సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీపై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసమర్థ, పనికిమాలిన, ప్రచార కండూతి తప్ప మరో ధ్యాసలేని వ్యక్తి అంటూ మోదీపై విరుచుకుపడ్డారు. 8 ఏళ్ల అరాచకాలపై దేశ వ్యాప్తంగా బీజేపీ బట్టలూడదీసి నడిబజార్లో నిలబెడతామని హెచ్చరించారు. విలువలు లేని రాజకీయం చేస్తున్న ఆ పార్టీ వలువలు విప్పుతామని అన్నారు. భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు, జాతీయ రాజకీయాలు, మునుగోడు ఉప ఎన్నిక తదితర అంశాలపై శుక్రవారం ప్రగతి భవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివరాలు కేటీఆర్ మాటల్లోనే..
ప్రజల మాట వినడు..ఆయన మాట మాత్రమే చెబుతాడు
గోల్‌మాల్ గుజరాత్ మోడల్ చూపెట్టి అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో ఏం చేశారు. ఒక్కటంటే ఒక్క మంచి పని గురించి మోదీని చెప్పమనండి. ఇంత మోస్ట్ ఇన్ కాంపిటెంట్, ఇన్ ఎఫిషియంట్, ప్రచార్ (అసమర్ధ, పనికిమాలిన, ప్రచార యావ ఉన్న) ప్రధానమంత్రి స్వతంత్ర భారతంలో ఇంతకుముందు ఎవరూ లేరు. ఈ తరహా మొదటి ప్రధాని నరేంద్ర మోదీయే. దివాళాకోరు, పనికిరాని ప్రధానమంత్రి. ప్రెస్‌మీట్ పెట్టడు. ప్రజల మాట వినడు. ఆయన మాట మాత్రమే చెప్తాడు. బిల్డప్ తప్ప పనేం లేదు. అచ్ఛే దిన్ అంటాడు. ఎప్పుడొస్తాయో తెలియదు. ఒకరికి మాత్రం వచ్చాయి. ఆయన ప్రపంచంలోనే రెండో పెద్ద కుబేరుడయ్యారు.
మోదీ రూ.435 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నాడు
ప్రతి రంగంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక నిరుద్యోగం ఇప్పుడు దేశంలో ఉంది. దేశంలో ఎక్కడా అభివృద్ధి లేదు. 2022 నాటికి అందరికీ ఇళ్లు అన్నారు. కానీ మోదీ మాత్రం రూ.435 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నాడు. అత్యధిక ద్రవ్యోల్బణం, ప్రపంచంలోనే అత్యధికంగా గ్యాస్ ధర వంటి వాటితో నైజీరియాను దాటి భారత్ పేద దేశంగా మారింది.
ప్రతిపక్ష నేతలపై మాత్రమే దాడులు
సెప్టెంబర్ 17ను విమోచన దినమంటూ కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్రాల సీఎంలు దండులా వచ్చి తెలంగాణపై పడ్డారు. మరి ఆగస్టు 15 ఎందుకు విమోచన దినం కాదు? ఎర్రకోట నుంచి బ్రిటిష్ వాళ్ల అరాచకాలను ఎందుకు ప్రస్తావించరు? ఇక్కడ మాత్రం మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. బీజేపీ వాళ్లపై ఎక్కడా ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరగవు. రాహుల్, సోనియా, మమత, కేజ్రీవాల్, కేసీఆర్ వంటి ప్రతిపక్ష నేతలపై మాత్రం జరుగుతాయి.
బీఆర్‌ఎస్‌తో దేశ సమస్యలకు పరిష్కారం
భారత్ రాష్ట్ర సమితి రూపంలో దేశ సమస్యలకు పరిష్కారం చూపిస్తాం. తెలంగాణ మోడల్‌ను దేశంలో అమలు చేస్తాం. ప్రతి ఒక్కరికీ తాగు నీరిస్తాం. ఉచితంగా కరెంటు అందిస్తాం. దళితులను వ్యాపారవేత్తలను చేస్తాం.ౖకాళేశ్వరం, మిషన్ భగీరథ సుసాధ్యం చేసిన.. వ్యవసాయానికి 24 గంటలూ ఉచితంగా కరెంటు ఇవ్వవచ్చని, వ్యవసాయం దండగ కాదు పండుగ అని స్వల్ప సమయంలో నిరూపించిన వ్యక్తి కేసీఆర్. ఎవరూ చేయలేని పనులు కేసీఆర్ చేశారు.
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని కేంద్రమే పార్లమెంటులో చెప్పింది. రైతుబంధు, రైతుబీమా వంటి అద్భుతమైన పథకాలు, రైతు వేదికలు, రైతు సమితిలు దేశంలో మరెక్కడా లేవు. ఉత్పత్తిలో తెలంగాణ రైతులు పంజాబ్, హరియాణాతో పోటీ పడుతున్నారు. ఒకప్పుడు 8 గంటలు విద్యుత్ కోత. ఇప్పుడు 10 నిమిషాలు కూడా కరెంటు పోని పరిస్థితి. ఇలాంటి తెలంగాణ రోల్‌మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తాం.
బీజేపీ గుజరాతీలు నడిపే పార్టీ
టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు. ఇప్పుడు బీఆర్‌ఎస్ పెడితే అలాగే మాట్లాడుతున్నారు. మా అస్తిత్వమే తెలంగాణ. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాలంటే తెలంగాణ పేరుతో వెళ్లడం సాధ్యం కాదు. అందుకే పేరు మార్పు. దేశంలోని వివిధ రాజకీయ నాయకులు, రైతు, ప్రజాసంఘాల నేతలు, ఆర్థిక వేత్తలతో మాట్లాడిన తరువాతే జాతీయ స్థాయిలోకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్‌ను అవహేళన చేసిన వాళ్లంతా ఇవాళ చీకట్లో కలిసిపోయారు. అధికారం, పదవుల కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం లేదు. ఈ దేశంలో ఒక దారుణమైన పరిస్థితి ఉంది. బీజేపీ అంటే గుజరాతీలు నడిపే పార్టీ.
సుజనాచౌదరి, సీఎం రమేష్‌లపై కేసులేమయ్యాయి?
మా మీద దాడులు, కుట్రలు ఉంటాయి. వాటన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధమే. ఈసీ కంటే ముందే బీజేపీ వాళ్లు ఎన్నికల తేదీలు ప్రకటిస్తారు. ఈడీ చెప్పక ముందే బీజేపీ లీడర్లు ఈడీ దాడుల గురించి చెబుతారు. ఒక్క బీజేపీ నాయకుడిపై అయినా ఐటీ, ఈడీ దాడులు జరిగాయా? ౖసుజనాచౌదరి, సీఎం రమేష్‌లపై కేసులు ఇప్పుడు ఏమయ్యాయి?
పాన్ ఇండియా తెలుగు చిత్రాల మాదిరే..!
నాయకుడిలో దమ్ము, విషయం లేకుంటే ఐ ప్యాక్ కూడా ఏమీ చేయలేదు. మేము చేసిన పనిని వారు కొంతమేరకు ఎలివేట్ చేస్తారు. పాన్ ఇండియా తెలుగు చిత్రాల మాదిరే మాది కూడా.
మునుగోడులో మేమే గెలుస్తాం
22 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు రాజగోపాల్ కంపెనీ సుశీ ఇన్‌ఫ్రాకు ఇచ్చిన తరువాతే.. అందులో మిగిలే డబ్బు కోసమే ఆయన తన పదవిని పణంగా పెట్టి బీజేపీలో చేరాడు. అమిత్ షా ను కలిసిన ఓ పెద్ద మనిషి నన్ను కలిశాడు. రూ.500 కోట్లు ఖర్చు పెడతానని రాజగోపాల్ చెప్పాడంట. ఓటుకు రూ.30 వేలు ఇచ్చి అయినా గెలుస్తానని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నడు. కాంట్రాక్టర్ బలుపునకు మునుగోడు ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది. సర్వేల్లో 13 శాతం మేరకు మాకు ఆధిక్యం ఉంది. మేమే గెలుస్తాం.
మా ఫోన్‌లలో కూడా పెగాసస్
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫోన్‌తో పాటు మా ఫోన్‌లలో కూడా పెగాసస్ ఉంది. 10 వేల మంది ఫోన్‌లలో ఉంది. మా విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. అలాగే ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు. ఆ విషయం ఆయనకు తెలియదు పాపం.
బీజేపీలా మాకు 40 ఏళ్లు పట్టకపోవచ్చు
మా లక్ష్యం 2024 పార్లమెంటు ఎన్నికలు. కేజ్రీవాల్ ఢిల్లీలో పనిచేసి చూపారు. పక్క రాష్ట్రాల్లోకి వెళ్తున్నారు. మేమూ అంతే. మహారాష్ట్ర,కర్ణాటకలో మాకు సానుకూలత ఉంది. కర్ణాటకలో కుమారస్వామితో కలిసి పోటీ చేస్తాం. రాయిచూరు, మహారాష్ట్ర సరిహద్దులోని ప్రజాప్రతినిధులు వారి ప్రాంతాలను తెలంగాణలో కలపాలని అడుగుతున్నారు. పక్క రాష్ట్రాల్లో పోటీ చేయక తప్పదు. ఒకటిన్నర సంవత్సరాల్లోనే 28 రాష్ట్రాల్లో పోటీ చేస్తామని చెప్పడం లేదు. బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడానికి 40 ఏళ్లు పట్టింది. మాకు అంత టైం పట్టకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment