చీరాల, న్యూస్‌లైన్: మగ్గం ఆడితేనే పూటగడిచే చేనేత కార్మికులు ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వరదలు వీడి నెల రోజులు దాటుతున్నా.. మగ్గం గుంతల్లో తడి ఆరలేదు. వరద బాధితులకు ప్రభుత్వ సాయం అరకొరగానే అందింది. మగ్గం, నూలు దెబ్బతిని ఆర్థికంగా నష్టపోయిన కార్మికులకు పరిహారం అందించడంలో తాత్సారం జరుగుతోంది. చేనేత కార్మికులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి స్వయంగా ఇచ్చిన హామీ కూడా ఇప్పట్లో నెరవేరేలా లేదు. చీరాల ప్రాంతంలో పదివేల మగ్గాలపైనే ఉన్నాయి.
అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు మండలంలోని బుర్లవారిపాలెం పంచాయతీలోని సాయి కాలనీ, తోటవారిపాలెం పంచాయతీలోని అవ్వారు సుబ్బారావు, మహాలక్ష్మమ్మ కాలనీ, బండారు నాగేశ్వరరావు కాలనీ, మార్కండేయ కాలనీలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మగ్గం గుంతల్లోకి నీరు చేరి అవి దెబ్బతిన్నాయి. వస్త్రాలు నేసేందుకు సిద్ధం చేసుకొన్న నూలు వర్షాల ధాటికి పాడైపోయింది. నిరాశ్రయులైన కుటుంబాలకు అందించే సాయం కూడా అందరికీ అందలేదు. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి పది కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. నెలన్నర రోజులుగా పనులు లేక, తినడానికి తిండి లేక పస్తులుంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. ప్రభుత్వం తక్షణ సాయం కింద ఇచ్చిన బియ్యం, కిరోసిన్ కూడా అందరికీ కాకుండా కొందరికి మాత్రమే ఇచ్చారు.
సీఎం హామీ ఎప్పటికి నెరవేరేనో..?
భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన సాయి కాలనీని సీఎం కిరణ్ సందర్శించి చేనేతలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీలిచ్చారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న చేనేత మగ్గాలు, నూలుకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పినా.. అది నేటికీ అమలుకు నోచుకోలేదు. దెబ్బతిన్న మగ్గానికి రూ. 5 వేలు, పని దినాలు కోల్పోయినందుకు రూ. 5 వేలు, దెబ్బతిన్న నూలుకు రూ.5 వేలు చొప్పున ఒక్కో కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులు నష్టపోయిన మగ్గాల అంచనాలను పూర్తి చేశారు. కానీ పరిహారం వస్తుందో... లేదో అన్న అనుమానాలు కార్మికుల్లో వ్యక్తమవుతున్నాయి. గతంలో వచ్చిన నీలం తుపానుతో నష్టపోయిన చేనేత కార్మికులకు ప్రభుత్వం నేటికీ నష్టపరిహారం అందించలేదు. అప్పటి నష్టపరిహారాన్నే ఇవ్వని ప్రభుత్వం ప్రస్తుతం జరిగిన నష్టానికి పరిహారం అసలు ఇస్తుందా అనే సందేహం కార్మికులను పీడిస్తోంది.
నేతన్న దైన్యం
Published Wed, Dec 4 2013 6:52 AM | Last Updated on Wed, Aug 1 2018 3:52 PM
Advertisement
Advertisement