ఇటీవల చెన్నూరు గోదావరి ఒడ్డున యువకుడికి క్షుద్ర పూజలు చేస్తున్న దృశ్యం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రోబోటిక్ టెక్నాలజీతో ఆస్పత్రుల్లో రోగాలకు చికిత్స చేస్తున్న కాలంలోనూ ఇంకా కొన్ని చోట్ల భూత వైద్యం పేరిట రోగాలు నయం చేస్తామనే ఘటనలు వెలుగులోకి వస్తున్నా యి. జిల్లాలో ఇప్పటికీ తాంత్రిక పూజలపై నమ్మకం ఉండడంతో అమాయకులు ఆస్పత్రుల్లో చికిత్సను కాకుండా భూత వైద్యులు, బాబాలను నమ్మి మోసపోతున్నారు.
తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణానికి చెందిన యువకుడు క్షుద్రపూజలు చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ యువకుడికి పూజలు చేస్తుండగా మృత్యువాత పడ్డాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో ఇంకా ఇలాంటి నమ్మకాలతో అమాయక జనాలను కొందరు మభ్య పెడుతున్నారు. ఆధునిక కాలంలోనూ పాతకాలం నాటి మూఢ నమ్మకాలను ఆచరిస్తున్నారు. కొందరు బాబాలు రూ.వేల కొద్దీ వసూలు చేస్తూ వేర్వేరు రకాలుగా బహుమానాలు తీసుకుంటున్నారు. డాక్టర్ వద్ద ఓపీ ఉన్నట్లు ఫీజులు తీసుకుంటూ మంత్రాలు, తాయత్తులకు డబ్బులు దండుకుంటున్నారు.
ఊరికో ‘బాబా’లు..
ఆధ్యాత్మిక చింతనతో ప్రజా శ్రేయస్సు కోరే వారి కంటే ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని సొంత వైద్యం చేసే బాబాలు పెరిగిపోతున్నారు. చిన్నపిల్లలకు జ్వరం, కుటుంబ సభ్యులు, భార్యాభర్తల మధ్య సమస్యలు, సంతాన, ఆస్తులు, వారసత్వ, ఉద్యోగ, వ్యాపార ఇతర ఎలాంటి సమస్యలకై నా పరిష్కారం చూపుతామని ఏకంగా ప్రసార మాధ్యామాల్లోనూ ప్రచారం చేస్తున్నారు.
జిల్లాలో జైపూర్ మండలం ఇందారం, నస్పూర్, మంచిర్యాల పట్టణం, కాసిపేట, బెల్లంపల్లి, కుమురంభీం జిల్లా రెబ్బెన మండలం తదితర ప్రాంతాల్లో ఇలాంటి కొందరు బాబాలు ఉన్నారు. ప్రజలు తమ సమస్య చెప్పుకుంటే ఏదో ఒక పరిహారం చూపిస్తున్నారు. ఇందుకు అవసరమైన డబ్బులు, సామగ్రి తెచ్చుకోమంటున్నారు. పూజలు, భూత వైద్యం పేరిట బాధితులతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో గత కొంతకాలంగా జ్వరాలు, అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. దీంతో గ్రామాల్లో అనేకమంది బాబాలు నయం చేస్తామని చెబుతున్నారు. ప్రజల అమాయకత్వం, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని బాబాల అవతారం ఎత్తుతున్నారు. కొందరు క్షుద్ర పూజలు, మందు పోయడం, కక్కించడం వంటివి చేస్తున్నారు. వీరికి తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
వీటిని ఆయా కుటుంబ సభ్యులు బయటకు తెలియకుండా జాగ్రత్త వహిస్తున్నారు. భూత వైద్యానికి వెళ్లేవారు అందరూ గోప్యంగా ఉంచడంతో వీరి వ్యవహారాలు బయటపడడం లేదు. ఇప్పటికీ మూఢ నమ్మకాలు, భూత వైద్యం, క్షుద్రపూజలు వంటివి నమ్మి ప్రజలు మోసపోవద్దని పోలీసు శాఖ ఆధ్వర్యంలో కళాజాతతో గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. అప్పట్లో కొందరు బాబాలపై కేసులు నమోదయ్యాయి. ఇటీవల వారిపై నిఘా కొరవడడంతో మళ్లీ ఘటనలు జరుగుతున్నాయి.
మరింత అవగాహన అవసరం..
మారుమూల ప్రాంతాల్లో ఇంకా పాత కాలం నాటి నమ్మకాలు, తాంత్రిక, క్షుద్ర, భూతవైద్యాలపై మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. శరీరంలో ఏర్పడే జబ్బులకు అశాసీ్త్రయ విధానం దుష్ఫలితాలు ఇస్తుందని ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంది. రోగం వస్తే తగిన చికిత్స మాత్రమే బాగు చేయగలదనే దృక్పథం పెంచుకోవాల్సి ఉంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిపై నిఘా ఏర్పరిచి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులోనూ మరికొందరు మోసపోయే పరిస్థితి ఏర్పడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment