ఆ ఇద్దరూ నన్ను అవమానించారు: మిథాలీ | Mithali Raj Says Coach Ramesh Powar Humiliated Her | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 27 2018 6:16 PM | Last Updated on Tue, Nov 27 2018 8:04 PM

Mithali Raj Says Coach Ramesh Powar Humiliated Her - Sakshi

మిథాలీ రాజ్‌

ముంబై : మహిళా టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో తనను అర్థాంతరంగా తప్పించడం వెనుక కోచ్‌ రమేశ్‌ పవార్‌, మాజీ కెప్టెన్‌, పరిపాలకుల కమిటీ (సీఓఏ) మెంబర్‌ డయానా ఎడుల్జీల హస్తం ఉందని సీనియర్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ ఆరోపించారు. తమ అధికారం అడ్డం పెట్టుకొని తనను తొక్కేయడానికి ప్రయత్నించారని మిథాలీ బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నట్లు పీటీఐ తెలిపింది. మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో మిథాలీని పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హర్మన్‌సేన దారుణంగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో మిథాలీని బెంచ్‌కు పరిమితం చేస్తూ.. జట్టు మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. 

ప్రపంచకప్‌ నెగ్గడానికి బంగారం లాంటి అవకాశం ఉన్న తరుణంలో కోచ్‌తో పాటు జట్టు మేనేజ్‌మెంట్‌ తీసుకున్న వివాదస్పద నిర్ణయం తనను నిరాశ పర్చిందని మిథాలీ పేర్కొంది. ‘నాకు వ్యతిరేకంగా డయానా తన అధికారాన్ని ఉపయోగించింది. నా 20 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌లో తొలి సారి నేను చాలా బాధపడ్డాను. అవమానానికి గురయ్యాను. అధికారంలో ఉండి నన్ను నాశనం చేయాలని, నా ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టాలనుకున్న కొందరు నా దేశానికి నేను చేసిన సేవలకు విలువనిస్తున్నారా అని ఆలోచించాల్సి వచ్చింది. నేను క్రికెట్‌ ఆడకుండా కొంతమంది కుట్రపన్నారు. నేను ఈ విషయంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌పై నాకెలాంటి వ్యతిరేకత లేదు. నన్ను జట్టు నుంచి తొలగించాలని చెప్పిన కోచ్‌ నిర్ణయానికి ఆమె మద్దతు ఇవ్వడమే ఎంతో బాధించింది. క్షోభకు గురిచేసింది. దేశం కోసం ప్రపంచకప్‌ గెలవాలనుకున్నా. కానీ మేం ఓ బంగారంలాంటి అవకాశం కోల్పోయాం. నాకు డయానా ఎడుల్జీ అంటే చాలా గౌరవం.

ఆమె నాకు వ్యతిరేకంగా పనిచేస్తుందని నేను కలలో కూడా ఉహించలేదు. నన్ను రిజర్వు బెంచీపై కూర్చోబెట్టడాన్ని ఆమె మీడియాలో సమర్థించడం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. కోచ్‌ పవార్‌ అయితే నెట్స్‌లో ఇతరులు బ్యాటింగ్‌ చేస్తుంటే అక్కడే నిలబడి చూసేవారు. నేను బ్యాట్‌ పట్టుకోగానే అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. ఆయనతో  మాట్లాడటానికి ఎంత ప్రయత్నించినా ముఖం చాటేసేవాడు. అది నాకు చాలా అవమానకరంగా ఉండేది. అయినా నేనెప్పుడు నా ప్రశాంతతను కోల్పోలేదు.’  అని మిథాలీ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది.  ఇక సోమవారం బోర్డు సీఈఓ రాహుల్‌ జోహ్రిని కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, మిథాలీ రాజ్‌, మేనేజర్‌ తృప్తి భట్టాచార్యలు వేర్వేరుగా సమావేశమై ఈ వివాదంపై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement