ డ్రైన్ పనులకు భూమిపూజ..
దండేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం, గాంధీ విగ్రహం సమీపంలో ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన రూ.47.1 లక్షల ఆర్‌అండ్‌బీ నిధులతో 600 మీటర్ల పొడవుతో చేపట్టే సైడ్ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే దివాకర్‌రావు భూమి పూజ చేశారు.
ఇక్కడ కూడా ఎంపీపీ శ్రీనివాస్ బీఆర్‌ఎస్ నాయకులకు మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. సీఐ కృష్ణ, ఎస్సైలు ప్రసాద్, లక్ష్మణ్‌లు ఇరుపార్టీల వారికి నచ్చజెప్పి పంపించారు. ఈ కార్యక్రమాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment