ఆనందోత్సాహాల కల‘నేత’ | AP Government New Scheme For Weavers | Sakshi
Sakshi News home page

ఆనందోత్సాహాల కల‘నేత’

Published Thu, Oct 17 2019 10:41 AM | Last Updated on Thu, Oct 17 2019 10:42 AM

AP Government New Scheme For Weavers - Sakshi

సాక్షి, విశాఖపట్నం /సాక్షి నెట్‌వర్క్‌:  సన్నని దారం.. చక్కని పనితనం.. చూపరుల్ని ఆకట్టుకునే వర్ణం.. అందంతోపాటు హాయినిచ్చే మన వస్త్రం.. హుందాతనాన్ని తెచ్చిపెట్టడమే చేనేత గొప్పతనం. వస్త్రాల తయారీలో అద్భుత కళ.. చేనేత. కానీ.. ఈ వృత్తిని నమ్ముకున్న వారి జీవితాలు మాత్రం దుర్భంగానే మిగిలిపోయాయి. అధికారంలోకి రాగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, చేనేత వర్గాలు తీసుకున్న రుణాలన్నీ వడ్డీతో సహామాఫీ చేసేస్తామంటూ ఊదరగొట్టిన టీడీపీ.. గడిచిన ఐదేళ్లలో ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా వారిని పూర్తిగా విస్మరించింది. కానీ.. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే.. చేనేత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా అందిస్తోంది. నేతన్నకు నేస్తంగా ఉంటూ.. వారి జీవితాల్లో వెలుగు రేఖలు ప్రసరించేందుకు చేయూతనిస్తోంది.

 రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగి, ఉపాధి కల్పించే  చేనేత రంగం.. అనాదిగా వివక్షకు గురవుతూనే ఉంది. 2014 ఎన్నికల ముందు చేనేత సహకార సంఘాల పరిధిలో ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో పూర్తిగా గాలికొదిలేశారు. కేవలం నేత కార్మికుల వ్యక్తిగత రుణాలకే లబ్ధిని పరిమితం చేసి.. అవి కూడా కేవలం నేత పని కోసం తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ జాబితాలో చేర్చి.. వారి ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లాలో 20 చేనేత సహకార సంఘాలుంటే. ..వాటి పరిధిలో 3,500కు పైగా మగ్గాలున్నాయి. ఈ మగ్గాలపై 19వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. సంఘాల్లో లేనివారు జిల్లాలో మరో లక్ష మందికి పైగా ఉంటారని అంచనా. వివిధ బ్యాంకుల్లో సంఘాల్లోని వందలాది మంది చేనేత కార్మికులకు రుణాలున్నప్పటికీ ముడి సరుకుల నిమిత్తం 48 మంది తీసుకున్న రుణాలు రూ.5.47 లక్షలుగా చేనేత జౌళీ శాఖాధికారులు లెక్క తేల్చారు. అదే విధంగా ప్రభుత్వాదేశాల మేరకు చేనేత సహకార సంఘాల పరిధిలో రూ.కోట్లల్లో ఉన్న రుణాలను పక్కన పెట్టేశారు.

జీవితాలు మారనున్నాయి... 
గత ప్రభుత్వం చెప్పింది చెయ్యకుండా చేనేతని వంచించింది. కానీ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే.. అన్ని వర్గాల కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. ఇందులో భాగంగా చేనేత కార్మికుల్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం అమరావతిలో జరిగిన కేబినెట్‌ భేటీలో చేనేత కుటుంబాలకు ఆర్థిక అభయ హస్తం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం కొత్త పథకం ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చేనేత కార్మికుల కోసం డిసెంబర్‌ 21న ‘వైఎస్సార్‌ నేతన్న హస్తం’ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనుంది. దీనికి సంబంధించిన విధివిధానాల్ని త్వరలోనే విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన అర్హుల జాబితాను సిద్ధం చెయ్యాలంటూ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.


నేతన్నల్లో హర్షం... 
ప్రభుత్వ నిర్ణయంతో నేతన్నల మోముల్లో నవ్వులు విరబూశాయి. ఐదేళ్లుగా హామీల పేరుతో దగా పడిన తమ జీవితాలకు ఆర్థిక దన్ను దొరికిందని చేనేత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్నాళ్లూ.. ఎన్ని బట్టలు నేసినా.. జీవితాలకు సరైన భరోసా లేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తమ బతుకులకు వెలుగులు తీసుకొచ్చే నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సబ్బవరం, కొత్తపేట, అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం ప్రాంతాల్లో ఎక్కువ మంది చేనేత కార్మిక కుటుంబాలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement