సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల మూడో తేదీ నుంచి లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ అమలుపై బీఆర్‌ఎస్ దృష్టి సారించింది. జనవరి 3 నుంచి 21 వరకు రెండు విడతలుగా రోజుకో లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక భేటీ నిర్వహించాలని నిర్ణయించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 13 నుంచి 15 వర కు విరామం ఇవ్వనున్నారు. ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు.
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సుమారు పది రోజుల పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు తదితర సీనియ ర్ నేతలకు లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే సన్నాహక సమావేశాలకు షెడ్యూల్ సిద్ధం చేశారు. జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవ ర్గంతో ప్రారంభమయ్యే భేటీలు 21న సికింద్రాబా ద్, హైదరాబాద్ సెగ్మెంట్లతో పూర్తవుతాయి.
కేటీఆర్, సీనియర్ల సమక్షంలో..
కేటీఆర్‌తో పాటు కె.కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు తెలంగాణ భవన్ వేదికగా ఈ సమావేశాలు నిర్వహిస్తారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఎంపీలు, సంబంధిత లోక్‌సభ సెగ్మెంట్‌లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లాపార్టీ అధ్యక్షులు ఇతర ముఖ్యనేతలు భేటీలకు హాజరవుతారు.
పార్టీ పరంగా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వీరి అభిప్రాయాలు తీసుకుని పటిష్ట కార్యాచరణ రూపొందించనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప శాతం ఓట్ల తేడాతోనే చాలా సీట్లు చేజారిన నేపథ్యంలో ఆయా స్థానాల్లో పార్టీని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు.
ఏ నియోజకవర్గ భేటీ ఎప్పుడు?
జనవరి 3న ఆదిలాబాద్, 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి,ౖ 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి లోక్ సభ భేటీలు జరగనున్నాయి. 16న నల్లగొండ, 17న నాగర్‌కర్నూల్, 18న మహబూబ్‌నగర్, 19న మెదక్, 20న మల్కాజిగిరి, 21 సికింద్రా బాద్, హైదరాబాద్ సమావేశాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment