COA
-
‘మీరిచ్చే ఆ 40 లక్షలు నాకొద్దు’
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) 39వ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ పూర్థి స్థాయిలో బాధ్యతలు చేపట్టాడు. కొత్తగా ఎన్నికైన పాలకవర్గం పూర్తిస్థాయిలో బాధ్యతలు చేప్పటడంతో సుప్రీంకోర్టు నియమిత పరిపాలకుల కమిటీ(సీఓఏ)కి నేటితో శుభం కార్డు పడింది. అయితే ఇన్నాళ్లు భారత క్రికెట్ వ్యవహారాలు చూసిన సీఓఏ చీఫ్ వినోద్ రాయ్, సభ్యురాలు డయానా ఎడుల్జీకి 33 నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ. 3.5 కోట్లు చెల్లించాలిని బీసీసీఐ నిర్ణయిచింది. వీరితో పాటు కొన్ని నెలలు సీఓఏలో సభ్యులుగా ఉన్న విక్రమ్ లిమాయేకు రూ. 50.5 లక్షలు, రామచంద్ర గుహకు రూ. 40 లక్షల చొప్పున ఇవ్వాలని బీసీసీఐ భావించింది. అయితే బీసీసీఐ నిర్ణయంపై రామచంద్ర గుహ భిన్నంగా స్పందించాడు. తనకు బోర్డు నుంచి ఒక్క రూపాయి కూడా అవసరం లేదని స్పష్టం చేశాడు. ‘సీఓఏ సభ్యుడిగా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఆ పదవిని డబ్బు కోసం చేపట్టలేదు. అయితే ఇది నా వ్యక్తిగత నిర్ణయం. అదేవిధంగా 33 నెలలు పనిచేసి(వినోద్ రాయ్, ఎడుల్జీ) బీసీసీఐ ఇచ్చే భారీ వేతనాన్ని అంగీకరించడం కూడా సరైనదిగా భావించడం లేదు. ఇక నేను కమిటీ సభ్యుడిగా పనిచేసింది కొన్ని నెలలైనా క్రికెట్ అభివృద్దికి నా వంతు కృషి చేసా. నేను బాధ్యతలు చేపట్టే సరికి క్రికెట్ పరిపాలన గందరగోళంగా ఉంది. అయితే పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశాను’అంటూ బీసీసీఐకి రామచంద్ర గుహ లేఖ రాశాడు. ఇక 2017లో టీమిండియా కోచ్-కెప్టెన్ మధ్య జరిగిన వివాదంలో రామచంద్ర గుహ కుంబ్లేకే మద్దతుగా నిలిచాడు. అయితే కుంబ్లేను తొలగించడంపై ‘సూపర్ స్టార్ సంస్కృతి మొదలైంది’అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బోర్డులో రోజువారి కార్యకలాపాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సుప్రీంకోర్టు 2017లో అప్పటి అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ను పదవి నుంచి తప్పించింది. జస్టిస్ లోథా సంస్కరణలు అమలు చేసేందుకు 2017 జనవరిలో వినోద్ రాయ్, విక్రమ్ లిమాయే, డయానా ఎడుల్జీ, రామచంద్ర గుహలతో కూడిన క్రికెట్ పరిపాల కమిటీ(సీఓఏ)ని నియమించింది. అయితే పలు వ్యక్తిగత కారణాలతో 2017 జులైలో రామచంద్ర గుహ, అనంతరం విక్రమ్ లిమాయే కూడా సీఓఏ నుంచి తప్పుకున్నారు. అయితే వీర్దిదరూ పక్కకు జరిగినప్పటికీ వినోద్ రాయ్, ఎడుల్జీలు భారత క్రికెట్ వ్యవహారాలను సమర్థంగా చూసుకున్నారు. -
సీఏసీకి కపిల్ రాజీనామా
న్యూఢిల్లీ: భారత దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలోనే ఆయన కూడా వైదొలిగారు. ఈ ప్రయోజనాల బాటలో పదవిని వదులుకున్న నాలుగో క్రికెట్ దిగ్గజం కపిల్. ఇదివరకే గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లు తప్పుకున్నారు. ఆయన రాజీనామా నిజమేనని బోర్డు వర్గాలు ధ్రువీకరించాయి. క్రికెట్ పాలక కమిటీ (సీఓఏ) నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి. కపిల్, అన్షుమన్ గైక్వాడ్‌లతో పాటు కమిటీలో ఉన్న శాంతా రంగస్వామి కూడా ఈ విరుద్ధ ప్రయోజనాలతోనే ఇటీవల రాజీనామా చేశారు. -
టీమిండియా క్రికెటర్లకు ‘డబుల్’ బొనాంజా
ముంబై: టీమిండియా క్రికెటర్లకు, సిబ్బందికి క్రికెట్ పరిపాలక కమిటీ(సీఓఏ) బంపర్ బొనాంజా ప్రకటించింది. విదేశీ పర్యటనలకు వెళ్లే ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు ఇచ్చే దినసరి భత్యాన్ని(డైలీ అలవెన్స్) రెట్టింపు చేసినట్టు ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. ఇప్పటివరకు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఒక్కొక్కరికీ డైలీ అలవెన్స్ 125 డాలర్లు(రూ. 8,899.65) ఉండేది.. కానీ ప్రస్తుతం పెంపుతో 250 డాలర్లు(రూ. 17,799.30) కానుందని సమాచారం. అంతేకాకుండా ట్రావెలింగ్ అలవెన్స్‌లను కూడా భారీగా పెంచినట్లు సమాచారం. ఆటగాళ్ల, సిబ్బంది వసతులు, ఇతరాత్ర సౌకర్యాలను బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది. ఇక ఇప్పటికే సారథి విరాట్ కోహ్లి, ప్రధాన కోచ్ రవిశాస్త్రి డిమాండ్ మేరకు ఆటగాళ్ల, సిబ్బంది జీతాలను సీఓఏ భారీగా పెంచిన విషయం తెలిసిందే. వీరి డిమాండ్ మేరకు టాప్ క్లాస్ ప్లేయర్స్‌కు ఏ+ అనే కేటగిరీ ఏర్పాటు చేసి వారి వార్షిక జీతాన్ని రూ 7 కోట్లకు పెంచారు. ఇక ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో భాగంగా ఇప్పటికే వెస్టిండీస్‌లో పర్యటించిన టీమిండియా.. వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. -
అసభ్య ప్రవర్తన.. టీమిండియా మేనేజర్‌పై వేటు!
ట్రినిడాడ్: కరీబియన్ దీవుల్లోని భారత హై కమిషన్ అధికారుల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించినందుకు టీమిండియా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ సునీల్ సుబ్రమణ్యం భారీ మూల్యం చెల్లించుకున్నాడు. తక్షణమే వెస్టిండీస్ నుంచి వెనక్కు వచ్చేయమంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అతడికి బుధవారం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు జల సంరక్షణపై కోహ్లి సేనతో వీడియో షూట్ నిర్వహించేలా సహకరించమని కోరుతూ గయానా, ట్రినిడాడ్–టొబాగో దేశాల్లోని ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) సీనియర్ అధికారి ఒకరు సుబ్రమణ్యంను ఫోన్లో సంప్రదించారు. పలుసార్లు ప్రయత్నించినా అతడు సరిగా స్పందించలేదు. చివరకు ‘సందేశాలతో ముంచెత్తకండి’ అంటూ జవాబిచ్చాడు. ఈ విషయం ప్రభుత్వ ఉన్నత వర్గాలకు చేరింది. వారు తీవ్రంగా పరిగణించ డంతో బీసీసీఐ చర్యలకు ఉపక్రమించింది. సుబ్రమణ్యం త్వరలో బోర్డు సీఈవో రాహుల్ జోహ్రిని కలసి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే అతడు బేషరతుగా క్షమాపణ కోరాడు. నిద్ర లేమి, ఒత్తిడి కారణంగా ఇలా జరిగిందంటూ చెప్పుకొచ్చాడు. 52 ఏళ్ల సుబ్రమణ్యం తమిళనాడుకు చెందినవాడు. 74 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 285 వికెట్లు తీశాడు. టీమిండియా టెస్టు ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌కు మాజీ కోచ్. భారత జట్టు కోచింగ్, సహాయ బృందం ఎంపికకు ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌గా సుబ్రమణ్యం పేరు షార్ట్‌లిస్ట్‌లో ఉంది. కాగా, సుబ్రమణ్యం ప్రవర్తనపై ఇప్పటికే బీసీసీఐకి పలుసార్లు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. 2018లో కోహ్లీ సేన ఆస్ట్రేలియాలో చారిత్రక విజయం సాధించిన పర్యటనలో అక్కడి అధికారుల తోనూ, ప్రపంచకప్ సమయంలోనూ బోర్డు అధికారులతో దురుసుగా ప్రవర్తించాడని తెలిసింది. దీనిపై అప్పట్లో ఆయన సులువుగా వేటు తప్పించుకున్నాడు. -
బీసీసీఐ ప్రతిపాదనకు సీనియర్ క్రికెటర్ నో?
న్యూఢిల్లీ : ప్రపంచకప్ నిష్క్రమణతో భారత జట్టులో విభేదాలు నెలకొన్నాయని, ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలకు పడటం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుండటం.. మీడియాలో వరుస కథనాలు రావడం తెలిసిందే. అయితే ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం బీసీసీఐ, సుప్రీం నియమిత పాలక మండలి (సీఓఏ) చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారానికి అక్కడే ముగింపు పలకాలని యోచించినట్లు సమాచారం. అసలు జట్టులో గొడవలే లేవని, అంతా బాగుందని ఓ సీనియర్ ఆటగాడితో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టించే ప్రయత్నం జరిగినట్లు బోర్డ్ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ‘భారత జట్టులో విభేదాలు అంటూ మీడియాలో వస్తున్న కథనాలపై కలవరపాటుకు గురైన సీఓఏ వాటికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. ఈ మేరకు ఒక సభ్యుడు జట్టులో ఎలాంటి గొడవలు లేవని, అంతా సవ్యంగానే ఉందనే స్టేట్మెంట్ ఇవ్వాలని ఓ సీనియర్ ఆటగాడిని కోరాడు. కానీ ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు’ అని ఆ అధికారి పేర్కొన్నారు. మీడియాలో వచ్చే కథనాలపై సీఓఏ ఎన్నటికీ స్పందించదని, ఆటగాళ్లకు సమస్యలుంటే వారే తమ ముందుకు తీసుకు వస్తారని తెలిపారు. అప్పటి వరకు ఆటగాళ్ల మధ్య ఎలాంటి గొడవలు లేవనే సీవోఏ భావిస్తోందన్నారు. అయితే రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మను ఇన్స్టాగ్రామ్ వేదికగా అన్‌ఫాలో కావడంతో ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్లైందని, అందుకే సీఓఏ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆ అధికారి పేర్కొన్నారు. అయితే సీఓఏ ప్రతిపాదనను ఆ సీనియర్ ఆటగాడు తిరస్కరించినట్లు అనధికారికంగా తెలిసింది. మరో అధికారి మాట్లాడుతూ.. జట్టుపై జరుగుతున్న ప్రచారానికి ఎంత త్వరగా ముగింపు పలికితే అంత మంచిదని, లేకుంటే ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతుందన్నారు. ‘ఆటగాళ్ల మధ్య విభేదాలుంటే అది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతోంది. ఈ సమస్యను ఇప్పుడే పరిష్కరించకపోతే ఆటగాళ్ల మధ్య సఖ్యత దెబ్బతీనడంతో పాటు ఫలితంపై ప్రభావం చూపుతోంది. ఇదంతా మీడియా సృష్టేనని ఓ పెద్దాయన అన్నారు. మీడియా సృష్టి అయినప్పుడు ఎందుకు కలవరపాటుకు గురవుతున్నారు?’ అని సదరు అధికారి ప్రశ్నించారు. చదవండి: అగ్గి రాజేసిన రోహిత్ ‘అన్‌ఫాలో’ వివాదం! -
మహిళల క్రికెట్ జట్టు కోచ్ ఎంపికపై సమీక్ష
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్ నియామకాన్ని సమీక్షించాలని క్రికెట్ పరిపాలక కమిటీ(సీఓఏ) ఎట్టకేలకు బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్‌ను కోరింది. నిజానికి ఏప్రిల్‌లోనే నియామకంపై సమీక్ష చేయాలని భావించినా ఇన్నాళ్లకు సీఓఏ ఈ నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద పరిస్థితుల్లో కపిల్, అన్షుమన్, శాంతా రంగస్వామి నేతృత్వంలోని తాత్కాలిక కమిటీ రామన్‌ను గతేడాది డిసెంబర్లో కోచ్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లలోనే రామన్ ఎంపిక విషయంలో సీఓఏ సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ మధ్య విభేదాలు తలెత్తాయి. కోచ్‌ను తాత్కాలిక కమిటీ ఎంపిక చేయడం నిబంధనలకు విరుద్ధమని ఎడుల్జీ విమర్శించారు. గంగూలీ, సచిన్, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా సంఘానికే మాత్రమే ఆ అధికారం ఉందన్నారు. అప్పుడు ఆమెతో రాయ్ విభేదించారు. ఇప్పుడు మళ్లీ తాత్కాలిక కమిటీకే పురుషుల కోచ్ బాధ్యతను అప్పగించడం గమనార్హం. పరస్పర విరుద్ధ ప్రయోజనాల దృష్ట్యా గంగూలీ, లక్ష్మణ్ ఏదో ఒక పదవికే పరిమితం కావాలని జైన్ ఇంతకుముందే సూచించడంతో కపిల్ కమిటీకి బాధ్యత అప్పగించారు. కొత్తగా బీసీసీఐ ఆటగాళ్ల సంఘం ఏర్పాటులో కపిల్, శాంతా రంగస్వామి కీలకంగా పనిచేస్తుండటంతో వీరూ పరస్పర విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి వచ్చారు. దాంతో మహిళ క్రికెట్ కోచ్‌గా డబ్యూవీ రామన్ నియామకం సరిగా జరిగిందా.. లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని డీకే జైన్‌ను సీఓఏ విజ్ఞప్తి చేసింది. -
బీసీసీఐలో భగ్గుమన్న విభేదాలు
న్యూఢిల్లీ : క్రికెటర్లతో పాటు సతీమణి, ప్రియసఖిల ప్రయాణ విషయంలో బీసీసీఐలో విభేదాలు భగ్గుమన్నాయి. సతీమణి, ప్రియసఖిల ప్రయాణలపై నిర్ణయాన్ని వెల్లడించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రధాన్ కోచ్ రవిశాస్త్రిలను సుప్రీం నియమిత పరిపాలకుల కమిటీ(సీఓఏ) కోరడాన్ని బీసీసీఐ అధికారులు, మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎమ్ లోధా తప్పుబట్టారు. ప్రపంచకప్ సందర్భంగా నిబంధనలను అతిక్రమిస్తూ తన భార్యను వెంట ఉంచుకున్నాడని ఓ సీనియర్ క్రికెటర్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సతీమణుల ప్రయాణ షెడ్యూల్‌పై బీసీసీఐ అధికారుల మధ్య విభేదాలు చెలరేగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆటగాళ్ల మధ్య గొడవలని వచ్చిన కథనాలను పట్టించుకోనప్పుడు.. ఓ సీనియర్ ఆటగాడిపై వచ్చిన ఆరోపణలను ఇంత వేగంగా సమీక్షించాల్సిన అవసరం ఏముందని ఓ బీసీసీఐ అధికారి ప్రశ్నించారు. ఇక సతీమణుల ప్రయాణ షెడ్యూల్‌పై వింతైన నివేదికలు రావడం బీసీసీఐ అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ఆటగాళ్లతో సతీమణులను అనుమంతించే సమయం ఆటగాళ్లను బట్టి ఉంటుందని, ఈ నేపథ్యంలో మళ్లీ కెప్టెన్, కోచ్‌లకే ఆ అధికారాన్ని కల్పించడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సతీమణుల ప్రయాణ విషయంలో ఇలా భేదాభిప్రాయాలు రావడం భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారని బీసీసీఐ అధికారులు పేర్కొంటున్నారు. చదవండి: ‘తోడు–నీడ’కు సై... -
కోచ్‌ల కోసం తొందరెందుకు?
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు నియమిత క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) భారత క్రికెట్ జట్టు కొత్త శిక్షకుల కోసం మంగళవారం దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఇంత ఆకస్మికంగా కోచ్‌ల ఎంపిక ప్రక్రియను చేపట్టడాన్ని బీసీసీఐలోని ఓ వర్గం వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా వార్షిక సర్వసభ్య సమావేశం (అక్టోబర్ 22) తేదీని ప్రకటించిన తర్వాత ఇంత అత్యవసరంగా కోచ్‌లను ఎంపిక చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తోంది. ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శనను సమీక్షించాలని, త్వరలోనే జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలతో సమావేశమవుతామని తెలిపిన సీఓఏ.. ఇంత ఆకస్మికంగా కోచ్‌ల ఎంపిక ప్రక్రియ చేపట్టడాన్ని సహించలేమని బీసీసీఐకు చెందిన ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. ‘ఇది చాలా పెద్ద తప్పు. సీఓఏ సర్వసభ్యసమావేశ తేదిని ప్రకటించి ఇప్పుడు కోచ్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానించడం ఏమిటి? ప్రపంచకప్ ఓటమి కారణాలను తుడిచిపెట్టడానికేనా? మెగా టోర్నీలో ఓటమిపై టీమ్ మేనేజర్‌తో సహా సంబంధింత కోచ్‌లు నివేదికనివ్వాల్సుంది. విజయ్‌శంకర్ గాయంపై వచ్చిన పుకార్లపై సమాధానం చెప్పాలి. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ నాలుగో స్థానంపై సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే జట్టు మేనేజ్మెంట్ ఆ స్థానం కోసమే ప్రత్యేకంగా కొంతమంది ఆటగాళ్లను కోరింది. ఇదంతా జరగుకుండా కోచ్‌ల ఎంపిక ప్రక్రియను చేపట్టడం సరికాదు’ అని ఆ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)ని మార్చాలనుకుంటున్న సీఓఏ నిర్ణయంపై కూడా బీసీసీఐ అధికారులు మండిపడుతున్నారు. సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌తో కూడిన సీఏసీ కమిటీని రద్దుచేసి కొత్త సీఏసీని నియమించాలని సీఓఏ భావిస్తోంది. అయితే కొత్త సీఏసీ ఏర్పాటు చేస్తే నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని మరో అధికారి పేర్కొన్నారు. -
‘4’లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ లేకే ఓడాం
ముంబై: ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శనను సమీక్షించాలని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలతో సీఓఏ సమావేశమవుతుంది. మెగా టోర్నీ గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా అనూహ్యంగా సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇంగ్లండ్ నుంచి కోహ్లి, శాస్త్రి తిరిగి రాగానే సీఓఏ సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ, రవి తోడ్గే వారితో చర్చిస్తారు. దీంతో పాటు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో కూడా ప్రత్యేకంగా భేటీ ఉంటుంది. ముఖ్యంగా అంబటి రాయుడు విషయంలో సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరును సీఓఏ ప్రశ్నించే అవకాశం ఉంది. రాయుడు మిడిలార్డర్లో సరైనవాడని కాదని భావిస్తే ప్రపంచ కప్ ముందు జరిగిన ఆఖరి సిరీస్ (ఆస్ట్రేలియాతో) వరకు కూడా అతడిని ఎందుకు ఆడించారనే విషయాన్ని కమిటీ ప్రశ్నించవచ్చు. అదే విధంగా దినేశ్ కార్తీక్ వైఫల్యం, సెమీస్‌లో ధోని ఏడో స్థానంలో ఆడిన విషయాలు కూడా భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు 2020 టి20 ప్రపంచకప్ కోసం భారత జట్టును సిద్ధం చేసే విషయంలో సెలక్షన్ కమిటీ సూచనలను సీఓఏ కోరనుంది. రేపు భారత జట్టు రాక... ప్రపంచకప్ ప్రస్థానాన్ని ముగించిన భారత క్రికెట్ జట్టు ఆదివారం స్వదేశం చేరుకోనుంది. విడిగా కాకుండా జట్టు ఆటగాళ్లందరూ కలిసి ఒకేసారి ముంబైకి ప్రయాణిస్తారు. ‘టోర్నీ ముగిశాక కొందరు ఆటగాళ్లు ఇంగ్లండ్‌లోనే ఉండి విరామం కోరుకుంటారని వినిపించింది. అయితే అది వాస్తవం కాదు. జట్టు సభ్యులంతా ఆదివారం లండన్‌లో ఒక్కచోటికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ముంబై విమానమెక్కుతారు. సెమీస్ ఓటమి తర్వాత క్రికెటర్లంతా చాలా బాధలో ఉన్నారు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ధోని రిటైర్మెంట్పైనే ఉంది. దీనిపై అతను మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ముంబై నుంచి స్వస్థలం రాంచీ చేరుకున్న తర్వాతే ధోని ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉంది. ‘4’లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ లేకే ఓడాం హెడ్ కోచ్ రవిశాస్త్రి విశ్లేషణ ఎప్పటి నుంచో వెంటాడిన ‘నాలుగో’ సమస్యను సమస్యగానే ఉంచడం వల్ల ప్రపంచకప్ ఆశలు ఆవిరయ్యాయని భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎట్టకేలకు అంగీకరించారు. మిడిలార్డర్లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ లేకే సెమీఫైనల్లో కంగుతిన్నామని రవిశాస్త్రి అన్నారు. టీమిండియా పరాజయాన్ని విశ్లేషించిన ఆయన ఈ లోటుపై తప్పకుండా సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందేనని సూచించారు. ‘మిడిలార్డర్‌కు కీలకమైన నాలుగో స్థానాన్ని మొదట్లో రాహుల్‌తో లాగించాం. టోర్నీ మధ్యలో ఓపెనర్ ధావన్ గాయంతో నిష్క్రమించడంతో అతన్ని ఓపెనర్‌గా దింపాల్సి వచ్చింది. విజయ్ శంకర్‌ను ఆ నాలుగో స్థానంలో ఆడించినా... అతనూ గాయపడటంతో ఇక చేయాల్సిందేమీ లేకపోయింది’ అని రవిశాస్త్రి వివరించారు. మయాంక్ అగర్వాల్‌ను పిలిపించినా అప్పటికే సమయం మించిపోయిందన్నారు. ధోనిని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపలేదన్న గావస్కర్ విమర్శలపై మాట్లాడుతూ ఎంతో అనుభవజ్ఞుడు, గొప్ప ఫినిషర్ అయిన ధోనిని ముందే పంపితే... అతను ఔటయితే ఇక గెలిచే పరిస్థితే ఉండదన్న విశ్లేషణతోనే మాజీ కెప్టెన్‌ను ఏడోస్థానంలో దింపామని... ఇది పూర్తిగా జట్టు నిర్ణయమని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. ‘ఆఖరిదాకా వికెట్ కాపాడుకున్న ధోని కూడా గెలిపించగలననే ధీమాతోనే ఉన్నాడు. అతను రనౌట్ కానంత వరకు అతని కళ్లలో ఈ ఆత్మవిశ్వాసమే కనబడింది. దురదృష్టవశాత్తూ రనౌట్ కావడంతో ఓటమి తప్పలేదు’ అని కోచ్ తెలిపారు. -
టీమిండియా ప్రపంచకప్ ప్రదర్శనపై సమీక్ష
ముంబై: ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శనను సమీక్షించాలని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలతో సీఓఏ సమావేశమవుతుంది. మెగా టోర్నీ గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా అనూహ్యంగా సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇంగ్లండ్ నుంచి కోహ్లి, శాస్త్రి తిరిగి రాగానే సీఓఏ సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ, రవి తోడ్గే వారితో చర్చిస్తారు. దీంతో పాటు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో కూడా ప్రత్యేకంగా భేటీ ఉంటుంది. ముఖ్యంగా అంబటి రాయుడు విషయంలో సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరును సీఓఏ ప్రశ్నించే అవకాశం ఉంది. రాయుడు మిడిలార్డర్లో సరైనవాడని కాదని భావిస్తే ప్రపంచ కప్ ముందు జరిగిన ఆఖరి సిరీస్ (ఆస్ట్రేలియాతో) వరకు కూడా అతడిని ఎందుకు ఆడించారనే విషయాన్ని కమిటీ ప్రశ్నించవచ్చు. అలాగే దినేశ్ కార్తీక్ వైఫల్యం, సెమీస్‌లో ధోని ఏడో స్థానంలో ఆడిన విషయాలూ చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు 2020 టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును సిద్ధం చేసే విషయంలో సెలక్షన్ కమిటీ సూచనలను సీఓఏ కోరనుంది. -
బీసీసీఐ ఎలక్టోరల్ అధికారిగా గోపాలస్వామి
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎలక్టోరల్ అధికారిగా ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్ ఎన్. గోపాలస్వామి నియమితులయ్యారు. అక్టోబర్ 22న వార్షిక సర్యసభ్య సమావేశంలో జరుగనున్న బీసీసీఐ కార్యవర్గం ఎన్నికలకు గోపాలస్వామి ఎలక్టోరల్ అధికారిగా వ్యవహరిస్తారు. క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఇటీవలే బీసీసీఐ ఎన్నికల నిర్వహణపై స్పష్టతనిచ్చింది. ఈ నేపథ్యంలో హెడ్ క్వార్టర్స్‌లో శుక్రవారం సమావేశమైన సీఓఏ ఎన్నికల విధివిధానాలపై చర్చించింది. ఎన్నికల అధికారిగా గోపాలస్వామి ని ఎంపిక చేసింది. రాష్ట్ర సంఘాలకు సెప్టెంబర్ 24న ఎన్నికలు జరుగనున్నట్లు ప్రకటించింది. 2017 జనవరిలో సుప్రీం కోర్టు నియమించిన క్రికెట్ పరిపాలక కమిటీ (సీఓఏ) క్రికెట్లో లోధా కమిటీ సిఫారసుల అమలును పర్యవేక్షిస్తోంది. -
ఎడుల్జీ... మళ్లీ అసంతృప్తి
ముంబై: పరిపాలక కమిటీ (సీఓఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలపై మళ్లీ అసంతృప్తి వెళ్లగక్కారు. ఐపీఎల్ ఫైనల్ రోజు విజేత జట్టుకు ట్రోఫీని అందజేయాలనుకున్న ఆమెను బీసీసీఐ వారించడమే ఆమె తాజా అసంతృప్తికి కారణం. అప్పటికే ఎడుల్జీ మహిళ టీ20 చాలెంజ్ విజేతకు ట్రోఫీని ప్రదానం చేశారు. దీంతో పురుషుల విజేతకు ప్రొటోకాల్ ప్రకారం బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా అందజేశారు. దీనిపై ఆమె మాట్లాడుతూ ట్రోఫీలు అందజేసే ప్రొటోకాల్‌ను ఖన్నా గతంలో పాటించలేదన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ‘భారత్‌లో ఆసీస్‌తో ముఖాముఖి వన్డే సిరీస్ సందర్భంగా న్యూఢిల్లీలో విజేతగా నిలిచిన ఆసీస్‌కు నిబంధనల ప్రకారం ట్రోఫీని అందజేయాల్సిన ఆయన ఢిల్లీ సంఘానికి చెందిన వ్యక్తితో ట్రోఫీ ప్రధానోత్సవాన్ని కానిచ్చారు. అలాంటపుడు ఐపీఎల్ ఫైనల్లో నేనిస్తానంటే ప్రొటోకాల్ ఊసెందుకు’ అని ఆమె ప్రశ్నించారు. నిజానికి గత నెలలో న్యూఢిల్లీలో జరిగిన బోర్డు సమావేశంలో ప్రధానోత్సవ కార్యక్రమంపై చర్చించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఐపీఎల్ ఫైనల్‌కు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ హాజరైతే ఆయన ట్రోఫీని ఇవ్వాలని లేదంటే సహ సభ్యుడై న కల్నల్ రవి తోడ్గేతో కలసి ఉమ్మడిగా ఇస్తానని ప్రతిపాదన చేశానని ఎడుల్జీ వివరించారు. అయితే ఖన్నా మాత్రం ప్రొటోకాల్ ప్రకారం తానే ఇస్తానని బదులిచ్చారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె ప్రొటోకాల్ ప్రకారమే అయితే భారత్–ఆసీస్ సిరీస్ అప్పుడు ఎందుకు పాటించలేదని ఖన్నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీసీఐలోని ఉన్నతాధి కారులు కావాలని తనను పక్కనబెట్టాలని చూస్తున్నారని ఎడుల్జీ ఆరోపించారు. -
వాడియాపై చర్చించనున్న సీఓఏ
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియాపై శుక్రవారం ముంబైలో జరుగనున్న సమావేశంలో క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) చర్చించనుంది. వాడియా... ఇటీవల జపాన్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. దీంతో అక్కడి కోర్టు అతడికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తర్వాత ఈ శిక్షను ఐదేళ్ల పాటు సస్పెండ్ చేశారు. ఐపీఎల్ నైతిక నియమావళి ప్రకారం... ఫ్రాంచైజీలతో సంబంధం ఉన్న ఏ వ్యక్తి కూడా ఆటకు అపకీర్తి తెచ్చే విధంగా వ్యవహరించకూడదు. గతంలో రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీల సంబంధీకులు స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో అభియోగాలు ఎదుర్కొన్నందుకు చర్యలకు గురయ్యారు. మరోవైపు వాడియా వ్యవహారం ఇప్పటివరకు ఐపీఎల్ నైతిక విలువల కమిటీ ముందుకు రాలేదు. శుక్రవారం సమావేశంలో దీనిని చర్చించి ముగ్గురు సభ్యుల ఆఫీస్ బేరర్ల బృందానికి కానీ, సుప్రీం కోర్టు నియమిత అంబుడ్స్‌మన్–ఎథిక్స్ అధికారి జస్టిస్ డీకే జైన్‌కు కానీ నివేదించనున్నట్లు తెలుస్తోంది. బహుశా, అంబుడ్స్‌మన్‌కే ఈ బాధ్యత అప్పగిస్తారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ‘పంజాబ్‌పై నిషేధం’ ఊహాగానమేనని పేర్కొన్న ఆయన... ఘటనతో ఐపీఎల్‌కు నేరుగా సంబంధం లేదనే విషయాన్ని ప్రస్తావించారు. లీగ్‌కు ఇబ్బంది అని భావిస్తేనే చర్యలుంటాయని వివరించారు. బీసీసీఐ న్యాయ బృందం, అంబుడ్స్‌మన్ దీనిపై చర్చిస్తుందని స్పష్టం చేశారు. -
పాక్‌పై నిషేధం వద్దంటున్న డయానా
ముంబై: ‘నలుగురికీ నచ్చినది నాకసలే నచ్చదు’ అనే పాట క్రికెట్ పరిపాలక కమిటీ (సీవోఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీకి పక్కాగా సెట్ అవుతుంది. ఎందుకంటే అందరి నిర్ణయాలు ఒకలా ఉంటే ఆమె నిర్ణయాలు మరోలా ఉంటాయి. మహిళల క్రికెట్ కోచ్ వివాదం నుంచి మిథాలీరాజ్ సారథ్య విషయంలో, రాహుల్-పాండ్యాలు వివాదస్పద వ్యాఖ్యల సందర్భాలలో డయానా ఎడ్డం అంటే తెడ్డం అన్నారు. తాజాగా మరో విషయంలోనూ అందరికీ వ్యతిరేకంగా నిలుచొని వార్తల్లో నిలిచారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో యావత్ భారత్.. పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగే మ్యాచ్ ఆడవద్దనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. రెండు పాయింట్లు పోయినా పర్లేదు కానీ.. ఉగ్రవాద ప్రేరేపిత దేశంతో ఆడే ముచ్చటే లేదని అభిమానులు బీసీసీఐని కోరుతున్నారు. (పాక్‌తో ఆడకపోవడం న్యాయమైందే : కేంద్రమంత్రి) ఈ క్రమంలో భారతీయుల మనోభావాల ప్రకారమే నడుచుకోవాలని బీసీసీఐ, సీవోఏ భావిస్తోంది. ప్రపంచకప్‌లో పాక్‌తో మనం ఆడకుండా ఉండే బదులు ఆజట్టునే ఆడకుండా చేయాలని బీసీసీఐ ఆలోచిస్తుంది. ఈ క్రమంలో ప్రపంచకప్‌లో పాక్‌ను నిషేదించాలని ఐసీసీకి లేఖ రాయాలని అధికారులు భావించారు. ఈ మేరకు సీవోఏ చైర్మన్ వినోద్ రాయ్ బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రితో లేఖ రాయించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రతిపాదనకు అందరూ సమ్మతం తెలపగా డయానా మాత్రం అడ్డుపడ్డారు. ప్రపంచకప్‌లో పాక్‌పై నిషేధం వద్దని, మరేదైనా ఆలోచిద్దామని సభ్యులతో విభేదించారు. మిగతా సభ్యులు ఎంత చెప్పిన డయానా వినకపోవడంతో శుక్రవారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. భారత్ లేకుండా ప్రపంచ కప్‌లో ఐసీసీ ముందుకెళ్లలేదని దీంతో పాక్‌ను నిషేదించేలా ఒత్తిడి చేయాలని బీసీసీఐ అనకుంటున్న తరుణంలో ఎడుల్జీ నిర్ణయంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు. (ఉగ్రదాడి: ధర్మశాలలో పాక్ క్రికెటర్ల ఫోటోలు తొలగింపు) చదవండి: ప్రపంచకప్‌లో భారత్-పాక్ మ్యాచ్ జరిగేనా? ఉగ్ర మారణహోమం -
విచారణ వేగవంతం... అంత తొందరేలా!
న్యూఢిల్లీ: క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కె.ఎల్ రాహుల్‌లపై విచారణ విషయంలో బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ)లో భేదాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ టీమిండియా జట్టు కూర్పు పటిష్టత కోసం క్రికెటర్లపై చేపట్టిన విచారణను వేగవంతం చేయాలని సూచిస్తుంటే... కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం అంత తొందరెందుకని మండిపడుతున్నారు. తూతూమంత్రం విచారణతో ఏదో రకంగా ఈ వివాదాన్ని ముగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఒక టీవీ షోలో క్రికెటర్లిద్దరు మహి ళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పెను విమర్శలకు దారితీసింది. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పాండ్యా, రాహుల్‌లపై వేటు వేసింది. ఆ వెంటనే ఇద్దరు క్రికెటర్లు ఆసీస్ నుంచి అర్ధంతరంగా స్వదేశం పయనమయ్యారు. జట్టు బలం ఇప్పుడు 15 సభ్యుల నుంచి 13కు పడిపోవడంతో వెంటనే విచారణ పూర్తిచేసి వారి స్థానాలను భర్తీచేయాలని సీఓఏ చీఫ్ రాయ్ భావిస్తున్నారు. దీన్ని ఎడుల్జీ విభేదించారు. లోగడ బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి ఎదుర్కొన్న లైంగిక వేధింపుల అరోపణలపై ఇలా తొందరపడే త్వరగా ముగించారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు హార్దిక్ పాండ్యా, రాహుల్ స్థానాల్లో మయాంక్ అగర్వాల్, విజయ్ శంకర్లను జట్టులోకి ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు తెలిపారు. -
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ !
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ ముందుగానే ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ రెండు వారాల ముందుకు జరిపింది. అంతేకాకుండా 12వ సీజన్ ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా.. టోర్నీని యూఏఈ లేదా దక్షిణాఫ్రికాకు తరలిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ భారత్‌లోనే టోర్నీ నిర్వహించాలని తాజాగా బీసీసీఐ నిర్ణయించింది. గత సీజన్‌ను ఏప్రిల్ 7 నుంచి ప్రారంభించగా.. ఈసారి అంతకు ముందే ఈ క్యాష్ రిచ్ లీగ్‌ను ఆరంభించనుంది. మార్చి 23 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఐపీఎల్ వేదికల విషయమై చర్చించేందుకు సుప్రీం కోర్టు నియమిత క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) మంగళవారం న్యూఢిల్లీలో సమావేశం అయ్యింది. ప్రాథమికంగా చర్చించిన అనంతరం 12వ సీజన్ ఐపీఎల్‌ను స్వదేశంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. విస్తృతమైన చర్చల అనంతరం ఐపీఎల్ 2019 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక గతంలో 2009, 2014లో ఎన్నికల సందర్భంగా ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికా, యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి కూడా విదేశాల్లోనే ఐపీఎల్ నిర్వహిస్తారని అందరూ భావించారు. కానీ బీసీసీఐ భారత్‌లోనే నిర్వహిస్తామని ప్రకటించి.. క్రికెట్ అభిమానులకు శుభావార్తను అందించింది. -
కోహ్లి మెసేజ్‌లతో ఒత్తిడి పెంచడం వల్లే...
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ)లో ఇప్పుడు ఇద్దరు సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ మాత్రమే మిగిలారు. వీరిద్దరికి కూడా పడటం లేదని చాలా రోజులుగా వినిపిస్తూనే ఉంది. అయితే ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టులో చోటు చేసుకున్న వివాదం కారణంగా అవి ఇప్పుడు బయట పడ్డాయి. జట్టు కోచ్‌గా రమేశ్ పొవార్‌ను కొనసాగించమని ఎడుల్జీ కోరగా... దానిని నిర్ద్వంద్వంగా తిరస్కరించిన వినోద్ రాయ్ కొత్త కోచ్ ఎంపిక కోసం ముగ్గురు సభ్యుల అడ్‌హక్ కమిటీని మంగళవారం ప్రకటించారు. ఇందులో దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్‌తో పాటు అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామి ఉన్నారు. దీంతో పాటు ఇతర అంశాలను కూడా ప్రశ్నిస్తూ ఎడుల్జీ సుదీర్ఘ లేఖ రాశారు. మహిళల జట్టు కోచ్‌గా రమేశ్ పొవార్‌ను కొనసాగించాలంటూ కెప్టెన్ హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధన కోరడంలో తప్పేమీ లేదని ఎడుల్జీ అభిప్రాయపడ్డారు. గతంలో విరాట్ కోహ్లి పట్టు పట్టడం వల్లే రవిశాస్త్రిని ఎంపిక చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ‘కోహ్లి తరహాలో కాకుండా మహిళా క్రికెటర్లు తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. కోహ్లి వరుస పెట్టి సీఈఓ జోహ్రికి మెసేజ్‌లు పంపించాడు. దానిపైనే మీరు స్పందించి కోచ్‌ను మార్చారు. రవిశాస్త్రి కోసం దరఖాస్తు గడువు తేదీని పెంచడంపై కూడా నాడు నేను అభ్యంతరం వ్యక్తం చేశాను. దిగ్గజ ఆటగాడు కుంబ్లేను కూడా విలన్లా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అతను గౌరవంగా తప్పుకున్నాడు కాబట్టి సరిపోయింది. అయితే ఆ సమయంలో అన్ని నిబంధనలు ఉల్లంఘించారు. ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటన కోసం కోచ్‌గా కొనసాగించమని ఇద్దరు ప్లేయర్లు కోరుతున్నారు. కొత్త కోచ్‌ను కమిటీ ఎంపిక చేసే వరకు వారి మాటకు విలువిస్తే తప్పేమిటి’ అని ఎడుల్జీ ప్రశ్నించారు. క్రికెట్ కమిటీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ అందుబాటులో ఉన్నారా లేదా కనీసం తెలుసుకోకుండానే ముగ్గురితో అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేయడంపై కూడా ఆమె వివరణ కోరారు. తాను లేకుండానే మిథాలీ, హర్మన్‌లతో సమావేశం ఎలా అవుతారని... బీసీసీఐ వ్యవహారాల్లో రాయ్‌తో పాటు తనకూ సమాన అధికారాలు ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. తన ఆమోదం లేకుండా రాయ్ సూచనలపై స్పందించవద్దని కూడా బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, సీఈఓలను ఎడుల్జీ కోరారు. రమేశ్ పొవార్ దరఖాస్తు... జట్టు కోచ్ రేసులో మరోసారి రమేశ్ పొవార్ నిలిచాడు. నవంబర్ 30న పదవీకాలం పూర్తయి తప్పుకున్న అతను ఇప్పుడు మళ్లీ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేశాడు. ‘అవును... స్మృతి, హర్మన్ మద్దతు పలకడంతో మళ్లీ దరఖాస్తు చేశాను. అలా చేయకుండా వారిని నిరాశపర్చలేను’ అని పొవార్ చెప్పాడు. ప్రస్తుతానికి కోచ్ పదవికి బీసీసీఐ వద్ద మనోజ్ ప్రభాకర్, హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా), దిమిత్రి మస్కరెన్హాస్ (ఇంగ్లండ్) దరఖాస్తులు ఉన్నాయి. -
వివరణ కోరనున్న సీఓఏ
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో మిథాలీ రాజ్‌ను ఆడించకుండా తప్పించిన వివాదంపై వివరణ కోరాలని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. భారత జట్టు స్వదేశం తిరిగొచ్చిన తర్వాత దీనికి సంబంధించి మిథాలీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, కోచ్ రమేశ్ పొవార్, మేనేజర్ తృప్తి, సెలక్టర్ సుధ షాలతో సీఓఏ బృందం విడివిడిగా మాట్లాడనుంది. మరోవైపు ప్రపంచ కప్ సమయంలో మిథాలీ ఫిట్నెస్ ఎలా ఉందనే అంశంపై కూడా సీఓఏ వివరాలు కోరింది. దీనిపై జట్టు మేనేజర్ తృప్తి సోమవారం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రికి నివేదిక ఇవ్వనుంది. మరోవైపు మిథాలీరాజ్‌ను తప్పించే క్రమంలో మ్యాచ్‌కు ముందు జరిగిన సమావేశం గురించి మీడియాలో రావడంపై కూడా సీఓఏ అసహనం వ్యక్తం చేసింది. నన్నూ తీసేశారు: గంగూలీ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో కూడా తుది జట్టు నుంచి కెప్టెన్లను తప్పించడం కొత్తేమీ కాదని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. గతంలో తనకూ ఈ అనుభవం ఎదురైంది కాబట్టి మిథాలీ వ్యవహారం ఆశ్చర్యపరచలేదని అతను అన్నాడు. ‘ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను కూడా ఇలా ఇంటికి పంపించారు. అయినా మిథాలీని తప్పించడం కంటే భారత్ ఓడటమే నన్ను ఎక్కువగా బాధించింది’ అని గంగూలీ వ్యాఖానించాడు. -
‘కోహ్లి పద్దతిగా వ్యవహరించు’
ముంబై: తన బ్యాటింగ్ మెరుపులు, రికార్డులతోనే కాకుండా వివాదాలతోనూ టీమిండియా సారథి విరాట్ కోహ్లి వార్తల్లో నిలుస్తుంటాడు. ఓ అభిమానిని ‘ నీకు నచ్చకుంటే దేశం వదిలి వెళ్లు’ అంటూ చేసిన కామెంట్ పెద్ద వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో కీలక ఆస్ట్రేలియా పర్యటన, అభిమానితో వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైన బీసీసీఐ పరిపాలన కమిటీ (సీఓఏ) కోహ్లికి క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. (దేశం విడిచి వెళ్లిపో : విరాట్ కోహ్లి) 64 రోజుల సుదీర్ఘ పర్యటన నేపథ్యంలో ఆసీస్‌కు టీమిండియా బయలుదేరే ముందు సీఓఏకు చెందిన ఓ ముఖ్య అధికారి విరాట్ కోహ్లితో ప్రత్యేకంగా సంభాషించారని తెలిసింది. మీడియా సమావేశాల్లో, అభిమానులతో మాట్లాడే సమయంలో హుందాగా వ్యవహరించాలని కోహ్లికి సీఓఏ తెలిపినట్లు ముంబై మిర్రర్లో వార్తా కథనం వచ్చింది. ఈ కథనం ప్రకారం సీఓఏ మెంబర్ తొలుత కోహ్లీతో వాట్సాప్‌లో చాట్ చేసి, ఆ తర్వాత ఫోన్లో మాట్లాడారని పేర్కొంది. (రవిశాస్త్రికి సీఓఏ కౌంటర్..!) స్లెడ్జింగ్‌కు మారుపేరైన ఆసీస్ ఆటగాళ్లు కోహ్లిని టార్గెట్ చేస్తారనడంలో సందేహమేలేదు. 2012 ఆస్ట్రేలియా పర్యటనలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లిని అభిమానులు గేలి చేయడంతో అతడు చేతితో అసభ్య సంజ్ఞలు చేసి విమర్శల పాలయ్యాడు. ఇక 2014లోనూ ఆసీస్ ప్రధాన బౌలర్ మిచెల్ జాన్సన్‌తో గొడవకు దిగాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొన్న సీఓఏ కోహ్లికి పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. (‘అందువల్లే కోహ్లి నియంత్రణ కోల్పోయాడు’) -
రవిశాస్త్రికి సీఓఏ కౌంటర్..!
న్యూఢిల్లీ: గత 15 ఏళ్ల భారత క్రికెట్లో ప్రస్తుత జట్టే ఉత్తమ పర్యాటక జట్టు అని పదే పదే చెబుతున్న ప్రధాన కోచ్ రవిశాస్త్రికి ఊహించని పరిణామ ఎదురైంది. సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైన బీసీసీఐ పరిపాలన కమిటీ (సీఓఏ) గట్టి కౌంటర్ ఇచ్చింది. అత్యుత్తమ జట్టు ఏదో ప్రజలు నిర్ణయిస్తారంటూ రవిశాస్త్రికి క్లాస్ తీసుకుంది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రముఖులతో కూడిన సమావేశంలో ఇది చోటు చేసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. భారత మీడియా సొంత ఆటగాళ్లనే పదేపదే విమర్శలకు గురి చేస్తోందంటూ సమావేశంలో రవిశాస్త్రి పరోక్షంగా బయటపెట్టాడట. ఇంగ్లండ్ పర్యటనలో టెస్ట్ సిరీస్ ఓడిన తర్వాత మీడియాకు, కెప్టెన్ విరాట్ కోహ్లికి మధ్య జరిగిన మాటల వాగ్వాదాన్ని సీవోఏ ముందుంచాడని, ఈ క్రమంలోనే ఇదే అత్యుత్తమ పర్యాటక జట్టు అంటూ మరోసారి సీఓఏకి చెప్పే యత్నం చేశాడని సదరు అధికారి పేర్కొన్నారు. అయితే ఈ అంశాలను పెద్దగా పట్టించుకోకుండా ప్రదర్శన గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలంటూ కౌంటర్ ఇచ్చినట్లు అధికారి తెలిపారు. ‘ఓవరాల్‌గా ప్రపంచంలో అత్యుత్తమ జట్టుని ప్రజలు నిర్ణయిస్తారు. మీరు కాదని ఘాటుగానే హెచ్చరించారు’ అని తెలిపారు. అదే సమయంలో రవిశాస్త్రి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోని సీఓఏ బృందం.. ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి చర్చను కొనసాగించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ, సీఈఓ రాహుల్ జోహ్రీ, ఐపీఎల్ సీఓఓ హేమంగ్ అమీన్, (క్రికెట్ ఆపరేషన్)జనరల్ మేనేజర్ సబా కరీమ్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అజింక్యా రహానె, చీప్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌లు పాల్గొన్నారు. -
ఆ 9 మంది క్రికెటర్ల పేర్లు బయటపెట్టండి
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం ఐపీఎల్లో చెలరేగిన స్పాట్ ఫిక్సింగ్ వివాదం సంచలనం సృష్టించింది. ఇందులో నిందితులుగా తేలిన ముగ్గురు క్రికెటర్లపై బీసీసీఐ నిషేధం విధించగా... మరి కొందరిపై కోర్టు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు రెండేళ్ల నిషేధానికి గురి కావడంతో పాటు రాజ్ కుంద్రా, గురునాథ్ మెయప్పన్లను క్రికెట్ కార్యకలాపాల నుంచి పూర్తిగా వెలివేశారు. అయితే నాడు ఈ వివాదంపై జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ ఒక నివేదిక సమర్పించి ఫిక్సింగ్‌తో సంబంధం ఉన్న 9 మంది ఆటగాళ్ల పేర్లను ఒక సీల్డ్ కవర్లో పెట్టి సుప్రీం కోర్టుకు అందించింది. కానీ వేర్వేరు కారణాలతో ఇప్పటి వరకు ఆ కవర్‌ను కోర్టు విప్పలేదు. ఇప్పుడు తాజాగా క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) దీనిపై మళ్లీ దృష్టి పెట్టింది. ఆ సీల్డ్ కవర్‌ను తెరచి ఆటగాళ్ల పేర్లను బయట పెట్టాలని ప్రత్యేకంగా కోరింది. క్రికెట్ నుంచి ఫిక్సింగ్ పూర్తిగా తొలగిపోయే దాకా ఐపీఎల్‌ను కూడా ఆపేయాలంటూ అతుల్ కుమార్ అనే వ్యక్తి వేసిన రిట్ పిటిషన్‌పై సమాధానమిస్తూ సీఓఏ ఈ విజ్ఞప్తి చేసింది. ‘జస్టిస్ ముద్గల్ కమిటీ సమర్పించిన పేర్ల జాబితా సీల్డ్ కవర్ రూపంలో మీ వద్దే ఉంది. దానిని తెరచి అందులో ఉన్నవారిపై తగిన చర్యలు తీసుకోండి. అలా చేస్తే ఫిక్సింగ్‌కు పాల్పడేవారికి బలమైన సందేశం ఇవ్వడంతో పాటు హెచ్చరికలా కూడా పని చేస్తుంది’ అని కమిటీ పేర్కొంది. దీనిపై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం. ఆధారాలు లభించలేదు! మరోవైపు నాటి ముద్గల్ కమిటీలో సభ్యుడిగా ఉన్న బీబీ మిశ్రా తగిన ఆధారాలు లేకపోవడం వల్లే స్పాట్ ఫిక్సింగ్ వివాదం విచారణను పూర్తి చేయలేకపోయామని వెల్లడించారు. ముఖ్యంగా క్రికెటర్లు, బుకీలకు మధ్య సంబంధాలను చూపించేందుకు సరైన సాక్ష్యాలు తమకు దొరకలేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఒక అగ్రశ్రేణి క్రికెటర్‌కు బుకీలతో సంబంధం ఉందనే విషయం నాకు తెలిసిందనేది నిజం. అయితే నాకు దానికి సంబంధించిన ఆధారం లభించలేదు. మాకు కావాల్సినంత సమయం అందుబాటులో ఉన్నా సదరు బుకీ ఎలాంటి సాక్ష్యం ఇవ్వలేకపోయాడు. దాంతో విచారణ నిలిపేయడం తప్ప మరో మార్గం లేకపోయింది. అతను మొదట్లో సాక్ష్యాలు ఇచ్చేందుకు సిద్ధపడినా... ఆ తర్వాత చాలా ప్రమాదకరమైన వ్యక్తులు ఇందులో ఉన్నారని, తన ప్రాణాలు కూడా పోతాయని చెప్పి వెనక్కి తగ్గాడు. విచారణలో భాగంగా నాకు సమాచారం ఉన్న క్రికెటర్ ఒక్కడినే కాకుండా అనేక మంది ఇతర క్రికెటర్లతో కూడా నేను మాట్లాడాను’ అని మిశ్రా స్పష్టం చేశారు. అయితే విచారణలో తనకు లభించిన సమాచారం మొత్తాన్ని ప్రస్తుతం బీసీసీఐ యాంటీ కరప్షన్ చీఫ్‌గా ఉన్న అజిత్ సింగ్‌తో పంచుకునేందుకు తాను సిద్ధమని ఆయన చెప్పారు. -
విదేశీ పర్యటనల్లో సతీమణి, ప్రియసఖిలకు అనుమతి
ముంబై: కెప్టెన్ కోహ్లి కోరికను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మన్నించింది. విదేశీ పర్యటనల్లో క్రికెటర్ల వెంట సతీమణి, ప్రియసఖిలు ఉండేందుకు బోర్డు పరిపాలకుల కమిటీ (సీఓఏ) అనుమతించింది. నిజానికి ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి విధాన నిర్ణయం లేదు. అయితే విదేశాల్లో రెండు వారాల పాటు ఆటగాళ్ల వెంట భాగస్వాముల్ని అనుమతించేవారు. ఇప్పుడు మాత్రం బోర్డు స్థిరమైన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై మొదటి పది రోజుల తర్వాత విదేశీ పర్యటనల్లో క్రికెటర్ల భార్యలను, ప్రియురాళ్లను వారితో పాటు ఉండేందుకు అనుమతిస్తారు. ఈ విషయమై కోహ్లి ఎప్పటి నుంచో గట్టిగా పట్టుబడుతున్నాడు. ఇటీవల బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ)కి తన అభ్యర్థన మరోసారి తెలియజేశాడు. సుదీర్ఘ పర్యటనలప్పుడు ‘తోడు–నీడ’ కావాల్సిందేనని వాదించాడు. హైదరాబాద్‌లో జరిగిన రెండో టెస్టుకు ముందు కోహ్లి, కోచ్ రవిశాస్త్రి, రోహిత్ శర్మలను సీఓఏ సభ్యులు కలిశారు. తుది నిర్ణయం తీసుకునే దిశగా చర్చించారు. అనంతరం సీఓఏ సభ్యులు... బోర్డు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. వాళ్లు (భార్య, ప్రియురాలు) వెంట ఉన్నంత మాత్రాన జట్టుకు, ఆటకు వచ్చే నష్టమేమీ లేదని అభిప్రాయపడ్డారు. కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు ముందే తమ నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో ఆటగాళ్ల విరహవేదన తగ్గనుంది. ఎంచక్కా చెట్టాపట్టాలేసుకొని విదేశీ పర్యటనల్లో ఆటని, ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. సరిగ్గా మూడేళ్ల క్రితం 2015లో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆసీస్ జట్టు ఘోరంగా ఓడినప్పటికీ అప్పటి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ జేమ్స్ సదర్లాండ్ ఇలాంటి నిర్ణయాన్నే తీసుకున్నారు. -
టూర్‌కి భార్యలను కూడా తీసుకెళ్లోచ్చు.. కానీ
ముంబై : విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టూర్ మొత్తం ఆటగాళ్ల సతీమణులను అనుమతించాలంటూ కోరిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభ్యర్థనను నియమిత పాలకుల కమిటీ(సీఓఏ) అంగీకరించింది. అయితే విదేశి టూర్ స్టార్ట్ అయిన పదిరోజుల తర్వాత మాత్రమే వారు క్రికెటర్ల వద్దకు వెళ్లాలని సీఓఏ కండిషన్ పెట్టింది. బీసీసీఐ ప్రస్తుత పాలసీ ప్రకారం ఆటగాళ్ల వెంట భార్యలు, వ్యక్తిగత సిబ్బందిని కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ పాలసీని మార్చి, వారిని టూర్ మొత్తానికీ అనుమతించాలని ఈ మధ్యే కెప్టెన్ కోహ్లి బీసీసీఐని కోరాడు. ఈ క్రమంలో దీనిపై చర్చించడానికి గతవారం సీఓఏ హైదరాబాద్ వచ్చి.. కోహ్లితోపాటు కోచ్ రవిశాస్త్రి, రోహిత్‌శర్మలతో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ వెంట రావడం వల్ల క్రికెటర్ల ఏకాగ్రత దెబ్బ తిని టీమ్ ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని గతంలో ఆస్ట్రేలియా క్రికెట్ చీఫ్ జేమ్స్ సదర్లాండ్ కూడా అభిప్రాయపడ్డారు. అయితే కోహ్లి మాత్రం అందుకు భిన్నమైన వాదన వినిపించాడు. భార్యలు వెంట ఉంటేనే విదేశీ టూర్లలో ప్రదర్శన మరింత మెరుగవుతుందన్నది కోహ్లి వాదన. -
‘కోహ్లి అభ్యర్థనపై ఇప్పుడే ఏమీ చెప్పలేం’
న్యూఢిల్లీ: భారత జట్టు విదేశీ సిరీస్‌ల కోసం వెళ్లినపుడు పర్యటన మొత్తం ఆటగాళ్లతో వారి భార్యలు ఉండేలా అనుమతించాలంటూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన అభ్యర్థనపై ఉన్నపళంగా ఓ నిర్ణయానికి రాలేమని క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) చెప్పింది. ప్రస్తుతం విదేశీ పర్యటనల్లో రెండు వారాలు మాత్రమే ఆటగాళ్ల వెంట భార్యలు ఉండేలా అనుమతిస్తున్నారు. ‘దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోలేం. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కొత్తగా ఏర్పడే బీసీసీఐ కార్యవర్గానికే వదిలేశాం’ అని సీఓఏ ప్రతినిధి తెలిపారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టూర్ మొత్తం ఆటగాళ్ల సతీమణులను అనుమతించాలని బీసీసీఐని కోహ్లి కోరిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పాలసీ ప్రకారం ఆటగాళ్ల వెంట భార్యలు, వ్యక్తిగత సిబ్బందిని కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ పాలసీని మార్చాలని కోహ్లి తొలుత ఓ బీసీసీఐ ఉన్నతాధికారి వద్ద ప్రస్తావించగా.. అతను వినోద్‌రాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ (సీఓఏ)కి చెప్పారు.దీనిపై సీఓఏ కొత్త బీసీసీఐ కార్యవర్గం ఏర్పడ్డ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టూర్ మొత్తం భార్యలను అనుమతించండి: కోహ్లి -
టూర్ మొత్తం భార్యలను అనుమతించండి: కోహ్లి
ముంబై: విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టూర్ మొత్తం ఆటగాళ్ల సతీమణులను అనుమతించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐని కోరాడు. అయితే బీసీసీఐ ప్రస్తుత పాలసీ ప్రకారం ఆటగాళ్ల వెంట భార్యలు, వ్యక్తిగత సిబ్బందిని కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ పాలసీని మార్చాలని కోహ్లి తొలుత ఓ బీసీసీఐ ఉన్నతాధికారి వద్ద ప్రస్తావించగా.. అతను వినోద్‌రాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ (సీఓఏ)కి చెప్పారు. ఇందుకు సంబంధించిన అధికారిక అభ్యర్థనను టీమిండియా మేనేజర్ ద్వారా పంపాలని సీఓఏ తెలిపింది. అయితే దీనిపై సీఓఏ కొత్త బీసీసీఐ కార్యవర్గం ఏర్పడ్డ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ‘విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల వెంట భార్యలను అనుమతించాలనే అభ్యర్థన కొన్ని వారాల క్రితమే వచ్చింది. అయితే ఇది బీసీసీఐ విధాన నిర్ణయం కావున ఇందుకు సంబంధించి అధికారిక అభ్యర్థనను మేనేజర్ పంపాల్సి ఉంటుంది. కోహ్లితో కలిసి అనుష్క విదేశీ పర్యటనలకు వెళ్తోంది. అయితే పాత నిబంధనలను మార్చి టూర్ మొత్తం ఆటగాళ్ల వెంట భార్యలను అనుమతించాలని కోహ్లి కోరుతున్నాడు.’ అని బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపారు. భార్యలను, గర్ల్ ఫ్రెండ్స్‌ను క్రికెటర్లతో అనుమతించడం వల్ల గతంలో చోటుచేసుకున్న సమస్యల నేపథ్యంలో చాలా దేశాలు తమ ఆటగాళ్ల వెంట భార్యలు, స్నేహితురాళ్లను తీసుకెళ్లడంపై నిబంధనలు విధించాయి. -
సీఓఏ పరోక్షంగా సహకరించింది!
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావడంపై ఊహించినట్లుగానే బోర్డులో ఒక్కసారిగా ప్రకంపనలు రేగుతున్నాయి. బీసీసీఐని ఇప్పటి వరకు స్వతంత్ర వ్యవస్థగా నడిపిస్తూ వచ్చిన ఆఫీస్ బేరర్లు కొత్త పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే దీనిపై కోర్టుకెక్కాలని కూడా యోచిస్తున్నారు. అసలు దీనికి కారణం క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) వ్యవహార శైలే అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వారి కారణంగానే తాజా ఉత్తర్వులు వెలువడ్డాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆర్టీఐ విషయంలో చట్టపరంగా బీసీసీఐ ముందుకు వెళ్లే హక్కును సీఓఏ కాలరాసింది. ఇది వారంతా కావాలని చేసిందే అని మా గట్టి నమ్మకం. బీసీసీఐని ఎందుకు ఆర్టీఐ పరిధిలోకి తీసుకు రావద్దో చెప్పాలంటూ వాదనలు వినిపించేందుకు జూలై 10న సమాచార శాఖ కమిషన్ అవకాశం కల్పించింది. అయితే ఆ షోకాజ్ నోటీస్‌కు బోర్డు నుంచి కనీస స్పందన లేదు. బోర్డు ఎన్నికలకు ముందు ఆర్టీఐని మా మెడకు చుట్టాలని సీఓఏ భావించింది. ఇప్పుడు దీనిని హైకోర్టులో చాలెంజ్ చేయడం తప్ప మాకు మరో అవకాశం లేదు. దురదృష్టవశాత్తూ సుప్రీం కోర్టు ఆదేశాలను సీఓఏ తప్పుగా వాడుకుంది’ అని ఆ అధికారి అన్నారు. బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రావడం వల్ల ఎలాంటి ప్రశ్నలు ప్రజల నుంచి ఎదురవుతాయనే విషయంపై కూడా బోర్డు అధికారి తన అభిప్రాయం వెల్లడించారు. జట్టు ఎంపిక, ఐపీఎల్ యాజమాన్యం పాత్ర, పెట్టుబడులు, అధికారుల ప్రవర్తన, ఒక యువ ఆటగాడికి వరుసగా అవకాశాలు ఇస్తుంటే అతనికి మేనేజ్మెంట్ కంపెనీలు, బ్రాండ్లతో ఉన్న సంబంధాలు ఎలాంటివి అనే అంశాలన్నంటిపైనా ప్రశ్నల వర్షం కురుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
బీసీసీఐ ప్రెసిడెంట్‌గా గంగూలీ?
ముంబై: ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ చాలా శక్తిమంతమైన బోర్డు. కాగా భారత క్రికెట్ కార్యకలాపాలకు సంబంధించి బీసీసీఐ అధ్యక్ష పదవి చాలా కీలకం. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సంబంధాలతో సహా ఐపీఎల్ నిర్వహణ, జాతీయ సెలెక్షన్ కమిటీ, జట్టు ఎంపిక తదితర వ్యవహారాల్లో బీసీసీఐ చీఫ్ పాత్ర కీలకం. అయితే ఏడాదిపైగా బోర్డులో అధ్యక్షుడు లేకుండానే కార్యకలాపాలు సాగుతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో అనురాగ్ ఠాకూర్‌పై వేటు పడటంతో అప్పట్నుంచి బీసీసీఐ అధ్యక్ష స్థానం ఖాళీగానే ఉంది. సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైన పరిపాలన కమిటీ(సీఓఏ) బోర్డు వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. కాగా, ఇటీవల లోధా సంస్కరణల్లో కొన్నింటికి సవరణలు చేసిన సుప్రీంకోర్టు.. బోర్డు నూతన రాజ్యాంగాన్ని ఇటీవల ఆమోదించిన సంగతి తెలిసిందే. కొత్త రాజ్యాంగంలో కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను సవరించిన దరిమిలా ప్రస్తుత, మాజీ అడ్మినిస్ర్టేటర్లు బీసీసీఐ అధ్యక్ష పదవికి అనర్హులు కానున్నారు. దాంతో ఆ పదవిలో కొత్త వ్యక్తి రావడం అనివార్యం కానుంది. ఈ రేసులో ఒకప్పటి టీమిండియా కెప్టెన్, ప్రస్తుతం క్రికెట్ అసోయేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ ముందు వరుసలో ఉన్నాడు. బోర్డు అధ్యక్ష పదవి ఎన్నికల్లో పలువురు మాజీ క్రికెటర్లకు చాన్స్ ఉన్నా.. ఎక్కువ అవకాశాలు గంగూలీకే ఉన్నట్టు సమాచారం. నాలుగేళ్లుగా క్యాబ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సౌరవ్ బీసీసీఐ చీఫ్ పదవికి ప్రధాన పోటీదారు కానున్నాడు. క్యాబ్ వ్యవహారాలను సమర్థంగా నడిపిస్తుండడం, మరోవైపు బీసీసీఐ పాలన అదుపు తప్పిన సమయంలో గాడిలో పెట్టడంలో గంగూలీకి మించిన వారు మరొకరుండరన్న అభిప్రాయాలు క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే 46 ఏళ్ల సౌరవ్ కనుక బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైతే రెండేళ్ల తర్వాత అతడు వైదొలగాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పటికి క్యాబ్ అధ్యక్ష పదవితో కలిసి గంగూలీ మొత్తం ఆరు సంవత్సరాలు పూర్తి చేస్తాడు. -
కోర్టు ‘పరిపాలకుడి’ చేతుల్లో ఫోర్స్ ఇండియా
బుడాపెస్ట్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సుప్రీం కోర్టు పరిపాలక కమిటీ (సీఓఏ) చేతుల్లోకి వెళ్లినట్లే భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ ఫార్ములావన్ జట్టు లండన్ కోర్టు చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఈ టీమ్ యజమాని విజయ్ మాల్యా కష్టాలు మరింత పెరిగాయి. ఆయన టీమ్ వ్యవహారాలను హైకోర్టు నియమించిన పరిపాలకుడు పర్యవేక్షించనున్నట్లు ‘ఫోర్స్ ఇండియా’ టీమ్ డిప్యూటీ ప్రిన్సిపాల్ బాబ్ ఫెర్న్లీ వెల్లడించారు. ఈ జట్టు పెట్టుబడుల్లో పెట్టిన నగదు నిల్వలకు సంబంధించి ఆర్థిక అవకతవకలు జరిగినట్లు తేలడంతో కేసును లండన్ కోర్టు విచారిస్తోంది. ఫోర్స్ ఇండియా సీనియర్ డ్రైవర్ పెరెజ్ మాట్లాడుతూ జట్టు పరిస్థితి క్లిష్టంగా ఉందని చెప్పారు. మరో డ్రైవర్ ఒకాన్ ఈ జట్టును వదిలి రెనౌ జట్టుతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. -
వయసు తక్కువగా చూపిస్తే..
ముంబై: తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి దేశవాళీ జట్లలో కొనసాగుతోన్న క్రికెటర్లను బీసీసీఐ క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) హెచ్చరించింది. వయసు తక్కువగా చూపిస్తే ఆటగాళ్లపై రెండేళ్ల సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీఓఏ చీఫ్ వినోద్‌రాయ్ తెలిపారు. మే నెలలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించిన సీఓఏ... దేశవాళీ క్రికెట్లో సర్వసాధారణంగా మారిన ఈ మోసాలను కట్టిపెట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇదివరకు ఒక సంవత్సరంగా ఉన్న సస్పెన్షన్ కాలాన్ని రెండేళ్లకు పెంచడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మూడేళ్ల క్రితం మన్సూర్ అలీఖాన్ పటౌడీ స్మారకోపన్యాసంలో ప్రస్తుత భారత అండర్–19 కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ అంశంపై తీవ్రంగా స్పందించాడు. వయసును తక్కువగా చూపెట్టి జట్టులో చోటు దక్కించుకోవడం ఫిక్సింగ్‌తో సమానమని అన్నాడు. నకిలీ సర్టిఫికెట్లతో అండర్–19, అండర్–16 జట్లలో చేరుతున్న ఆటగాళ్ల కారణంగా... అర్హుడైన ప్రతిభ గల మరో యువ క్రీడాకారుడికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. -
బీసీసీఐ ఎస్జీఎం చెల్లదన్న సీఓఏ
ఉప్పు–నిప్పుగా తయారైన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పరిపాలక కమిటీ (సీఓఏ)ల మధ్య మరో లేఖాస్త్రం వార్తల్లోకెక్కింది. ఈ నెల 22న బీసీసీఐ నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) చెల్లదని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాశారు. అందులో తీసుకున్న విధాన నిర్ణయాలకు విలువలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎస్‌జీఎంలో క్రికెటర్ల కొత్త కాంట్రాక్ట్‌లను ఆమోదించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు బోర్డు ఆఫీస్ బేరర్లు తీసుకున్నారు. -
యో-యో టెస్టు అవసరమా?
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ నిర్వహిస్తోన్న యో-యో టెస్టుపై పలు విమర్శలు వస్తున్నాయి. కేవలం అరగంటపాటు చేసే పరీక్ష ద్వారా ఆటగాళ్ల ఫిట్నెస్ను ఎలా నిర్ధరిస్తారని మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యో యో పరీక్షనే ఎందుకు ప్రామాణికంగా తీసుకొంటున్నారని వినోద్ రాయ్ నేతృత్వంలోని పాలకుల కమిటీ(సీఓఏ) బీసీసీఐని ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. ఐపీఎల్లో రాణించిన అంబటి రాయుడు, సంజూ శాంసన్ ఇద్దరూ యో-యో టెస్టులో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో యో యో టెస్టు నిర్వహణ అనేది చర్చకు తెరలేపింది. ‘వినోద్ రాయ్‌తోపాటు ఇతర పాలక సభ్యులకు రాయుడు, సంజూ శాంసన్‌కు జరిగిన విషయంపై పూర్తి అవగాహన ఉంది. యో-యో టెస్ట్‌పై వస్తున్న ఆరోపణలను రాయ్ బృందం పరిగణనలోకి తీసుకొంటుంది. దీనిపై జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) శిక్షకుల నుంచి సమాచారం అడిగే అవకాశం ఉంది’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘యో- యో టెస్టు అనేది సాంకేతికతకు సంబంధించిన అంశమని, అందువల్ల సీవోఏ చీఫ్ ఇప్పటివరకూ కలగజేసుకోలేదని, అయితే రాబోయే రోజుల్లో క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ సబా కరీమ్ నుంచి సంపూర్ణ సమాచారం తెలుసుకొంటారని’ బీసీసీఐ అధికారి వివరించారు. కాగా, ఇప్పటికే యో యో టెస్ట్‌ను ఎప్పుడు, ఎలా అమల్లోకి తీసుకొచ్చిందీ వంటి వివరాలను తెలియజేస్తూ బీసీసీఐ ట్రెజరర్ అనిరుధ్ చౌదరి ఆరు పేజీల లేఖను సీవోఏకు పంపించారు. -
క్రికెటర్ల ‘ఫీజు’ చెల్లింపుకు ఆమోదం
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్ ఫీజులకు సంబంధించి ఎట్టకేలకు ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో(ఎస్‌జీఎమ్) క్రికెటర్ల కాంట్రాక్ట్ ఫీజుల చెల్లింపుపై నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే వార్షిక ఫీజుల్ని పెంచినప్పటికీ బోర్డు నుంచి తుది ఆమోదం దక్కకపోవడంతో క్రికెటర్లకు పెంచిన జీతాలను పెండింగ్‌లో పెట్టారు. కాగా, ఈరోజు అత్యవసరంగా బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి నేతృత్వంలోని సమావేశమైన ఎస్‌జీఎమ్.. క్రికెటర్ల కాంట్రాక్ట్ ఫీజులకు చెల్లించేందుకు ఆమోదం ముద్రవేసింది. మరొకవైపు ఎస్‌జీఎమ్‌లో చర్చకు వచ్చిన అన్ని ప్రతిపాదనలకు జనరల్ బాడీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వార్షిక కాంట్రాక్ట్ ప్రకారం ఏ+ కేటగిరీ ఆటగాళ్లకు రూ. 7 కోట్లు చొప్పున దక్కనుండగా, ఏ కేటగిరీలో ఉన్న క్రికెటర్లకు రూ. 5 కోట్లు పొందనున్నారు. ఇక బీ కేటగిరీలో ఉన్న వారికి రూ. 3 కోట్లు, సీ కేటగిరీలో క్రికెటర్లకు రూ. 1 కోటి చొప్పన దక్కనున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో భాగంగా ఈరోజు రాత్రి భారత క్రికెటర్లు బయల్దేరుతున్న సమయంలో కాంట్రాక్ట్ వార్షిక ఫీజులపై ఆమోద ముద్ర పడటం విశేషం. -
బీసీసీఐ ప్రత్యేక భేటీ నేడు
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు నియమించిన పరిపాలక కమిటీ (సీఓఏ) వద్దని వారించినా....భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి (ఎస్‌జీఎమ్) సిద్ధమైంది. ఆటగాళ్ల కొత్త కాంట్రాక్టు ఫీజులకు ఈ సమావేశంలో ఆమోదం లభించనుంది. దీంతో పాటు మరో పది అంశాలను ఇందులో చర్చించనున్నారు. ఇది వరకే వార్షిక ఫీజుల్ని పెంచినప్పటికీ బోర్డు నుంచి తుది ఆమోదం దక్కకపోవడంతో క్రికెటర్లకు పెంచిన జీతాలు ఇవ్వలేకపోయామని బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి వెల్లడించారు. ‘పెంచిన పారితోషికాలను ఇంకా ఇవ్వకపోవడంపై నాకు విచారంగానే ఉంది. అయితే బోర్డు సర్వసభ్య సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. జీతాల పెంపు ప్రతిపాదన చాలా రోజుల నుంచి ఫైనాన్స్ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిపై ఆమోదం పొందగానే నేను సంతకం చేస్తాను. లేదంటే లేదు’ అని అమితాబ్ అన్నారు. మరోవైపు బోర్డు ఖర్చులతో అనధికారికంగా భూటాన్ పర్యటనకు వెళ్లొచ్చిన అమితాబ్ చౌదరికి సీఓఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లడమేంటని అందులో ప్రశ్నించింది. -
ఆఫీస్ బేరర్ల ఉద్వాసనకు సీఓఏ నివేదిక
న్యూఢిల్లీ: పాలనా వ్యవహారాల్లో జస్టిస్ లోధా సంస్కరణల అమలుపై బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) మధ్య అసలే అంతంతమాత్రంగా ఉన్న సంబంధాల్లో మరో కుదుపు. బీసీసీఐ నియమావళి ప్రకారం పదవీ కాలం పూర్తయినందున ప్రస్తుత ఆఫీస్ బేరర్లు తప్పుకోవాలని, కొత్త రాజ్యాంగం అమలుకు ముందే లోధా సిఫార్సుల ప్రకారం సర్వసభ్య సమావేశం నిర్వహించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని అపెక్స్ కోర్టును సీవోఏ కోరింది. ఈ మేరకు సీవోఏ సభ్యులు వినోద్‌రాయ్, డయానా ఎడుల్జీ గురువారం తమ ఎనిమిదో స్థాయీ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేశారు. మార్చి 1వ తేదీతోనే పదవీ కాలం పూర్తయిన తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులు సీకే ఖన్నా, అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుధ్ చౌదరి, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాలను తొలగించి, కొత్తగా ఎన్నిక నిర్వహించాలని ఇందులో కోరారు. అయితే... దీనిని వీరు ముగ్గురూ ప్రతిఘటించనున్నట్లు తెలుస్తోంది. విధాన నిర్ణయాలపై చర్చించే సర్వసభ్య సమావేశం నిర్వహణకు వినోద్ రాయ్ కమిటీ సరైన ప్రొటొకాల్ పాటించ లేదనేది ఖన్నా బృందం వాదనగా ఉంది. కాంట్రాక్టులపై అమితాబ్ అసంతృప్తి... 26 మంది క్రికెటర్లకు బుధవారం సీఓఏ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల వ్యవహారం చిక్కుల్లో పడనుంది. ఈ విషయంలో తనతో సహా బీసీసీఐలోని ముగ్గురు ప్రధాన అధికారులను సంప్రదించకుండా సీఓఏ నిబంధనలను అతిక్రమించిందంటూ బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి కోర్టు జోక్యాన్ని కోరనున్నారు. కాంట్రాక్టు జాబితాను చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ రూపొందించిందని, వాస్తవానికి వారికి ఆ అర్హత లేదని జాతీయ సెలెక్షన్ కమిటీ కన్వీనర్ అమితాబ్ అంటున్నారు. అయితే... కొత్త కాంట్రాక్టు స్వరూపంపై గతేడాది సెప్టెంబర్ లోనే బీసీసీఐ ఫైనాన్స్ అధ్యక్షుడు జ్యోతిరాదిత్య సింధియా, కోశాధికారి అనిరుధ్ చౌదరిలకు సమాచారం ఇచ్చామని వారి నుంచి ప్రతిస్పందన రాలేదని రాయ్ అంటున్నారు. కానీ దీనికి ఆధారాలు లేవని బీసీసీఐ అధికారి ఒకరు చెబుతున్నారు. -
'ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు'
న్యూఢిల్లీ:భారత క్రికెటర్లకు వార్షిక వేతనాలను పెంచే విషయంలో ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ తాత్కాలిక సెక్రటరీ సీకే ఖన్నా స్పష్టం చేశారు. ప్రస్తుతం క్రికెటర్ల శాలరీ పెంపు అంశం చర్చల పరిధిలో మాత్రమే ఉందని వెల్లడించారు. దీనిపై త్వరలో జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్‌జీఎమ్)లో చర్చించాల్సి ఉందన్నారు. 'క్రికెటర్ల శాలరీ పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నాం. దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. రాబోవు సమావేశాల్లో జీతాల పెంపుకు సంబంధించి స్పష్టత వస్తుంది. ఎస్‌జీఎమ్‌లో బీసీసీఐ ఫైనాన్స్ కమిటీతో చర్చించిన తరువాత మాత్రమే తుది నిర్ణయం ఉంటుంది' అని సీకే ఖన్నా తెలిపారు. ఇప్పటివరకూ బీసీసీఐ వార్షిక రెవెన్యూలో రూ. 180 కోట్లను క్రికెటర్లకు కేటాయిస్తుండగా, దానికి అదనంగా మరో రూ. 200 కోట్లను చేర్చాలని పరిపాలకుల కమిటీ(సీఓఏ) యోచిస్తోంది. తద్వారా క్రికెటర్లకు ఇప్పుడు తీసుకుని వార్షిక జీతం మీద రెట్టింపు చేయాలనేది సీఓఏ ఆలోచన. దీనిలో భాగంగా ఇటీవల ఢిల్లీలో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్ అనంతరం సీఓఏతో సమావేశమైన కోహ్లి, ఎంఎస్ ధోని, కోచ్ రవిశాస్త్రిలు ఆటగాళ్ల శాలరీ పెంపుపై చర్చించారు. దీనికి సుముఖత వ్యక్తం చేసిన పరిపాలకుల కమిటీ బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. ఒకవేళ ఇందుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి వార్షిక ఫీజు 100 శాతం పెరిగే అవకాశం ఉంది. -
టీమిండియా సేవలకు ద్రవిడ్ దూరం
సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ న్యూఢిల్లీ: వివాదాస్పద రీతిలో టీమిండియా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమితులైన మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఆ బాధ్యతలు తీసుకునేందుకు నిరాకరించారు. ఈ విషయాన్ని పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ స్పష్టం చేశారు. భారత జట్టు విదేశీ పర్యటనలకు రాహుల్ ద్రవిడ్ అందుబాటులో ఉండటం లేదని ఆయన తెలిపారు. ‘ద్రవిడ్‌కు అండర్–19, భారత్ ‘ఎ’ జట్ల కోచ్‌గా రెండేళ్ల ఒప్పందం ఉంది. వచ్చే ఏడాది అండర్–19 ప్రపంచకప్, అలాగే కొన్ని ‘ఎ’ సిరీస్‌లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ జట్టు వెంట ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లే సమయం లేదు. అయితే కోచ్ రవిశాస్త్రి సూచన మేరకు జట్టు జాతీయ క్రికెట్ శిబిరంలో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటారు’ అని వినోద్ రాయ్ వివరించారు. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) నేతృత్వంలో ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఆయన సహాయకులుగా ద్రవిడ్, జహీర్‌లను నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. సహాయక సిబ్బందిని ఎంపిక చేసుకునే అధికారం కోచ్‌కే ఉంటుందని సీఓఏ కూడా తెలిపింది. ప్రస్తుతం జట్టు శ్రీలంక పర్యటనలో ఉన్నా ద్రవిడ్ వెళ్లలేదు. త్వరలో దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత్ ‘ఎ’ జట్టుతో వెళ్లనున్నారు. అయితే బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఉన్న జహీర్ ఖాన్ త్వరలోనే జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లే అవకాశం ఉందని వినోద్ రాయ్ తెలిపారు. ఆయనతో రవిశాస్త్రి టచ్‌లోనే ఉన్నారని, లంక పర్యటన ముగిశాక జట్టుతో చేరతాడని చెప్పారు. -
'సరైన వ్యక్తినే కోచ్‌గా ఎంపిక చేశారు'
న్యూఢిల్లీ:భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేయడంపై బీసీసీఐ పాలకుల కమిటీ(సీవోఏ) హర్షం వ్యక్తం చేసింది. సరైన వ్యక్తిని కోచ్ గా ఎంపిక చేశారంటూ పేర్కొన్న సీవోఏ.. దానికి కారణమైన సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)ని అభినందించింది. 'కోచ్ ను ఎంపిక చేసే క్రమంలో సీఏసీ సభ్యులు నిబద్ధతతో పని చేశారు. ఏది ఆశించామో అదే చేసి చూపించారు. రవిశాస్త్రి కోచ్ గా సరైన వ్యక్తి అనడంలో ఎటువంటి సందేహం లేదు' అని ఓ ప్రకటనలో సీవోఏ అభిప్రాయపడింది. ప్రస్తుతం వచ్చిన కోచ్ తో భారత జట్టు ఆశించిన ఫలితాల్ని సాధిస్తుందని పేర్కొంది. ఈ కొత్త కాంబినేషన్ తో భారత జట్టు నంబర్ వన్ జట్టుగా నిలవడం ఖాయమని సీవోఏ జోస్యం చెప్పింది. -
విండీస్ పర్యటనకు కుంబ్లేనే కోచ్
న్యూఢిల్లీ: భారత జట్టు కోచ్‌గా అనిల్ కుంబ్లేను కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ పరిపాలకుల కమిటీ ( సీఓఏ) సోమవారం స్పష్టం చేసింది. ఈ నెల చివర్లో భారత జట్టు పర్యటించే వెస్టిండీస్ సిరీస్ వరకు కుంబ్లేనే కోచ్‌గా ఉంటాడని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. ఈ నెల 20 తో కుంబ్లే కోచ్‌పదవి కాలం ముగియనుండటంతో బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. కుంబ్లేకు భారత కెప్టెన్ కోహ్లీకి విభేదాలు తలెత్తడంతో మార్పు అనివార్యమని అందరూ భావించినా బీసీసీఐ కుంబ్లే పదవి కాలన్ని పొడిగించింది. అంతకు ముందు సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్ సలహాదారుల కమిటీ కోచ్‌గా అనిల్ కుంబ్లేనే కొనసాగించాలని బీసీసీఐకి సూచించినట్లు వార్తలు వచ్చాయి. -
చాంపియన్స్ ట్రోఫి తర్వాత వీరేంద్రిండియా!
అనిల్ కుంబ్లే కోచ్ పదవిలో కొనసాగేందుకు ససేమీరా అంటున్నాడా?. తాజా సమాచారం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. చాంపియన్స్ ట్రోఫి ముగిసిన తర్వాత కోచ్ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటానని బీసీసీఐకు చెప్పినట్లు తెలిసింది. దీంతో టోర్నీ అనంతరం మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కోచ్ పగ్గాలు చేపడతాడని తెలిసింది. అయితే, సీఓఏ మాత్రం కుంబ్లేనే కోచ్ పదవిలో కొనసాగాలని కోరుతున్నట్లు సమాచారం. కాగా, కోహ్లీ, కుంబ్లేల మధ్య మనస్పర్దలను తొలగించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఇంగ్లాండ్‌కు వెళ్లింది. -
భారత క్రికెట్లో సంచలనం
-
భారత క్రికెట్లో సంచలనం
బీసీసీఐ తీరును తప్పుబట్టిన రామచంద్ర గుహ సూపర్‌స్టార్ సంప్రదాయం కొనసాగుతుందని విమర్శ ధోనికి గ్రేడ్ ‘ఏ’ కాంట్రాక్టుపై విస్మయం, కోచ్ కుంబ్లేకు మద్దతు న్యూఢిల్లీ: బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నుంచి తప్పుకున్న ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ బాంబు పేల్చారు. సీఓఏ నుంచి తప్పుకున్న మరుసటి రోజే ఏడు కీలక అంశాలతో లేఖాస్త్రాన్ని సంధించారు. భారత్ క్రికెట్, బీసీసీఐలో కొనసాగుతున్న సూపర్‌స్టార్ సంప్రదాయాన్ని తీవ్రంగా విమర్శించారు. టెస్టుల నుంచి రిటైరయిన ఎంఎస్ ధోనికి గ్రేడ్ ‘ఏ’ కాంట్రాక్టు కొనసాగిస్తుండడాన్ని తప్పుబట్టారు. 2014లో టెస్టు క్రికెట్ నుంచి తనంత తానుగా తప్పుకున్న ధోనికి టాప్ గ్రేడ్ కొనసాగించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్రికెట్ ఏజెన్సీలతో సంబంధమున్న గవాస్కర్‌ను వ్యాఖ్యాతగా ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. కొంత మంది జాతీయ కోచ్‌లకు బీసీసీఐ అధిక ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు. జాతీయ జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించకుండా కోచ్‌లు రెండు నెలల పాటు ఐపీఎల్ మత్తులో మునిగితేలారని ధ్వజమెత్తారు. టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేకు ఆయన బాసటగా నిలిచారు. కుంబ్లే సత్తా ఏమిటో అతడి రికార్డులే చెబుతాయని పేర్కొన్నారు. డ్రెస్సింగ్ రూములో కుంబ్లే వైఖరిపై కెప్టెన్ కోహ్లి సహా సీనియర్ ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో కొత్త కోచ్ కోసం బీసీసీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కోహ్లి-కుంబ్లే వివాదం పుకారని బీసీసీఐ కొట్టిపారేసింది. వచ్చే నెలతో కుంబ్లే కాంట్రాక్టు ముగుస్తున్నందున కొత్త కోచ్ కోసం నోటిఫికేషన్ జారీ చేసినట్టు వెల్లడించింది. -
'భారత క్రికెట్ జట్టును ప్రకటించండి'
న్యూఢిల్లీ: వచ్చే నెల్లో ఇంగ్లండ్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత క్రికెట్ జట్టును తక్షణమే ప్రకటించాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి పరిపాలక కమిటీ (సీఓఏ) ఆదేశాలు జారీ చేసింది. అసలు ఇప్పటికే గడువు ముగిసిన నేపథ్యంలో జట్టును ప్రకటించకుండా ఎందుకు తాత్సారం చేసినట్లు చెప్పాలని సీఓఏ అధినేత వినోద్ రాయ్ నిలదీశారు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ పద్ధతిని బీసీసీఐ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.ఆ క్రమంలోనే ఐసీసీ నిర్వహించే మెగా ఈవెంట్లలో ఒకటైన చాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉండాలని బీసీసీఐ ఆలోచనగా ఉంది. కాగా, దీన్ని సుప్రీంకోర్టుచే నియమించబడ్డ సీఓఏ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అది సరైన చర్య కాదని సీఓఏ అభిప్రాయపడుతోంది. దీనిలో భాగంగానే బీసీసీఐ జాయింట్ సెక్రటరీ అమితాబ్ చౌదరికి వినోద్ రాయ్ లేఖ రాశారు. 'ఏప్రిల్ 25వ తేదీన ప్రకటించాల్సిన జట్టును ఎందుకు ప్రకటించలేదు. ఆ ట్రోఫీని భారత తిరిగి నిలబెట్టుకోవాలంటే ముందు నుంచే సన్నాహకం అవసరం. అయినప్పటికీ జట్టు ఎంపికపై బీసీసీఐ తాత్సారం చేస్తుంది. జట్టును ప్రకటించటానికి సెలక్షన్ కమిటీతో సమావేశం నిర్వహించండి. తక్షణమే చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే జట్టును ఎంపిక చేసి ఆ వివరాల్ని ఐసీసీకి తెలియజేయండి.వేరే కారణాలతో టోర్నీని బాయ్ కాట్ చేయడం సరైన విధానం కాదు' అని అమితాబ్ చౌదరికి రాసిన లేఖలో్ వినోద్ రాయ్ పేర్కొన్నారు. -
‘మరో ఐదు నెలల్లో అంతా అమలు’
న్యూఢిల్లీ: బీసీసీఐలో లోధా ప్యానెల్ సూచించిన నూతన సంస్కరణలు మరో నాలుగైదు నెలల్లో పూర్తిగా అమలవుతాయని పరిపాలక కమిటీ (సీఓఏ) పేర్కొంది. ‘కోర్టు సూచించినట్టుగా బోర్డు పూర్తి ప్రక్షాళన వీలైనంత త్వరగా చేసేలా ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా నూతన నిర్మాణం, ఆర్థిక విధానం, పరిపాలన పారదర్శకంగా ఉండేలా వ్యవస్థను రూపొందిస్తాం. ఇదంతా సుదీర్ఘంగా కాకుండా వచ్చే నాలుగు లేదా ఐదు నెలల్లోనే పూర్తవుతుంది’ అని నలుగురి సభ్యులతో కూడిన సీఓఏకు నేతృత్వం వహిస్తున్న వినోద్ రాయ్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం భారత్‌లో క్రికెట్ జరిగేందుకు ఎలాంటి అడ్డంకి లేదని చెప్పారు.