
వారణాసి : ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫీవర్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్స్‌కు చేరే అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. రెండవ రోజు తిరిగి ప్రారంభమైన సెమీ-ఫైనల్ మ్యాచ్ కొనసాగుతుండగా ప్రపంచకప్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వరల్డ్‌కప్‌కోసం ఒక వీరాభిమాని విలక్షణమైన జరీ పట్టు చీరలను సిద్ధం చేశారు. టీమిండియా కోసం ఉత్తరప్రదేశ్ వారణాసి చేనేత కార్మికులు దీన్ని తయారు చేశారు. భారత జట్టు సభ్యులు ధరించే జెర్సీ కలర్ ‘నీలి’ రంగులో ఈ చీరను రాత్రింబవళ్లు కష్టపడి మరీ రూపొందించారట.
స్పెషల్ ఎడిషన్ చీర స్పెషల్ ఏంటి?
ప్రపంచకప్ ప్రత్యేక పట్టు చీరల తయారీని నేతన్నలు దాదాపు పూర్తి చేశారు. ప్రపంచ్‌కప్ ముగిసి దేశానికి తిరిగి వచ్చే భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లకు ఈ చీరలను బహుమతిగా ఇవ్వనున్నారు. ప్రపంచకప్ లోగో తోపాటు క్రికెట్ బ్యాట్, బంతిని కూడా చీరపై ప్రత్యేకంగా చేతితో ఎంబ్రాయిడరీ చేశారట చీర మొత్తం కుంకుమ రంగుబార్డర్‌ను ఇచ్చారు. అలాగే కొంగు (పల్లూ) మీద ‘ఐసీసీ 2019’ ముద్రించడంతోపాటు, 400కి పైగా లోగోలతో ఈ స్పెషల్ ఎడిషన్ చీరను తీర్చిదిద్దారు. వీటి తయారీకి 30రోజుల కన్నా ఎక్కువ సమయమే పట్టిందట. భారత జట్టు ఆటగాళ్లు భార్యలు, లేదా తల్లులకు బహూకరించేలా మొత్తం 16 చీరలను రూపొందించారు. 500 గ్రాముల బరువు ఉన్న పట్టు చీర ధర రూ. 20 వేలు.
క్రికెట్ వీరాభిమాని సురేష్ కుమార్ శ్రీవాస్తవ వీటిని స్వయంగా తయారు చేయించారు. స్వయంగా డిజైనర్ అయిన శ్రీవాస్తవ వారణాసి, కొట్వా గ్రామంలోని ముబారక్ అలీ నేతృత్వంలోని చేనేత కార్మికుల బృందం ఈ చీరలను రూపొందించారని తెలిపారు. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్ఎంఇ) విభాగం ఈ ప్రాజెక్టుపై తనకు ప్రోత్సాహమిచ్చిందని శ్రీవాస్తవ వెల్లడించారు.
మరోవైపు ఇండియా-న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రఖ్యాత సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ ప్రత్యేక చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment