19నుంచి బతుకమ్మ చీరలు | Bathukamma Sarees Distribution Is From 19th | Sakshi
Sakshi News home page

19నుంచి బతుకమ్మ చీరలు

Published Mon, Dec 17 2018 11:24 AM | Last Updated on Mon, Dec 17 2018 11:24 AM

Bathukamma Sarees Distribution Is From 19th - Sakshi

మహిళలకు బతుకమ్మచీరలు త్వరలో అందనున్నాయి. పండగ పూర్తయిన రెండు నెలల తర్వాత ఇప్పుడు చీరల పంపిణీ ఏమిటీ అనుకుంటున్నారా? అవును.. ఇది నిజమే. ఈ ఏడాది అక్టోబర్‌ 12 నుంచి 15వరకు మహిళలకు చీరలు అందజేయాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. ఆలోపు శాసనసభ ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో అప్పట్లో పంపిణీ కార్యక్రమానికి బ్రేక్‌ పడింది. తాజాగా ఎన్నికలు ముగియడం, ఫలితాలు కూడా వెలువడడంతో ఇక బతుకమ్మ చీరలను 19 నుంచి పంపిణీ చేయనున్నారు. 

సాక్షి, రంగారెడ్డి జిల్లా: బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈనెల 19 నుంచి మహిళలకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో వీలైనంత త్వరలో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ బతుకమ్మ చీరల పంపిణీపై ప్రకటన చేయడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నికల నియమావళి కారణంగా పంపిణీ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా చీరల పంపిణీకి అధికార యంత్రాంగం ముమ్మరంగా చర్యలు తీసుకుంటోంది..

6.46 లక్షల మందికి చేకూరనున్న లబ్ధి..  
బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీని గతేడాది ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 18 సంవత్సరాల  వయసు నిండి ఆహార భద్రత కార్డులో పేరున్న ప్రతి యువతి, మహిళకు అధికారులు ఒకటి చొప్పున చీరలను పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 557 గ్రామ పంచాయతీలు, జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వెళ్లే మూడు సర్కిళ్లు, మున్సిపాలిటీల్లో ఒకేసారి పంపిణీ చేపట్టే అవకాశం ఉంది. జిల్లా పరిధిలో రేషన్‌కార్డుల్లో పేరున్న 6.46 లక్షల మంది మహిళలకు ఈ చీరలు అందనున్నాయి. ఇప్పటికే ఈ చీరలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీల గోదాము ల్లో భద్రపరిచారు. కలెక్టర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ వద్ద ఫైల్‌ పెండింగ్‌లో ఉంది. సీఎం కేసీఆర్‌ ప్రకటనతో చీరలు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  

ప్రభుత్వ భవనాల్లో పంపిణీ 
రేషన్‌ దుకాణాల సమీపంలో ఉన్న ప్రభుత్వ భవనాల్లో చీరల పంపిణీ చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సర్కారు బడులు, కమ్యూనిటీ హాళ్లు వేదికలుగా అందజేస్తారు. రేషన్‌ కార్డుల్లో పేరుండటంతోపాటు ఏదేని గుర్తింపు కార్డు (ఆధార్‌/ఓటర్‌) తీసుకెళ్తే చీరలు పంపిణీ చేస్తారు. ఎంపీడీఓలు, సెర్ప్‌ ఏపీఓల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. గతేడాది విస్తృతంగా ప్రచారం చేసినా నాణ్యత లేదన్న కారణంతో చాలామంది మహిళలు చీరలు తీసుకునేందుకు ముందుకు రాలేదు. ఈ సారైనా నాణ్యతగా ఉండాలని వారు ఆకాంక్షిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement