ముంబై: ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శనను సమీక్షించాలని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలతో సీఓఏ సమావేశమవుతుంది. మెగా టోర్నీ గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా అనూహ్యంగా సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇంగ్లండ్ నుంచి కోహ్లి, శాస్త్రి తిరిగి రాగానే సీఓఏ సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ, రవి తోడ్గే వారితో చర్చిస్తారు. దీంతో పాటు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో కూడా ప్రత్యేకంగా భేటీ ఉంటుంది.
ముఖ్యంగా అంబటి రాయుడు విషయంలో సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ వ్యవహరించిన తీరును సీఓఏ ప్రశ్నించే అవకాశం ఉంది. రాయుడు మిడిలార్డర్‌లో సరైనవాడని కాదని భావిస్తే ప్రపంచ కప్ ముందు జరిగిన ఆఖరి సిరీస్ (ఆస్ట్రేలియాతో) వరకు కూడా అతడిని ఎందుకు ఆడించారనే విషయాన్ని కమిటీ ప్రశ్నించవచ్చు. అలాగే దినేశ్ కార్తీక్ వైఫల్యం, సెమీస్‌లో ధోని ఏడో స్థానంలో ఆడిన విషయాలూ చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు 2020 టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును సిద్ధం చేసే విషయంలో సెలక్షన్ కమిటీ సూచనలను సీఓఏ కోరనుంది.
Comments
Please login to add a commentAdd a comment