ముంబై: పరిపాలక కమిటీ (సీఓఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలపై మళ్లీ అసంతృప్తి వెళ్లగక్కారు. ఐపీఎల్ ఫైనల్ రోజు విజేత జట్టుకు ట్రోఫీని అందజేయాలనుకున్న ఆమెను బీసీసీఐ వారించడమే ఆమె తాజా అసంతృప్తికి కారణం. అప్పటికే ఎడుల్జీ మహిళ టీ20 చాలెంజ్ విజేతకు ట్రోఫీని ప్రదానం చేశారు. దీంతో పురుషుల విజేతకు ప్రొటోకాల్ ప్రకారం బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా అందజేశారు. దీనిపై ఆమె మాట్లాడుతూ ట్రోఫీలు అందజేసే ప్రొటోకాల్‌ను ఖన్నా గతంలో పాటించలేదన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.
‘భారత్‌లో ఆసీస్‌తో ముఖాముఖి వన్డే సిరీస్ సందర్భంగా న్యూఢిల్లీలో విజేతగా నిలిచిన ఆసీస్‌కు నిబంధనల ప్రకారం ట్రోఫీని అందజేయాల్సిన ఆయన ఢిల్లీ సంఘానికి చెందిన వ్యక్తితో ట్రోఫీ ప్రధానోత్సవాన్ని కానిచ్చారు. అలాంటపుడు ఐపీఎల్ ఫైనల్లో నేనిస్తానంటే ప్రొటోకాల్ ఊసెందుకు’ అని ఆమె ప్రశ్నించారు. నిజానికి గత నెలలో న్యూఢిల్లీలో జరిగిన బోర్డు సమావేశంలో ప్రధానోత్సవ కార్యక్రమంపై చర్చించినట్లు ఆమె చెప్పుకొచ్చారు.
ఐపీఎల్ ఫైనల్‌కు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ హాజరైతే ఆయన ట్రోఫీని ఇవ్వాలని లేదంటే సహ సభ్యుడై న కల్నల్ రవి తోడ్గేతో కలసి ఉమ్మడిగా ఇస్తానని ప్రతిపాదన చేశానని ఎడుల్జీ వివరించారు. అయితే ఖన్నా మాత్రం ప్రొటోకాల్ ప్రకారం తానే ఇస్తానని బదులిచ్చారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె ప్రొటోకాల్ ప్రకారమే అయితే భారత్–ఆసీస్ సిరీస్ అప్పుడు ఎందుకు పాటించలేదని ఖన్నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీసీఐలోని ఉన్నతాధి కారులు కావాలని తనను పక్కనబెట్టాలని చూస్తున్నారని ఎడుల్జీ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment