మరో భారీ పథకానికి సీఎం జగన్‌ శ్రీకారం | CM YS Jagan Will Launch YSR Jalakala Scheme On 28th | Sakshi
Sakshi News home page

28న 'వైఎస్సార్‌ జలకళ' పథకం ప్రారంభం

Published Sat, Sep 26 2020 3:16 PM | Last Updated on Sat, Sep 26 2020 3:20 PM

CM YS Jagan Will Launch YSR Jalakala Scheme On 28th - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టారు. తన పాదయాత్రలో బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్‌ జగన్‌ వారికి అండగా నిలుస్తానని ఆనాడు హామీ ఇచ్చారు. సాగునీటి కోసం వేల అడుగుల లోతుతో బోరుబావులను తవ్వించుకునేందుకు రైతులు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి రావడం, అందుకోసం అప్పులపాలవుతున్న వైనాన్ని గమనించిన వైఎస్‌ జగన్ రైతులు పడుతున్న అవస్థలను పూర్తిగా తొలగించేందుకు ఇచ్చిన హామీ కార్యరూపం దాలుస్తోంది. ఆనాడు పార్టీ మేనిఫేస్టోలో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాల్లో రైతులకు ఉచిత బోర్‌వెల్ పై ఇచ్చిన హామీ మేరకు ఉచిత బోరుబావుల తవ్వకం కోసం ''వైఎస్సా‌ఆర్‌ జలకళ'' పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఈనెల 28న ఈ పథకాన్ని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. (చదవండి: మద్దతు ధర ఇవ్వాల్సిందే)

ఈ పథకం కోసం రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
రైతులు ఈ పథకం కోసం తమ పరిధిలోని గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఆన్‌లైన్‌లోనూ దీనికోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. రైతులు చేసుకున్న దరఖాస్తులు గ్రామ సచివాలయం స్థాయిలో వీఆర్వో పరిశీలిస్తారు. అక్కడి నుంచి డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ సదరు దరఖాస్తులను భూగర్భ జలాల సర్వే కోసం ముందుగా జియోలజిస్ట్‌కు పంపుతారు. సాంకేతికంగా దానిని జియోలజీ విభాగం పరిశీలించి అనుమతి ఇవ్వగానే డ్వామా అసిస్టెంట్ పిడి సదరు దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు. సదరు అనుమతి అనంతరం కాంట్రాక్టర్ డ్రిల్లింగ్ సైట్‌ లో బోరుబావులను తవ్వుతారు. బోరుబావుల సక్సెస్‌ శాతంను బట్టి కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులు జరుపుతారు. (చదవండి: ఆ ఘటనలు పునరావృతం కాకూడదు: సీఎం జగన్‌)

పారదర్శకత కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్..
‘వైఎస్సాఆర్ జలకళ పథకం’ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. ఆ సాఫ్ట్‌వేర్‌ ద్వారా రైతులు దరఖాస్తు చేసుకున్న తరువాత నుంచి దానికి అనుమతులు ఇవ్వడం, బోర్‌ బావి తవ్వకం, కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించడం వరకు అత్యంత పారదర్శకతతో, నిర్ణీత సమయంలోనే ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రతి దశలోనూ దరఖాస్తు చేసుకున్న రైతుకు తన దరఖాస్తుకు సంబంధించిన వివరాలు ఎస్‌ఎస్‌ఎంల ద్వారా పంపిస్తారు. అలాగే ఆన్‌లైన్‌ ద్వారా కూడా తన దరఖాస్తు ఏ దశలో వుందో రైతు తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఏ రోజు రైతు పొలంలో బోర్ డ్రిల్లింగ్ చేస్తారో అది కూడా అటు రైతు ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా, ఇటు వాలంటీర్ల ద్వారా కూడా సమాచారం అందిస్తారు. ఒకవేళ మొదటిసారి బోర్ డ్రిల్లింగ్ లో నీరు పడక విఫలం అయితే,  మరోసారి బోర్‌ కోసం నిపుణుడైన జియోలజిస్ట్‌ నిర్ధేశించిన ప్రాంతంలో డ్రిల్లింగ్ చేసేందుకు అవకాశం కల్పించారు. 
    
రైతుల కోసం మరో అడుగు ముందుకు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో పాటు, ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి అన్న విషయాన్ని ఆచరణలో చూపుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అన్నదాతల కోసం వైఎస్సా‌ఆర్‌ జలకళ పథకాన్ని ప్రారంభిస్తున్నారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ.2,340 కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఉచిత బోరు బావులను తవ్వడం ద్వారా దాదాపు 3 లక్షల మంది రైతులకు మేలు చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ పథకం కింద 5 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని కమాండ్, నాన్ కమాండ్ ఏరియాల్లో ఎక్కడైతే భూగర్భ జలాలు వినియోగానికి అనువుగా వుంటాయో ఆ ప్రాంతాల్లో ‘వైఎస్సా‌ఆర్‌ జలకళ’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, ఎక్కడైతే భూగర్భ జలాలు అందుబాటులో వుంటాయో అక్కడే బోరుబావులు తవ్వేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.

పొలాల్లో  హైడ్రో జియోలాజికల్, జియో గ్రాఫికల్ సర్వే ద్వారా శాస్త్రీయంగా ఎక్కడ బోరుబావులను తవ్వాలో నిపుణులు గుర్తించిన తరువాతే వాటికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు. అలాగే సంబంధిత జియోలజిస్ట్ నిర్ధేశించిన లోతులో మాత్రమే బోరు బావుల తవ్వకం జరుగుతుందని అన్నారు. ఈ పథకం కింద తవ్వే ప్రతి బోరుబావికి జియో ట్యాగింగ్ చేస్తామని, అదే క్రమంలో భూగర్భజలాలు ఎప్పటికప్పుడు రీచార్జ్ అయ్యేలా వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను కూడా కొనసాగిస్తామని తెలిపారు. పర్యావరణానికి నష్టం జరగకుండా, భూగర్భజలాలు అడిగంటి పోకుండా శాస్త్రీయ పద్దతుల్లో బోరుబావుల తవ్వకం జరుగుతుందని, దీనివల్ల రైతుకు కూడా బోర్లు వేసిన కొద్దిరోజులకే బోర్లు అడిగంటి పోవడం, తరువాత మరోసారి బోర్లు వేసుకునేందుకు వ్యయం చేయాల్సిన అవసరం వుందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement