టీఆర్‌ఎస్‌ టు బీఆర్‌ఎస్‌ 'మరో ప్రస్థానం' | TRS transforming from a movement party into national party BRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ టు బీఆర్‌ఎస్‌ 'మరో ప్రస్థానం'

Published Wed, Oct 5 2022 1:55 AM | Last Updated on Wed, Oct 5 2022 3:19 PM

TRS transforming from a movement party into national party BRS - Sakshi

హైదరాబాద్‌కు వచ్చిన కుమారస్వామికి స్వాగతం పలుకుతున్న కేటీఆర్‌. చిత్రంలో బాల్కసుమన్‌

కొత్త పార్టీ కాదు..
పేరు మార్పు కేసీఆర్‌ కొత్తగా ఎలాంటి రాజకీయ పార్టీని స్థాపించడం లేదు. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరును.. జాతీయ స్థాయి కార్యకలాపాలకు వీలుగా ‘భారత రాష్ట్ర సమితి’గా మార్చుతున్నారు. నిబంధనల ప్రకారం పార్టీ జెండా, రంగు, ఎన్నికల చిహ్నం అన్నీ ప్రస్తుతమున్నవే కొనసాగుతాయి. అవసరానికి తగ్గట్టుగా భవిష్యత్తులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. కొత్త పార్టీ అయితే నమోదు నుంచి నిధుల దాకా ఎన్నో ఇబ్బందులు ఉంటాయని.. అదే పేరు మార్పుతో అయితే వెంటనే నేరుగా రంగంలోకి దిగేందుకు అవకాశం ఉంటుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. 

ప్రత్యామ్నాయమే ఎజెండా 
దేశంలో ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీల ఉనికే లేకుండా చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని.. మరోవైపు కాంగ్రెస్‌ బలహీనమైందని కేసీఆర్‌ తరచూ చెప్తున్నారు. ఈ క్రమంలో దేశ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయం అవసరమంటున్నారు. తాజాగా టీఆర్‌ఎస్‌ పేరు మార్పు సభలోనూ ఈ విషయాన్ని స్పష్టం చేయనున్నారని.. జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయంగా నిలవడమే ఎజెండా అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.  

ఒక పార్టీ విలీనం.. మరో మూడు లైన్‌లో..! 
తమిళనాడుకు చెందిన ‘విడుతలై చిరుతైగల్‌ కచ్చి’ పార్టీ బీఆర్‌ఎస్‌లో విలీనానికి సిద్ధమైంది. కర్ణాటకకు చెందిన మరో రెండు పార్టీలు, మహారాష్ట్రకు చెందిన ఇంకో పార్టీ కూడా బీఆర్‌ఎస్‌తో విలీనమయ్యేందుకు రంగం సిద్ధమవుతోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

సాక్షి, హైదరాబాద్‌:  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా రెండు దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇప్పుడు కొత్త ప్రస్థానం దిశగా కీలక అడుగు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఉద్యమ పార్టీగా తెలంగాణ పోరాటం చేసి, పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కొత్త పాత్ర పోషించేందుకు సన్నద్ధమైంది.

ఈ క్రమంలో ‘జాతీయత’ను ప్రతిబింబించేలా టీఆర్‌ఎస్‌ పేరు మార్పిడికి పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు బుధవారం మధ్యాహ్నం 1.19 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. ‘కొత్త జాతీయ పార్టీ.. జాతికి అనివార్యం’ అనే నినాదంతో కొత్త పార్టీ జెండా, ఎజెండాలను బుధవారం ప్రకటించనున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పార్టీ జనరల్‌ బాడీ సమావేశానికి కేసీఆర్‌ అధ్యక్షత వహిస్తారు.

ప్రగతిభవన్‌ నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకునే కేసీఆర్‌కు.. పార్టీ శ్రేణులు, నేతలు పెద్ద ఎత్తున స్వాగతం పలికేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనరల్‌ బాడీ సమావేశానికి మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గం, 33 జిల్లాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు కలుపుకొని మొత్తం 283 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. దసరా పండుగ నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం ముగిశాక.. నేతలు, ప్రతినిధులందరికీ కేసీఆర్‌ విందు ఏర్పాటు చేశారు. 
బేగంపేట విమానాశ్రయంలో కుమారస్వామికి స్వాగతం పలుకుతున్న కేటీఆర్‌ తదితరులు 

జాతీయ వేదిక అవసరాన్ని వివరిస్తూ.. 
బుధవారం టీఆర్‌ఎస్‌ జనరల్‌ బాడీ సమావేశాన్ని ఉద్దేశించి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సుమారు రెండు గంటల పాటు ప్రసంగించనున్నారు. ప్రాంతీయ అస్తిత్వానికి ఉనికి లేకుండా బీజేపీ సాగిస్తున్న పాలన, ప్రత్యామ్నాయ ఎజెండాతో జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ అవసరం, జాతీయ, ప్రాంతీయ పార్టీలను బీజేపీ కనుమరుగు చేస్తున్న తీరు తదితరాలను ప్రస్తావించనున్నారు.

దేశాన్ని రాష్ట్రాల సమాహారంగా పేర్కొన్న రాజ్యాంగ స్ఫూర్తిని బీజేపీ దెబ్బతీస్తున్న తీరును ఈ భేటీలో కేసీఆర్‌ వివరిస్తారని.. మోదీ ప్రభుత్వం పాలనను లాభ నష్టాల దృష్టితో చూస్తున్న వైనాన్ని ఎండగడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో దేశ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు విస్తృత జాతీయ వేదిక అవసరమని, జాతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌ పోషించే పాత్రనూ వివరిస్తారని అంటున్నాయి.

జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ బలహీనమవడం, ప్రాంతీయ పార్టీల వైఫల్యం నేపథ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు జాతీయ పార్టీగా టీఆర్‌ఎస్‌ రూపాంతరం చెందుతున్నట్టు ప్రకటించనున్నారని పేర్కొంటున్నాయి. 

కేసీఆర్‌ తీర్మానంతో.. 
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ‘భారత రాష్ట్ర సమితి’గా మారుస్తూ బుధవారం జరిగే జనరల్‌ బాడీ సమావేశంలో కేసీఆర్‌ ఏకవాక్య తీర్మానాన్ని ప్రతిపాదించనున్నారు. ‘‘జాతీయ స్థాయిలో రాజకీయ కార్య­కలాపాలకు వీలుగా భారత రాష్ట్ర సమితిగా టీఆర్‌ఎస్‌ పేరును మారుస్తూ పార్టీ రాజ్యాంగంలో సవరణ చేస్తున్నాం’’ అని ఈ తీర్మానంలో పేర్కొననున్నారు. దీనికి మద్దతునిస్తూ ఒకరిద్దరు టీఆర్‌ఎస్‌ నేతలు ప్రసంగించే అవకాశం ఉంది.

తీర్మానం ఆమోదం అనంతరం మధ్యాహ్నం 1.19 గంటలకు పార్టీ కొత్త పేరుపై కేసీఆర్‌ అధికారిక ప్రకటన చేయనున్నారు. ‘‘కొత్త పార్టీని ఏర్పాటు చేయడం లేదు. ప్రస్తుతమున్న టీఆర్‌ఎస్‌ పేరును మాత్రమే మారుస్తున్నాం. పార్టీ జెండా, రంగు, ఎన్నికల చిహ్నం తదితరాలన్నీ పాతవే ఉంటాయి. ఎన్నికల సంఘం నియమావళి మేరకు పార్టీ పేరు మార్చేందుకు కేవలం జనరల్‌ బాడీ తీర్మానం సరిపోతుంది.

ఈ తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించడం కేవలం లాంఛన ప్రాయమే..’’ అని టీఆర్‌ఎస్‌ కీలక నేత ఒకరు తెలిపారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలే అయినా.. పలు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తూ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఇదే తరహాలో టీఆర్‌ఎస్‌ ముందుకు వెళ్లనుందని పార్టీ వర్గాలు చెప్పాయి.

అయితే పార్టీ పేరులో ‘తెలంగాణ’ పదం ఒక్క రాష్ట్రానికే చెందినది కావడంతో.. జాతీయ స్థాయిలో విస్తరణకు కొంత ఇబ్బందిగా ఉంటుందని, అందుకే జాతీయతను ప్రతిబింబిస్తూ ‘భారత రాష్ట్ర సమితి’గా మారుస్తున్నారని వెల్లడించాయి. 

‘తెలంగాణ భవన్‌’ సన్నద్ధం 
టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ చారిత్రక ప్రకటనకు వేదిక కాబోతున్న తెలంగాణ భవన్‌లో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. బుధవారం ఇక్కడ జరిగే ఆ పార్టీ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం కోసం రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ సన్నద్ధంగా ఉంది. సమావేశ ఏర్పాట్లను ఎమ్మెల్సీ మధుసూదనాచారి, టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం కార్యదర్శి ఎం.రమేశ్‌రెడ్డి, తెలంగాణభవన్‌ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు.


జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్‌ ప్రకటన చేయనున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుసహా 283 మంది ప్రతినిధులు హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశ మందిరంలో సీటింగ్‌ ఏర్పాట్లు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రత్యేక ఆహ్వానితులు కూర్చునే గదుల్లో వసతులను పరిశీలించారు. మరోవైపు పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది.

కేసీఆర్‌ను స్వాగతిస్తూ తెలంగాణ భవన్‌ పరిసరాలతోపాటు పలుచోట్ల పార్టీ నేతలు ‘డియర్‌ ఇండియా.. హీ ఈజ్‌ కమింగ్‌’, ‘హి ఈజ్‌ ఆన్‌ ది వే’, ‘ఢిల్లీలో రెపరెపలాడనున్న తెలంగాణ ఆత్మగౌరవం’, ‘దేశ్‌ కీ నేతా కేసీఆర్‌’, ‘దిల్‌దార్‌ సీఎం’, ‘జయహో కేసీఆర్‌’నినాదాలతో కూడిన భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్‌ ప్రకటన చేసిన అనంతరం పెద్ద ఎత్తున సంబురాలు చేసేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నారు.   

బీఆర్‌ఎస్‌లో ‘విడుతలై చిరుతైగల్‌ కచ్చి’ విలీనం 
జాతీయ పార్టీగా మారుతున్న టీఆర్‌ఎస్‌లో తమ పార్టీని విలీనం చేసేందుకు తమిళనాడుకు చెందిన ‘విడుతలై చిరుతైగల్‌ కచ్చి’ ముందుకు వచ్చింది. బుధవారం తెలంగాణ భవన్‌ వేదికగా కేసీఆర్‌ సమక్షంలో విలీన ప్రకటన ఉండనుంది. ‘విడుతలై చిరుతైగల్‌ కచ్చి’ పార్టీ నుంచి చిదంబరం లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు తొల్కప్పియన్‌ తిరుమవలవన్‌ మంగళవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్నారు.

ఆయనకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి స్వాగతం పలికి సోమాజిగూడలోని ఓ హోటల్‌కు తీసుకుని వెళ్లారు. విడుతలై చిరుతైగల్‌ కచ్చి ప్రస్తుతం తమిళనాడులో డీఎంకేకు భాగస్వామ్య పార్టీగా ఉంది. 

హైదరాబాద్‌కు చేరుకున్న కుమారస్వామి బృందం 
బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు జేడీ(ఎస్‌) అధ్యక్షుడు కుమారస్వామి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఇతర నేతలు స్వాగతం పలికారు.

ఇక కేసీఆర్‌ ఆహ్వానం మేరకు మాజీ సీఎంలు శంకర్‌సింగ్‌ వాఘేలా (గుజరాత్‌), అఖిలేశ్‌ యాదవ్‌ (యూపీ)తోపాటు బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్‌ కూడా హాజరవుతారని ప్రచారం జరిగినా మంగళవారం రాత్రి వరకు వారి రాకపై స్పష్టత రాలేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement