Diana Edulji
-
T20 WC: ‘కెప్టెన్సీకి కఠిన సవాలు.. ఈసారైనా ట్రోఫీ గెలవాలి’
ఒత్తిడిని అధిగమిస్తేనే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లలో విజయం వరిస్తుందని భారత మహిళా మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ పేర్కొంది. ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్లపై పైచేయి సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో ఆది నుంచే దూకుడు ప్రదర్శించాలని మహిళా జట్టుకు సూచించింది. ఆస్ట్రేలియా చేతిలో వరుస పరాజయాలుకాగా నాలుగేళ్ల క్రితం జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. అయితే, టైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ట్రోఫీని చేజార్చుకుంది. అదే విధంగా... 2023 ఫిబ్రవరిలో జరిగిన టీ20 వరల్డ్ కప్ సమయంలోనూ భారత మహిళా జట్టు ప్రయాణం సెమీఫైనల్స్నే ముగిసింది. ఈ దఫా కూడా మన జట్టు ఆస్ట్రేలియా చేతిలోనే ఓడటం గమనార్హం. అయితే ఈసారి మాత్రం అలాంటి అవకాశాన్ని వదలరాదని, మన ప్లేయర్లు ఒత్తిడిని అధిగమించాలని భారత మాజీ ప్లేయర్ డయానా ఎడుల్జీ సూచించింది. అక్టోబర్ 3 నుంచి యూఏఈలో జరిగే టీ20 వరల్డ్ కప్ ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొంది.మనదైన రోజు ఏదైనా సాధ్యమేఈ సందర్భంగా... ఎడుల్జీ మాట్లాడుతూ... ‘ఆస్ట్రేలియాలాంటి ప్రొఫెషనల్ టీమ్‌ను ఓడించాలంటే మనం అన్ని రకాలుగా ఆధిపత్యం ప్రదర్శించాలి. మన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తేనే ప్రత్యర్థి కూడా తడబడుతుంది. అయితే టీ20ల్లో మనదైన రోజు ఏదైనా సాధ్యమే. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో మనం ఓడిపోతామని అనుకున్నామా? ప్లేయర్లు ఎలాంటి స్థితిలోనూ ఒత్తిడికి తలవంచవద్దు.భావోద్వేగాలను అదుపు చేసుకోవాలిప్రపంచకప్ కప్ టోర్నీలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఆమెకు ఉంది. ఆమె బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీకి కూడా ఈ టోర్నీ సవాల్’ అని ఎడుల్జీ అభిప్రాయపడింది. అదే విధంగా.. భారత పురుషుల జట్టు మాదిరే మహిళల టీమ్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ గెలిచి.. ఒకే ఏడాది అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. చదవండి: DT 2024: గిల్ ప్లేస్‌లో ఎంట్రీ.. కట్ చేస్తే మెరుపు సెంచరీ?(వీడియో) -
ICC Cricket World Cup: ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో సెహ్వాగ్, ఎడుల్జీ
దుబాయ్: భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కించుకున్నారు. ఈ ఇద్దరు భారత క్రికెటర్లతో పాటు శ్రీలంక దిగ్గజం అరవింద డిసిల్వాను కూడా తాజాగా ఐసీసీ ఈ విశిష్ట క్రికెటర్ల జాబితాలో చేర్చింది. భారత్ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇప్పటి వరకు తొమ్మిది మందికి చోటు లభించగా... ఎడుల్జీ ఈ జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ కావడం విశేషం. ఆయా జట్లకు అందించిన సేవలు, నడిపించిన తీరు, గెలిపించిన ఘనతలు అన్నీ పరిగణించే ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లోకి ఎంపిక చేస్తారు. డయానా ఎడుల్జీ: భారత్‌లో అమ్మాయిల క్రికెట్‌వైపు కన్నెత్తి చూడని రోజుల్లోనే క్రికెటరై తర్వాత సారథిగా ఎదిగింది. 1976 నుంచి 1993 వరకు భారత జట్టుకు ఆడి స్పిన్ ఆల్‌రౌండర్‌గా రాణించింది. 20 టెస్టులాడి 63 వికెట్లు తీసి, 404 పరుగులు చేసింది. 34 వన్డేల్లో 211 పరుగులు సాధించి 46 వికెట్లు పడగొట్టింది. సెహ్వాగ్: భారత టెస్టు క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా సెహ్వాగ్ రికార్డుల్లోకెక్కాడు. భారత్ 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. సెహ్వాగ్ 104 టెస్టులు ఆడి 8586 పరుగులు సాధించాడు. 23 సెంచరీలు చేశాడు. 40 వికెట్లు తీశాడు. 251 వన్డేలాడి 8273 పరుగులు, 15 సెంచరీలు సాధించాడు. 96 వికెట్లు కూడా తీశాడు. 19 టి20లు ఆడి 393 పరుగులు సాధించాడు. అరవింద డిసిల్వా: ఆ్రస్టేలియాతో జరిగిన 1996 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో డిసిల్వా వీరోచిత సెంచరీతో జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. 308 వన్డేల్లో 9284 పరుగులు చేశాడు. 106 వికెట్లు పడగొట్టాడు. 93 టెస్టుల్లో 6361 పరుగులు సాధించాడు. -
ఎడుల్జీ... మళ్లీ అసంతృప్తి
ముంబై: పరిపాలక కమిటీ (సీఓఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలపై మళ్లీ అసంతృప్తి వెళ్లగక్కారు. ఐపీఎల్ ఫైనల్ రోజు విజేత జట్టుకు ట్రోఫీని అందజేయాలనుకున్న ఆమెను బీసీసీఐ వారించడమే ఆమె తాజా అసంతృప్తికి కారణం. అప్పటికే ఎడుల్జీ మహిళ టీ20 చాలెంజ్ విజేతకు ట్రోఫీని ప్రదానం చేశారు. దీంతో పురుషుల విజేతకు ప్రొటోకాల్ ప్రకారం బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా అందజేశారు. దీనిపై ఆమె మాట్లాడుతూ ట్రోఫీలు అందజేసే ప్రొటోకాల్‌ను ఖన్నా గతంలో పాటించలేదన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ‘భారత్‌లో ఆసీస్‌తో ముఖాముఖి వన్డే సిరీస్ సందర్భంగా న్యూఢిల్లీలో విజేతగా నిలిచిన ఆసీస్‌కు నిబంధనల ప్రకారం ట్రోఫీని అందజేయాల్సిన ఆయన ఢిల్లీ సంఘానికి చెందిన వ్యక్తితో ట్రోఫీ ప్రధానోత్సవాన్ని కానిచ్చారు. అలాంటపుడు ఐపీఎల్ ఫైనల్లో నేనిస్తానంటే ప్రొటోకాల్ ఊసెందుకు’ అని ఆమె ప్రశ్నించారు. నిజానికి గత నెలలో న్యూఢిల్లీలో జరిగిన బోర్డు సమావేశంలో ప్రధానోత్సవ కార్యక్రమంపై చర్చించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఐపీఎల్ ఫైనల్‌కు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ హాజరైతే ఆయన ట్రోఫీని ఇవ్వాలని లేదంటే సహ సభ్యుడై న కల్నల్ రవి తోడ్గేతో కలసి ఉమ్మడిగా ఇస్తానని ప్రతిపాదన చేశానని ఎడుల్జీ వివరించారు. అయితే ఖన్నా మాత్రం ప్రొటోకాల్ ప్రకారం తానే ఇస్తానని బదులిచ్చారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె ప్రొటోకాల్ ప్రకారమే అయితే భారత్–ఆసీస్ సిరీస్ అప్పుడు ఎందుకు పాటించలేదని ఖన్నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీసీఐలోని ఉన్నతాధి కారులు కావాలని తనను పక్కనబెట్టాలని చూస్తున్నారని ఎడుల్జీ ఆరోపించారు. -
పాక్‌పై నిషేధం వద్దంటున్న డయానా
ముంబై: ‘నలుగురికీ నచ్చినది నాకసలే నచ్చదు’ అనే పాట క్రికెట్ పరిపాలక కమిటీ (సీవోఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీకి పక్కాగా సెట్ అవుతుంది. ఎందుకంటే అందరి నిర్ణయాలు ఒకలా ఉంటే ఆమె నిర్ణయాలు మరోలా ఉంటాయి. మహిళల క్రికెట్ కోచ్ వివాదం నుంచి మిథాలీరాజ్ సారథ్య విషయంలో, రాహుల్-పాండ్యాలు వివాదస్పద వ్యాఖ్యల సందర్భాలలో డయానా ఎడ్డం అంటే తెడ్డం అన్నారు. తాజాగా మరో విషయంలోనూ అందరికీ వ్యతిరేకంగా నిలుచొని వార్తల్లో నిలిచారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో యావత్ భారత్.. పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగే మ్యాచ్ ఆడవద్దనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. రెండు పాయింట్లు పోయినా పర్లేదు కానీ.. ఉగ్రవాద ప్రేరేపిత దేశంతో ఆడే ముచ్చటే లేదని అభిమానులు బీసీసీఐని కోరుతున్నారు. (పాక్‌తో ఆడకపోవడం న్యాయమైందే : కేంద్రమంత్రి) ఈ క్రమంలో భారతీయుల మనోభావాల ప్రకారమే నడుచుకోవాలని బీసీసీఐ, సీవోఏ భావిస్తోంది. ప్రపంచకప్‌లో పాక్‌తో మనం ఆడకుండా ఉండే బదులు ఆజట్టునే ఆడకుండా చేయాలని బీసీసీఐ ఆలోచిస్తుంది. ఈ క్రమంలో ప్రపంచకప్‌లో పాక్‌ను నిషేదించాలని ఐసీసీకి లేఖ రాయాలని అధికారులు భావించారు. ఈ మేరకు సీవోఏ చైర్మన్ వినోద్ రాయ్ బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రితో లేఖ రాయించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రతిపాదనకు అందరూ సమ్మతం తెలపగా డయానా మాత్రం అడ్డుపడ్డారు. ప్రపంచకప్‌లో పాక్‌పై నిషేధం వద్దని, మరేదైనా ఆలోచిద్దామని సభ్యులతో విభేదించారు. మిగతా సభ్యులు ఎంత చెప్పిన డయానా వినకపోవడంతో శుక్రవారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. భారత్ లేకుండా ప్రపంచ కప్‌లో ఐసీసీ ముందుకెళ్లలేదని దీంతో పాక్‌ను నిషేదించేలా ఒత్తిడి చేయాలని బీసీసీఐ అనకుంటున్న తరుణంలో ఎడుల్జీ నిర్ణయంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు. (ఉగ్రదాడి: ధర్మశాలలో పాక్ క్రికెటర్ల ఫోటోలు తొలగింపు) చదవండి: ప్రపంచకప్‌లో భారత్-పాక్ మ్యాచ్ జరిగేనా? ఉగ్ర మారణహోమం -
ఆ ఇద్దరూ నన్ను అవమానించారు: మిథాలీ
ముంబై : మహిళా టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో తనను అర్థాంతరంగా తప్పించడం వెనుక కోచ్ రమేశ్ పవార్, మాజీ కెప్టెన్, పరిపాలకుల కమిటీ (సీఓఏ) మెంబర్ డయానా ఎడుల్జీల హస్తం ఉందని సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ ఆరోపించారు. తమ అధికారం అడ్డం పెట్టుకొని తనను తొక్కేయడానికి ప్రయత్నించారని మిథాలీ బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నట్లు పీటీఐ తెలిపింది. మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో మిథాలీని పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హర్మన్‌సేన దారుణంగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో మిథాలీని బెంచ్‌కు పరిమితం చేస్తూ.. జట్టు మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రపంచకప్ నెగ్గడానికి బంగారం లాంటి అవకాశం ఉన్న తరుణంలో కోచ్‌తో పాటు జట్టు మేనేజ్మెంట్ తీసుకున్న వివాదస్పద నిర్ణయం తనను నిరాశ పర్చిందని మిథాలీ పేర్కొంది. ‘నాకు వ్యతిరేకంగా డయానా తన అధికారాన్ని ఉపయోగించింది. నా 20 ఏళ్ల క్రికెట్ కెరీర్లో తొలి సారి నేను చాలా బాధపడ్డాను. అవమానానికి గురయ్యాను. అధికారంలో ఉండి నన్ను నాశనం చేయాలని, నా ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టాలనుకున్న కొందరు నా దేశానికి నేను చేసిన సేవలకు విలువనిస్తున్నారా అని ఆలోచించాల్సి వచ్చింది. నేను క్రికెట్ ఆడకుండా కొంతమంది కుట్రపన్నారు. నేను ఈ విషయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌పై నాకెలాంటి వ్యతిరేకత లేదు. నన్ను జట్టు నుంచి తొలగించాలని చెప్పిన కోచ్ నిర్ణయానికి ఆమె మద్దతు ఇవ్వడమే ఎంతో బాధించింది. క్షోభకు గురిచేసింది. దేశం కోసం ప్రపంచకప్ గెలవాలనుకున్నా. కానీ మేం ఓ బంగారంలాంటి అవకాశం కోల్పోయాం. నాకు డయానా ఎడుల్జీ అంటే చాలా గౌరవం. ఆమె నాకు వ్యతిరేకంగా పనిచేస్తుందని నేను కలలో కూడా ఉహించలేదు. నన్ను రిజర్వు బెంచీపై కూర్చోబెట్టడాన్ని ఆమె మీడియాలో సమర్థించడం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. కోచ్ పవార్ అయితే నెట్స్‌లో ఇతరులు బ్యాటింగ్ చేస్తుంటే అక్కడే నిలబడి చూసేవారు. నేను బ్యాట్ పట్టుకోగానే అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. ఆయనతో మాట్లాడటానికి ఎంత ప్రయత్నించినా ముఖం చాటేసేవాడు. అది నాకు చాలా అవమానకరంగా ఉండేది. అయినా నేనెప్పుడు నా ప్రశాంతతను కోల్పోలేదు.’ అని మిథాలీ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. ఇక సోమవారం బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రిని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్, మేనేజర్ తృప్తి భట్టాచార్యలు వేర్వేరుగా సమావేశమై ఈ వివాదంపై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. -
సచిన్ టెండూల్కర్ చొరవతోనే..
న్యూఢిల్లీ: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో భారీ సెంచరీతో మెరిసి భారత్ ను ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన హర్మన్ ప్రీత్ కౌర్ కు గతంలో ఉన్నత ఉద్యోగం ఇప్పించే విషయంలో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సాయం చేశాడని మాజీ మహిళా క్రికెట్ కెప్టెన్ డయానా ఎడుల్జి తాజాగా వెల్లడించారు. తొలుత హర్మన్ కు చిన్సస్థాయి ఉద్యోగం ఉండేదని, అపార ప్రతిభ ఉన్న ఆ క్రీడాకారిణికి ఉన్నతమైన ఉద్యోగం రావడంలో సచిన్ చొరవ తీసుకున్నట్లు ఎడుల్జి పేర్కొన్నారు. 'నాకు కౌర్ టాలెంట్ గురించి తెలుసు. జూనియర్ స్థాయి నుంచి ఆమెను గమనిస్తూనే ఉన్నాను. దాంతో ఆమెను ముంబై క్రికెట్ కు మారమని అడిగా. ముంబైకి వస్తే మంచి జాబ్ వస్తుందనే హర్మన్ కు హామీ ఇచ్చా. నార్తరన్ రైల్వేకు ఆడేటప్పుడు ఆమెకు చిన్న ఉద్యోగం మాత్రమే ఉండేది. నేను అప్పట్లో ఆమెకు చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్ట్ ఇవ్వాలని ప్రతిపాదిస్తూ ఢిల్లీకి లేఖ రాశా. అయితే వివిధ కారణాలతో ఆమెకు ఉద్యోగం రాలేదు. కాకపోతే ఇదే విషయంపై సచిన్ కు తెలియజేశా. ఎంపీగా ఉన్న సచిన్.. రైల్వే మంత్రికి లేఖ రాసి హర్మన్ కు ఉన్నతస్థాయి ఉద్యోగం వచ్చేలా చేశారు'అని ఎడుల్జి తెలిపారు. -
కౌర్ ఇంట సంబరాల వెల్లువ
-
కౌర్ ఇంట సంబరాల వెల్లువ
మోగా: మహిళల వన్డే ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సంచల ఇన్నింగ్స్‌తో భారత జట్టును గెలిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. కౌర్ ధనాధన్ ఆటతో ఇండియా టీమ్ ఫైనల్లోకి దూసుకెళడంతో పంజాబ్‌లోని మోగాలో కౌర్ కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. పరస్పరం స్వీట్లు పంచుకుని సంతోషం వెలిబుచ్చారు. ఫైనల్లో విజయం సాధించి టైటిల్ గెలవాలని ఆకాంక్షించారు. తుదిపోరులోనూ హర్మన్‌ప్రీత్ రాణించాలని ఆమె తండ్రి హర్మీందర్ సింగ్ భుల్లర్ కోరుకున్నారు. భారత్ ప్రపంచకప్ గెలవాలని, జాతి గర్వించాలని ఆయన పేర్కొన్నారు. ఆడపిల్లలు సాధికారత సాధించేలా ప్రోత్సహించాలని హర్మన్‌ప్రీత్ అన్నారు. ‘ఆడపిల్లలను కడుపులోనే చంపడం మానుకోవాలి. దేశం గర్వించేలా నా కూతురు ఆడింది. మిగతా ఆడపిల్లలను కూడా ఇదే విధంగా ప్రోత్సహించాల’ని ఆమె పేర్కొన్నారు. హర్మన్‌ప్రీత్ ఇన్నింగ్‌ను వర్ణించడానికి మాటలు రావడం లేదని మహిళల క్రికెట్ మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ అన్నారు. పురుషుల క్రికెట్లోనూ ఇలాంటి ఇన్నింగ్స్ అరుదుగా చూస్తుంటామని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కౌర్ 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 171 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. కౌర్ సంచలన ఇన్నింగ్స్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. -
‘వివాదాన్ని సాగదీయదల్చుకోలేదు’
ముంబై: ఆసక్తికరంగా సాగుతున్న టెస్టు సిరీస్‌కు రివ్యూ వివాదం కారణంగా చెడ్డ పేరు రాకూడదనే తాము ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు బీసీసీఐ పరిపాలనా కమిటీ (సీఓఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీ వెల్లడించారు. ‘రివ్యూ అంశంపై బోర్డు సీఈఓ జోహ్రి, కోచ్ కుంబ్లేలతో సీఓఏ తీవ్రంగా చర్చించింది. మేం సిరీస్ సజావుగా సాగాలని కోరుకున్నాం. ఇలాంటి వివాదం ఆటకు మంచిది కాదని భావించాం. అందుకే దానిని మరింత సాగదీయకుండా ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాం. అదే విధంగా భారత కెప్టెన్‌కు బోర్డు అండగా నిలవలేదని ఎవరూ భావించకుండా మేం కోహ్లికి మద్దతుగా ప్రకటన విడుదల చేశాం’ అని ఎడుల్జీ వెల్లడించారు. మరోవైపు ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈ సదర్లాండ్ చేసిన విజ్ఞప్తి మేరకే భారత్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. -
బీసీసీఐకి కొత్త బాస్‌లు వచ్చారు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రోజువారీ కార్యకలాపాలు చూసేందుకు సుప్రీం కోర్టు నలుగురితో ఓ కమిటీ నియమించింది. బీసీసీఐ పాలక మండలి సభ్యులుగా కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఐడీఎఫ్సీ అధికారి విక్రమ్ లిమాయె, మహిళ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానాను నియమించింది. ఈ కమిటీకి వినోద్ రాయ్ సారథ్యం వహిస్తారు. సోమవారం సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త కమిటీలో టీమిండియా మాజీ క్రికెటర్లకు కానీ, బోర్డు మాజీ అధికారులకు కానీ స్థానం దక్కలేదు. మాజీ మహిళ క్రికెటర్ డయానాకు చోటు లభించింది. మిగిలిన ముగ్గురు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు. ఈ కమిటీలో కేంద్ర క్రీడల శాఖ మంత్రిని సభ్యుడిగా నియమించాలన్న కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయనందుకు సుప్రీం కోర్టు బీసీసీఐపై కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఈ కమిటీని నియమించింది.