
ఆసియా లెజెండ్స్ లీగ్ ఆరంభ ఎడిషన్‌లో (2025) శిఖర్ ధవన్ నేతృత్వంలోని ఇండియన్ రాయల్స్ బోణీ కొట్టింది. నిన్న (మార్చి 11) శ్రీలంక లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 46 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.5 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. వన్‌డౌన్ బ్యాటర్ ఫయాజ్ ఫజల్ (52) మెరుపు అర్ద సెంచరీ సాధించి భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
భారత ఇన్నింగ్స్‌లో శిఖర్ ధవన్ 16, రాహుల్ యాదవ్ 21, మనోజ్ తివారి 3, యోగేశ్ నగర్ 0, మన్‌ప్రీత్ గోని 28, జకాతి 23, అనురీత్ సింగ్ 2 పరుగులు చేయగా.. రోహన్ రతి, మునాఫ్ పటేల్ డకౌట్లయ్యారు. లంక బౌలర్లలో సంజయ 4 వికెట్లు పడగొట్టి టీమిండియాను ఇబ్బంది పెట్టాడు. తిలకరత్నే దిల్షన్ 2, అరుల్ ప్రగాసమ్, ఉపుల్ ఇంద్రసిరి, తుషారా, కెప్టెన్ తిసారి పెరీరా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో జకాతి 3 వికెట్లు పడగొట్టగా.. మనోజ్ తివారి, అనురీత్ సింగ్, మన్‌ప్రీత్ గోని తలో 2 వికెట్లు తీశారు. లంక ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 35 పరుగులు చేసిన లసిత్ లక్షన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెవన్ ఫెర్నాండో (20 నాటౌట్), రవీన్ సాయర్ (18), తిసారి పెరీరా (10) రెండంకెల స్కోర్లు చేశారు.
స్టార్ బ్యాటర్ తిలకరత్నే దిల్షన్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. ఈ టోర్నీలో భారత్ మొన్న (మార్చి 10) జరగాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టైగర్స్‌తో తలపడాల్సి ఉండింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నిన్న జరగాల్సిన మరో మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్‌పై ఆసియా స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కాగా, ఆసియా లెజెండ్స్ లీగ్ తొలి ఎడిషన్ (2025) మార్చి 10న ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు (ఏషియన్ లయన్స్, శ్రీలంక లయన్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్, ఇండియన్ రాయల్స్, బంగ్లాదేశ్ టైగర్స్) పాల్గొంటున్నాయి. ఏషియా ప్రాంతానికి చెందిన మాజీ స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఇండియన్ రాయల్స్ తరఫున టీమిండియా స్టార్లు శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు, మనోజ్ తివారి, మునాఫ్ పటేల్ తదితర స్టార్లు ఆడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment