
సబ్‌కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న చేనేతకార్మికులు
– కష్టాల్లో చేనేత కార్మికులు
– రుణమాఫీ జమ చేయాలి
– సబ్‌కలెక్టరేట్ ఎదుట ఆందోళన
మదనపల్లె రూరల్: పట్టు పాసుపుస్తకాలు కలిగిన చేనేత కార్మికులకు ప్రభుత్వం గతంలో ఇస్తున్న నాలుగు కిలోల సిల్క్ సబ్సిడీని అమలుచేయాలంటూ చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద చేనేత కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా చేనేత ఐక్యవేదిక పట్టణ అధ్యక్షులు బి.త్యాగరాజు మాట్లాడుతూ మదనపల్లెలో సుమారు 15వేల మంది చేనేత కార్మికులు జీవనం సాగిస్తున్నారన్నారు. నిమ్మనపల్లె, తంబళ్లపల్లె, బి.కొత్తకోట, ములకలచెరువు, కురబలకోట, వాల్మీకిపురం, కలకడ, కలికిరి మండలాల్లోని చేనేత కార్మికులు పట్టుపాసుపుస్తకాలు కలిగి ఉన్నారని చెప్పారు. గతంలో ప్రతినెలా వీరికి 1కేజీ సిల్కుపై రూ.150 చొప్పున నాలుగు కేజీల వరకు రూ.600 ప్రభుత్వ రాయితీ వస్తుండేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ స్కీమును అమలుచేయకపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఆ స్కీం అమలుచేయాలని అనేకమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసుకోగా రూ.1కోటి 64లక్షల రూపాయలు మంజూరుచేసినట్లు తెలిసిందన్నారు. కానీ ఇప్పటివరకు ఆ రాయితీ పైకం లబ్ధిదారులకు అందలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ప్రభుత్వం తమకు రావాల్సిన సబ్సిడీని తమ ఖాతాలకు జమచేసి పథకాన్ని నిరంతరం కొనసాగేలా చొరవతీసుకోవాలని, రుణమాఫీ చేయాలని కోరారు. చేనేతకార్మికులకు ప్రభుత్వం ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో సుమారు 200మందికిపైగా చేనేతకార్మికులు పాల్గొన్నారు.