లక్నో: టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ మంగళవారం సాయంత్రం కాలభైరవ ఆలయాన్ని సందర్శించాడు. వారణాసికి చేరుకున్న ఈ ఓపెనర్.. స్వామికి తైలం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందాడు. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుని సంబరాల్లో మునిగిపోయిన వేళ గబ్బర్ ఈ మేరకు పూజా కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. ఈ విషయం గురించి ఆలయ పూజారులు మాట్లాడుతూ.. టీమిండియా అద్వితీయ గెలుపు పట్ల ధావన్ పట్టరాని సంతోషంలో మునిగిపోయాడని చెప్పారు. గబ్బా మైదానంలో భారత జట్టు ప్రదర్శనతో అతడి ముఖం విజయగర్వంతో వెలిగిపోయిందని పేర్కొన్నారు. (చదవండి: అసలైన సవాలు ఎదురుకాబోతోంది.. జాగ్రత్త: పీటర్‌సన్)
అదే విధంగా.. జట్టు విజయపరంపర ఇలాగే కొనసాగాలని కాలభైరవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. కాగా కంబళి కప్పుకొని ధావన్ ఆలయానికి వెళ్లడంతో తొలుత ఎవరూ పెద్దగా గుర్తుపట్టలేదు. కాసేపటి తర్వాత అతడు ముసుగు తీయడంతో అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆసీస్‌లో భారత జట్టు చిరస్మరణీయ విజయాన్ని గుర్తుచేస్తూ అతడికి అభినందనలు తెలిపారు. ధావన్ సైతం ఎంతో ఓపికగా వారితో ఫొటోలు దిగుతూ సందడి చేశాడు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ధావన్.. ఆలయ సందర్శన అనంతరం బాలీవుడ్ సినిమా ‘ఓంకార’లోని ‘ధమ్ ధమ్ ధరమ్ ధరయ్యా రే’’ పాటకు కాలు కదిపిన వీడియోను షేర్ చేశాడు. టీమిండియాకు ఈ పాటను అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నాడు.