న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా తన ప్రస్థానాన్ని సెమీస్‌లోనే ముగించడంపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పెదవి విప్పాడు. భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేకపోవడం వల్లే టైటిల్ పోరుకు అర్హత సాధించడంలో విఫలమైందన్నాడు. ప్రధానంగా నాల్గో స్థానంలో నాణ్యమైన బ్యాట్స్‌మన్ లేకపోవడం వల్లే ఈ ఓటమి ఎదురైందని తాను భావిస్తున్నానని అన్నాడు. ఈ స్థానాన్ని ఎంత త్వరగా భర్తీ చేస్తే.. అంత మంచిదని చెప్పారు. ఓ మంచి బ్యాట్స్‌మెన్‌తో ఈ స్థానాన్ని భర్తీ చేయకపోతే.. బ్యాటింగ్ లైనప్ మరింత బలహీనపడే ప్రమదం ఉందన్నాడు. సీనియర్ క్రికెటర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం పట్ల యువరాజ్ సింగ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ టోర్నమెంట్ కోసం ఎంపిక చేసిన జట్టులో అంబటి రాయుడిని తీసుకోకపోవడం వ్యూహాత్మక తప్పిదమని యువీ వ్యాఖ్యానించాడు.
టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో నాలుగో స్థానం అత్యంత కీలకమైనదని యువరాజ్ సింగ్ అన్నాడు. దీన్ని భర్తీ చేసుకోకపోతే.. దాని ప్రభావం బ్యాటింగ్ లైనప్ మొత్తంపై పడుతుందని అభిప్రాయపడ్డాడు. అంబటి రాయుడిని జట్టులోకి తీసుకుని- నాలుగో నంబర్ స్థానాన్ని అతనితో భర్తీ చేయించి ఉండాల్సిందని చెప్పాడు. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో అంబటి రాయుడికి చోటు దక్కకపోవడం తనను షాక్‌కు గురి చేసిందని అన్నాడు. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ అయినా ఈ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి విఫలమైతే.. అతణ్ని పక్కనపెడుతున్నారని, అది సరైన పద్ధతి కాదన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాల్గో స్థానాన్ని ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించాడు.
టీమిండియాలో నాలుగో నంబర్ స్థానం మ్యూజికల్ ఛైర్‌లా మారిందని యువరాజ్ సింగ్ విమర్శించాడు. నాలుగైదు మ్యాచ్‌ల్లో విఫలమైన తరువాత అంబటి రాయుడు న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో రాణించాడని, మళ్లీ అతణ్ని తప్పించారని మండిపడ్డాడు. తాజాగా రిషబ్ పంత్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తున్నప్పటికీ.. అతను ఎన్నాళ్లు ఆ స్థానంలో ఉంటాడో తెలియదని అన్నాడు. నాలుగో స్థానంలో ఆడగలడన్న నమ్మకం ఉంచిన ఓ ఆటగాడిని మళ్లీ, మళ్లీ తొలగించడం వల్ల ఉపయోగం ఉండదని చెప్పాడు. దీనివల్ల ఆ ఆటగాడు తనపై తాను విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment