మంచిర్యాల: కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ల కోసం పోటీ ఆసక్తి రేపుతోంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఆశావహులు పోటీపడి గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారంతో అర్జీల స్వీకరణ ముగియగా.. చివరి రోజే ఎక్కువగా వచ్చాయి. ఇందులో ఎవరిని ఎంపిక చేస్తారోనని పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెల రెండో వారంలోపు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేస్తారని నాయకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎవరు పై ‘చేయి’ సాధించి టికెట్ దక్కించుకుంటారోనని చర్చ సాగుతోంది. అర్జీ చేసుకున్న వారిలో రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకుల నుంచి మండల స్థాయి నాయకులు, కొత్త, పాత అందరూ ఉన్నారు. ఎంపికలో ప్రధానంగా సర్వేల ఫలితాలపైనే వారి భవితవ్యం ఆధారపడి ఉంది. ముఖ్యంగా ప్రజల్లో బలం, వ్యక్తిగత తీరు, అన్నింటిౖపైనా నివేదికలు సిద్ధం కానున్నాయి.
ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం ముగ్గురి పేర్లు చొప్పున పరిశీలనకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో సర్వే బృందాలు నమూనాల సేకరణలో గ్రామాలు, పట్టణాలను చుట్టుముడుతున్నాయి. ఎన్నికలు జరిగితే ఎవరు ఎటు వైపు అని ప్రజల నాడీని తెలుసుకుంటున్నాయి. టికెట్ ఆశిస్తున్న వారి బలాలు, బలహీనతలు నమోదు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలుమార్లు సర్వే జరరగా, ‘థర్డ్ ఐ’ పేరుతో జరుగుతున్న సర్వే అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారనుంది.
ఈ సర్వేలో ఫలితంతోపాటు పార్టీలో మూడు దశల్లో వడపోత జరగనుంది. మొద గాంధీభవన్, తదుపరి పీసీసీ స్థాయి, చివరగా ఏఐసీసీ స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలనలు చేసి, పోటీ పడిన టాప్ ముగ్గురిలో ఒకరిని బెస్ట్‌గా ఎంపిక చేయనున్నారు. దీంతో ఆశావహులు పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో తమ పట్టు పెంచుకునే పనిలో ఉన్నారు. నిత్యం ప్రచార కార్యక్రమాలు చేపడుతూ దృష్టిలో పడేలా చూసుకుంటున్నారు.
చెన్నూరు నుంచే అత్యధికంగా..
చెన్నూరు నియోజకవర్గం నుంచే అత్యధికంగా 12మంది దరఖాస్తు చేసుకోగా, మంచిర్యాల నుంచి ఆరుగురు, బెల్లంపల్లి నుంచి ఏడుగురు టికెట్ కోసం పోటీలో ఉన్నారు. చెన్నూరు టికెట్ ఆశించి దరఖాస్తు చేసుకున్న వారిలో మాజీ మంత్రి బోడ జనార్దన్, రాధిక రామిళ్ల, డాక్టర్ రాజారమేశ్, నూకల రమేశ్, సుతుకు సుదర్శన్, డాక్టర్ దాసారపు శ్రీనివాస్, డాక్టర్ దాసారపు విద్యావర్ధిని, దుర్గం భాస్కర్, దుర్గం నరేశ్, దుర్గం అశోక్, గోమాస శ్రీనివాస్, మేకల శంకర్ ఉన్నారు.
ఇక మంచిర్యాల టికెట్ కోసం మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, సీనియర్ నాయకులు కేవీ.ప్రతాప్, డాక్టర్ నీలకంఠేశ్వర్, వంగల దయానంద్, శ్రీరామ్ భట్ల భరత్ దరఖాస్తులు ఇచ్చారు. బెల్లంపల్లి టికెట్ కోసం మాజీ మంత్రి వినోద్, చిలుముల శంకర్, రొడ్డ శారద, ముడిమడుగుల మహేందర్, చొప్పదండి దుర్గాభవాని, కాంపల్లి ఉదయ్‌కాంత్ దరఖాస్తు చేశారు.
ఎవరి లెక్కలు వారివే..
రాష్ట్రం, జిల్లాలో టికెట్ల కేటాయింపులో ఉన్న సమీకరణలు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఉప కులాలు, మహిళా కోటా వంటి అర్హతలు బేరీజు వేసుకుంటున్నారు. ఓటు బ్యాంకు, వ్యక్తిగత చరిష్మా, పార్టీలో గుర్తింపు, ఇలా అన్ని రకాల లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరికి వారు టికెటు వస్తుందనే ధీమాగా ఉన్నారు. లోపల మాత్రం అధికారికంగా వెలువడే వరకు భయం ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు గాంధీభవన్ చుట్టూ తమకు తెలిసిన పార్టీ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టికెట్ దక్కుతుందో లేదోనని ఉత్కంఠ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment