కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే  | KTR Participating in National Handloom Day 2023 at Manneguda | Sakshi
Sakshi News home page

కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే 

Published Tue, Aug 8 2023 12:58 AM | Last Updated on Tue, Aug 8 2023 12:58 AM

KTR Participating in National Handloom Day 2023 at Manneguda - Sakshi

ఉప్పల్‌ భగాయత్‌లో చేనేత భవన్‌ నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు

తుర్కయాంజాల్‌: రానున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని మున్సిపల్, ఐటీ, చేనేత శాఖ మంత్రి కె. తారక రామారావు జోస్యం చెప్పారు. ఆ సంకీర్ణ సర్కారులో తమ పాత్ర తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో సోమవారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చేనేత గురించి, నేత కార్మికుల గురించి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు.

నేతన్నల కష్టాలను స్వయంగా చూసిన కేసీఆర్‌.. తెలంగాణ ఉద్యమ సమయంలో వారికి ఇచ్చిన ప్రతి హామీనీ నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. చేనేత కార్మికులకు ఇప్పటివరకు అందిస్తున్న పథకాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. చేనేతపై 5 శాతం జీఎస్టీ విధించిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందని ఎద్దేవా చేశారు. హ్యండ్లూమ్‌ బోర్డు, పవర్‌లూమ్‌ బోర్డు, మహాత్మాగాంధీ బీమా బంకర్‌ యోజన, ఐసీఐసీఐ లాంబార్డ్‌ వంటి పథకాలను రద్దు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులను అంధకారంలోకి నెట్టిందని మండిపడ్డారు. చేనేత వద్దు–అన్నీ రద్దు అనే నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోందని విమర్శించారు. 

సంకీర్ణంలో ఉంటే రాష్ట్రానికి సంస్థలు, అదనపు నిధులు.. 
కేంద్రంలో ఏర్పడనున్న సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్‌ఎస్‌ ఉంటేనే రాష్ట్రంలో ఇంటీరియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ, నేషనల్‌ టెక్స్‌టైల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వంటి సంస్థల ఏర్పాటు ద్వా రా చేనేతకు మంచి రోజులు సాధ్యమని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అలాగే కేంద్రం నుంచి తెలంగాణకు అదనంగా నిధులు తెచ్చుకోవచ్చన్నారు.

ఉప్పల్‌ భగాయత్‌లో నిర్మించనున్న కన్వెన్షన్, ఎక్స్‌పోలో ఏడాదంతా చేనేత ఉత్పత్తులను అమ్ముకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో చేనేత స్టాల్స్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కష్టకాలంలో చేనేత కార్మికులను ఆదుకుంటున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోనే నేత కార్మి కుల బతుకుల్లో వెలుగులు వచ్చాయని చెప్పారు. 

నేత కార్మికులకు వరాలు... 
చేనేత మిత్ర పథకంలో భాగంగా వచ్చే నెల నుంచి ప్రతి మగ్గానికీ రూ. 3 వేలు అందిస్తామని, 75 ఏళ్లలోపున్న చేనేత కార్మికులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని, రూ. 25 వేల పరిమితితో హెల్త్‌ కార్డులు అందిస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. గుంట మగ్గాల స్థానంలో 10,652 ఫ్రేమ్‌లూమ్స్‌ మగ్గాలు తెస్తామని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి రూ. 40.50 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు.

చేనేత, అనుబంధ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు కార్మికులు చనిపోతే అంత్యక్రియలకు ఇస్తున్న రూ. 12,500 మొత్తాన్ని రూ. 25 వేలకు పెంచుతామని చెప్పారు. డీసీసీబీల సహకారంతో పెట్టుబడి సాయం అందిస్తామని, ఇంటి వెనక మగ్గాల షెడ్‌ ఏర్పాటు చేసుకొనేందుకు గృహలక్ష్మి పథకంలో అవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

కులవృత్తులకు జీవం... 
నేతన్నకు, గీతన్నకు అవినాభావ సంబంధం ఉందని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కులవృత్తులు పూర్తిగా నష్టపోయాయని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ జీవం పోసుకుంటున్నాయని తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకొనేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తోందని శాసనమండలి సభ్యుడు ఎల్‌.రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్‌ భాస్కర్‌తోపాటు పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు. 

ఉప్పల్‌ భగాయత్‌లో చేనేత భవన్‌కు భూమిపూజ
ఉప్పల్‌: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉప్పల్‌ భగాయత్‌లో చేనేత భవన్‌ నిర్మాణంతోపాటు హ్యాండ్లూమ్స్‌ అండ్‌ హ్యాండీక్రాఫ్ట్స్‌ మ్యూజియం నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ ఎల్‌. రమణ, ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డితో కలసి మంత్రి కేటీఆర్‌ సోమవారం భూమిపూజ చేశారు. 2,576 చదరపు గజాల్లో నిర్మించనున్న చేనేత భవన్‌కు దాదాపు రూ. 50 కోట్ల వ్యయం కానుండగా 500 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించనున్న మ్యూజియానికి రూ. 15 కోట్లు ఖర్చు కానుంది. కాగా, ఉప్పల్‌–వరంగల్‌ జాతీయ రహదారి కారిడార్‌ పనులు త్వరలో పూర్తి చేయాలని, ఉప్పల్‌ భగాయత్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు రెండు ఎకరాలు కేటాయించాలని, 100 పడకల అసుపత్రి నిర్మాణం చేపట్టాలని మంత్రి కేటీఆర్‌కు బేతి సుభాష్ రెడ్డి వినతిపత్రం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement