
శనివారం టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో చేనేత విభాగంపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులకు నగదు లభ్యత పెంచడం ద్వారా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 26,500 మంది చేనేత కార్మికులకు రూ.93 కోట్ల మేర నగదు తక్షణమే అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో శనివారం చేనేత విభాగంపై కేటీఆర్ సమీక్షించారు. ‘చేయూత’పథకం లాక్‌ఇన్ పీరియడ్ నిబంధనలు సడలించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
‘రాష్ట్రంలోని చేనేత కార్మికులకు నగదును అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేయూత పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా చేనేత కార్మికులు తమ వంతు వాటాగా 8 శాతం జమ చేస్తే, ప్రభుత్వ వాటాగా 16 శాతం చెల్లిస్తుంది. పవర్‌లూమ్ కార్మికులు మాత్రం 8 శాతం వాటా జమ చేస్తే ప్రభుత్వం కూడా 8 శాతం జమ చేస్తుంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని చేనేత కార్మికులు తమ వంతు వాటాగా రూ.31 కోట్లు జమ చేయగా, ప్రభుత్వం రూ.62 కోట్లు జమ చేసింది. అయితే ఈ పథకంలో చేరిన మూడేళ్ల లాక్‌ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత సభ్యులు తమ అవసరాల కోసం డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ లాక్‌ఇన్ పీరియడ్‌ను సడలించాలని నిర్ణయించాం. దీంతో ఈ పథకంలో భాగస్వాములైన నేత కార్మికులకు నిర్దేశించిన గడువు కంటే ముందే ఎప్పుడైనా రూ.50 వేల నుంచి రూ.1.25 లక్షల మేర నగదు అందుబాటులోకి వస్తుంది’అని కేటీఆర్ వివరించారు. సొసైటీల పరిధిలోని పొదుపు పథకంలో గతంలో సభ్యులుగా ఉన్న 2,337 మంది కార్మికులకు రూ.1.18 కోట్లు చెల్లిస్తామని కేటీఆర్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment