సాక్షి, హైదరాబాద్: నేత కార్మికులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చేయూత ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం చావు దెబ్బ కొడుతోందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అంతేస్థాయిలో పరిపుష్టి కలిగిన చేనేత రంగం ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. బీజేపీకి రాజీనామా చేసిన రాజ్యసభ మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. రాపోలుతోపాటు మరికొందరు నేతలకు కేటీఆర్ పార్టీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రధాని మోదీ హయాంలో చేనేత రంగానికి ప్రత్యేక పాలసీ ఏదీ లేదని, పత్తి సాగు ఎక్కువగా ఉన్న భారత్‌లో చేనేత రంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నా ప్రోత్సాహం కరువైందని దుయ్యబట్టారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 34 శాతం వ్రస్తోత్పత్తి చైనాలో జరుగుతుండగా, భారత్ మాత్రం పొరుగున ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక కంటే వెనుకంజలో ఉందన్నారు.
తెలంగాణకు చెందిన చేనేత కార్మికులు సూరత్, ముంబై, భివండి వంటి ప్రాంతాల్లో అత్యంత నైపుణ్యంతో వస్త్రోత్పత్తిలో కీలకంగా పనిచేస్తున్నారని చెప్పారు. వారిని సొంత రాష్ట్రానికి రప్పించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కాకతీయ టెక్స్‌టైల్ పార్క్, సిరిసిల్ల అపారెల్ పార్క్, మెగా పవర్‌లూమ్ క్లస్టర్ వంటి అనేక ప్రాజెక్టుల ఏర్పాటుకు సాయం కోరుతున్నా కేంద్రం స్పందించడం లేదని పేర్కొన్నారు.
పన్ను విధించిన ఘనత మోదీదే...
ఎనిమిదేళ్ల కాలంలో నేత కార్మికులకు ఉద్దేశించిన 8 పథకాలను కేంద్రం రద్దు చేసిందని కేటీఆర్ విమర్శించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో చేనేత పరిశ్రమ కీలకపాత్ర పోషించగా, ఈ రంగంపై 5 శాతం పన్ను విధించిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. నేత రంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకంతోపాటు అనేక పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. చేనేత కార్మికుల సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న రాపోలు ఆనంద్ భాస్కర్ సేవలు బీఆర్‌ఎస్ విస్తరణలో ఉపయోగించుకుంటామని కేటీఆర్ ప్రకటించారు.
తెలంగాణ భూగర్భాన్ని నదీ జల గర్భంగా మార్చిన గొప్ప నేత కేసీఆర్ అని రాపోలు ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నానని, బీజేపీ తనకు గుర్తింపు ఇవ్వకుండా హింసకు గురిచేసిందని వాపోయారు. జాతీయస్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్‌ఎస్ ఆవిర్భవిస్తుందన్నారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుధాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
నేతన్నలకు కేంద్రం చావు దెబ్బ.. మంత్రి కేటీఆర్ ధ్వజం
Published Thu, Oct 27 2022 2:29 AM | Last Updated on Thu, Oct 27 2022 11:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment