చీరలు తగులబెట్టిన వారిపై కేసులు: కేటీఆర్
- ఘటనల వెనుక కాంగ్రెస్, టీడీపీల కుట్ర ఉందన్న మంత్రి
- సోషల్ మీడియాలో ఉదయం నుంచే వ్యతిరేక ప్రచారం
- బట్ట కాల్చి మీదేయడమంటే ఇదేనని విమర్శ
- కేసుల వివరాలను పోలీసులు చెబుతారని వివరణ
- ఒక్కరోజులోనే 10 వేల సెంటర్ల ద్వారా 25 లక్షల చీరలు పంచామని వెల్లడి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలను రోడ్లపై కాల్చివేసిన ఘటనల్లో పలువురిపై పోలీసు కేసులు నమోదయినట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తోన్ననియోజకవర్గాల్లో మాత్రమే ఈ ఘటనలు జరిగాయని, కాంగ్రెస్, టీడీపీ నాయకులు మహిళల చేతుల్లోనుంచి చీరలను బలవంతంగా లాక్కొని తగులబెట్టారని చెప్పారు. చీరల పంపకం సందర్భంగా సోమవారం ఉదయం నుంచి రాష్ట్రంలో ఉత్పన్నమైన పరిస్తితులపై కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
‘‘బతుకమ్మలో పేర్చిన పూలను కూడా ఎలా పడితే అలా పారేయకుండా భద్రంగా చెరువులో వదిలేస్తారు. అంత సెంటిమెంట్ ఉన్న తెలంగాణలో.. బతుకమ్మ పేరుతో ఇచ్చిన చీరలను మహిళలు తగులబెట్టరు. నిజంగా చీరలు బాగోకపోతే కట్టుకోవడం మానేస్తారు లేదంటే వేరేవాళ్లకు ఇచ్చేస్తారు. ఇదంతా ప్రతిపక్ష పార్టీల నీచపు కుట్ర. బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని ఈ రోజు ఉదయం నుంచే సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న జగిత్యాలలో, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వీరయ్య నియోజకవర్గం సత్తుపల్లిలో మాత్రమే.. అదికూడా నాలుగైదు చోట్ల గందరగోళం సృష్టించారు. జగిత్యాల జిల్లాలోని చెల్‌గల్ గ్రామంలో కాంగ్రెస ఎంపీటీసీ భర్త.. మహిళల చేతుల్లోని చీరలు లాక్కొని మంట పెట్టిండు. ఆ మహిళలే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఆ వివరాలను జగిత్యాల ఎస్పీ వెల్లడిస్తారు’’ అని కేటీఆర్ అన్నారు.
10 వేల సెంటర్లలో 25 లక్షల చీరలు పంచాం..
సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 10 వేల సెంటర్ల ద్వారా 25 లక్షల చీరలను మహిళలకు పంచామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ ఉన్నతంగానే ఆలోచిస్తారని, గతంలో ప్రభుత్వాలు నడిపిన ఏ నాయకుడూ పండుగకు కోటి మంది మహిళలకు చీరలు ఇవ్వాలన్న ఆలోచనే చేయలేదని గుర్తుచేశారు. రైతులకు ఆర్థిక సాయం, గొర్రెల పంపకం తదితర పథకాలు చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు నీచమైన కుట్రలు చేస్తున్నాయని, చీరలను తగులబెట్టడం ద్వారా మహిళలను అవమానించారని ఆరోపించారు. మిగిలిన 75 లక్షల మందికి కూడా త్వరితగతిన చీరలను అందజేస్తామని కేటీఆర్ చెప్పారు. సమావేశంలో మంత్రి వెంట చేనేత శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ కూడా ఉన్నారు.