సాక్షి, సిటీబ్యూరో: బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో గ్రేటర్ పరిధిలోని దాదాపు 25 లక్షల మంది మహిళలు ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు బతుకమ్మ చీరలకు దూరం కానున్నారు. బతుకమ్మ చీరల పంపిణీతో ఏదో విధంగా ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆశించిన గ్రేటర్ టీఆర్‌ఎస్ నేతలకు నిరాశే మిగిలింది. బతుకమ్మ చీరల పంపిణీపై పలు సంశయాలు, ప్రతిపక్షాల అభ్యంతరాలు తదితర పరిణామాల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి భంగం వాటిల్లకుండా చీరల ప్యాకెట్లలో ముఖ్యమంత్రి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ మంత్రి ఫొటోలతో కూడిన లేబుళ్లను తొలగించి చీరలు పంపిణీ చేయాలని భావించిన ప్రభుత్వం అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వర్తమానం పంపించింది. సీఎం, మంత్రి ఫొటోలు తీసేస్తే ఎన్నికల సంఘం నుంచి అభ్యంతరాలుండక పోవచ్చునని అంచనా వేసి ఇందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
దాంతోపాటు చీరల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర ప్రజాప్రతినిధులెవరూ జోక్యం చేసుకోరాదని, ప్రభుత్వోద్యోగుల ద్వారా మాత్రమే వీటి పంపిణీ చేయాలని సూచించింది. ఈనెల పదో తేదీలోగా చీరలన్నీ సంబంధిత గోడౌన్లకు చేరడంతోపాటు 12వ తేదీ నుంచి 17వ తేదీలోగా చీరల పంపిణీ పూర్తిచేయాలని పేర్కొంది. అందుకనుగుణంగా గ్రేటర్‌లోని జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత జిల్లాల కలెక్టర్లు, పట్టణ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ పంపిణీకి సంబంధించి తగిన ఏర్పాట్లకు సిద్ధమవుతుండగానే, బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు వెలువడటంతో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. తెల్లరేషన్ కార్డుల్లో పేర్లున్న 18 సంవత్సరాల వయసు పైబడిన పేద మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బతుకమ్మ పేరిట ఉచిత చీరల పంపిణీని గత సంవత్సరం నుంచి చేపట్టడం తెలిసిందే. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో చీరలు పంపిణీ చేయాలని భావించిన ప్రభుత్వ ప్రయత్నం ఎన్నికల సంఘం ఆదేశాలతో బెడిసి కొట్టింది.
25 లక్షల మందికి దూరమైన లబ్ధి..
పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్న వివరాల మేరకు, 18 సంవత్సరాల వయసునిండిన, తెల్లకార్డుల్లో పేర్లున్న మహిళలు గ్రేటర్ పరిధిలో 25.20 లక్షల మంది ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment